మూడు కోట్లిచ్చినా నో.. నో...
మూడు కోట్లిచ్చినా నో.. నో...
Published Wed, Dec 4 2013 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
హీరోలే కాదు... హీరోయిన్లు కూడా పారితోషికాల విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న రోజులివి. స్టార్ హీరోయిన్ అంటే... పారితోషికం కోటి రూపాయలకు పై మాటే. కథ, పాత్ర... ఈ రెండు అంశాల కంటే పారితోషికానికే ప్రస్తుతం కథానాయికలు పెద్ద పీట వేస్తున్నారు. ఎవరు ఎక్కువ పారితోషికం ఇస్తే వారి సినిమాలోనే నటించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి ట్రెండ్‌లో కూడా ఓ భారీ ఆఫర్‌ని తృణప్రాయంగా వదిలేశారు అనుష్క. ఫిలింనగర్‌లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఇదే. ఓ భారీ సంస్థ నిర్మించనున్న ద్విభాషా చిత్రంలో అనుష్కను నటింపజేయాలని సదరు నిర్మాత అనుకున్నారు.
ఈ సినిమాలో నటించినందుకు గాను అనుష్కకు మూడు కోట్ల రూపాయలు పారితోషికం ఇవ్వడానికి కూడా ఆయన వెనుకాడలేదనేది విశ్వసనీయ సమాచారం. కానీ అంతటి ఆఫర్‌నీ అనుష్క కాదనేశారట. అనుష్క నటించిన ‘వర్ణ’ చిత్రం ఇటీవలే విడుదలై ఘోర పరాజయాన్ని చవిచూసింది. అంతటి ఫ్లాప్ తర్వాత కూడా అనుష్కకు ఇసుమంతైనా క్రేజ్ తగ్గలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఒక వేళ ఈ ఆఫర్‌ని అనుష్క ఒప్పుకున్నట్లయితే... దక్షిణాదిన మూడు కోట్లు తీసుకున్న తొలి కథానాయికగా అవతరించేది అనుష్క. ప్రస్తుతం ఆమె రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
Advertisement