ధైర్యసాహసాలు అనగానే ఇంకో ఆలోచన లేకుండా రాణీ రుద్రమ పేరే గుర్తొస్తుంది! అలాంటి ధీశాలి బస్తర్ ప్రాంత చరిత్రలోనూ కనిపిస్తుంది! ఆమె పేరే చమేలీదేవి! ఛత్తీస్‌గఢ్ సర్కారు ఇటీవలే ఆమె విగ్రహాన్ని చిత్రకూట్ జలపాతం దగ్గర ప్రతిష్ఠించింది. ఆ కథతో కాకతీయులకు, కాకతీయులతో మనకు చారిత్రక సంబంధం ఉంది కాబట్టి ఒకసారి బస్తర్ దాకా వెళ్లొద్దాం..
తెలుగు నేలను పాలించిన రాజవంశాల్లో కాకతీయులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా రాణి రుద్రమ పురుషాధిక్యతను ఎదుర్కొంటూ మంచి ఏలికగా పేరు తెచ్చుకుంది. ఆమె తర్వాత పాలనా పగ్గాలు ప్రతాపరుద్రుడి చేతికి వచ్చాయి. అదే సమయంలో ఢిల్లీ సుల్తానులు, మహారాష్ట్ర దేవగిరి రాజుల దాడులు పెరిగాయి. ముందు జాగ్రత్తగా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పనిని తన తమ్ముడైన అన్నమదేవుడికి అప్పగించాడు ప్రతాపరుద్రుడు. ఆ బాధ్యతలో భాగంగా గోదావరి నది దాటి దండకారణ్యంలో కొత్త రాజ్యస్థాపనకు బయల్దేరాడు అన్నమదేవుడు. ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ క్రీ.శ. 1323 కల్లా ఇంద్రావతి నదీ సమీపంలోని బర్సూర్ ప్రాంతానికి చేరుకున్నాడు.
పరిచయం..
ఆ ఇంద్రావతి నదీ తీర ప్రాంతాన్ని నాగవంశీయుడైన హరి చంద్రదేవ్ పాలిస్తున్నాడు. అతనికి చమేలీదేవి అనే కూతురు ఉంది. గొప్ప అందగత్తె. కళలతో పాటు రాజకీయ, రణతంత్రాలలో శిక్షణ పొందింది. తండ్రికి పాలనా వ్యవహరాల్లో సాయమందించేది. ఇంద్రావతి నదీ తీరాన్ని గెలవాలని నిర్ణయించుకున్న అన్నమదేవుడు దండకారణ్యాన్ని ఏలుతున్న హరి చంద్రదేవ్‌కు రాయబారం పంపాడు. యువరాణి చమేలీదేవిని తనకిచ్చి వివాహం జరిపించాలని, ఆ ఒప్పందానికి సమ్మతం తెలిపితే హరి చంద్రదేవ్‌ను రాజుగా కొనసాగిస్తామంటూ సందేశం పంపాడు.
ఆత్మగౌరవం..
కనీసం తన ఇష్టాయిష్టాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా పెళ్లి ప్రతిపాదన తేవడాన్ని చమేలీదేవి వ్యతిరేకించింది. పెళ్లికి యుద్ధానికి లంకె పెట్టడాన్ని తప్పుపట్టింది. అన్నమదేవుడి ప్రతిపాదనను అంగీకరిస్తే నాగవంశీయుల ప్రతిష్ఠకు భంగమంటూ తేల్చి చెప్పింది. పెళ్లితో వచ్చే రాజ్యం, మర్యాదల కంటే యుద్ధంతో తేలే ఏ ఫలితమైనా మేలంటూ తండ్రిని ఒప్పించింది. యుద్ధరంగంలోనే అమీతుమీ తేల్చుకుందామంటూ అన్నమదేవుడికి ఘాటైన సమాధానం పంపింది.
ఆత్మార్పణం..
లోహండిగూడ వద్ద నాగవంశీయులు, కాకతీయల సైన్యానికి మధ్య హోరాహోరీ పోరు మొదలైంది. మహారాజు హరి చంద్రదేవ్‌కు తోడుగా యువరాణి చమేలీదేవి యుద్ధ క్షేత్రానికి చేరుకుంది. యుద్ధం మూడోరోజున తీవ్రంగా గాయపడిన హరి చంద్రదేవ్ మరణించాడు. ఆ మరుసటి రోజు కోటలో రాజు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుండగా వారిని వెంటాడుతూ వచ్చిన కాకతీయ సైన్యాలు కోటను చుట్టుముట్టాయి. తీవ్ర నిర్భంధం మధ్య తండ్రి అంత్యక్రియలను కొనసాగించిన చమేలీదేవీ చివరకు ఆత్మాహుతికి పాల్పడినట్టుగా చెబుతారు. చమేలీదేవి ప్రాణత్యాగంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ అన్నమదేవుడికి ఎదురు నిలిచిన వైనం, ఆత్మాభిమానం, «ధైర్యసాహసాలు, రాజకీయ చతురతలపై మాత్రం ఏకాభిప్రాయం ఉంది. అందుకు బస్తర్ దసరా వేడుకల్లో నేటికీ కొనసాగుతున్న సంప్రదాయలే నిదర్శనం.
ఆరాధనం..
బస్తర్‌లో ఏటా దసరా వేడుకలను 75 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. బస్తర్ మహారాజు.. దంతేశ్వరి మాత దర్శనానికి వెళ్లే రథాన్ని మల్లెపూలతో అలంకరిస్తారు. ఈ పువ్వులను చమేలీదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. రథం ఆలయానికి చేరిన తర్వాత స్థానికులు ఆ పువ్వులను తమ తలపాగాల్లో ధరిస్తారు గౌరవ సూచకంగా. అనంతరం వాటిని చిత్రకూట్ జలపాతానికి ఎగువ భాగంలో నిమజ్జనం చేస్తారు. అంతేకాదు ఇక్కడున్న అనేక గిరిజన తెగలు చమేలీదేవి ధైర్యసాహసాలు, ప్రాణత్యాగానికి గుర్తుగా కలశాల్లో దీపారాధన చేస్తారు. చమేలీదేవి మరణానికి కారణమైనందుకు ప్రాయశ్చిత్తంగా అన్నమదేవుడే ఈ సంప్రదాయాలకు చోటు కల్పించినట్టుగా చెబుతారు. ఏడువందల ఏళ్లకు పైగా ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. ఇటీవలే.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఇండియా నయాగరాగా పేరొందిన చిత్రకూట్ (ఇంద్రావతి నది) జలపాతం దగ్గర యువరాణి చమేలీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆమెను గౌరవించింది. – తాండ్ర కృష్ణ గోవింద్, సాక్షి, కొత్తగూడెం
Comments
Please login to add a commentAdd a comment