
యాక్షన్‌లోకి గోన గన్నారెడ్డి
కాకతీయ సామ్రాజ్ఞి రాణీ రుద్రమ జీవిత కథ ఆధారంగా అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
కాకతీయ సామ్రాజ్ఞి రాణీ రుద్రమ జీవిత కథ ఆధారంగా అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు గుణశేఖర్ ‘రుద్రమదేవి’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రుద్రమగా అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే రానా, సుమన్, కృష్ణంరాజు, నిత్యామీనన్, కేథరిన్ తదితర స్టార్లు కీలక భూమికలు పోషిస్తున్నారు.
వీరితో పాటు ఇప్పుడు క్రేజీ స్టార్ అల్లు అర్జున్ కూడా తోడవ్వడం విశేషం. కథలో కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రను ఇందులో బన్నీ పోషించనున్నారు. ఈ పాత్ర కోసం ఇప్పటికే ఆయన ఎంతో పరిశోధన జరిపి, పాత్రకు తగ్గట్టు పలు యుద్ధ విధ్యలను అభ్యసించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు శుక్రవారం గోన గన్నారెడ్డిగా ‘రుద్రమదేవి' సెట్‌లోకి అడుగుపెట్టేశారు అల్లు అర్జున్. ఆ గెటప్‌లో బన్నీ లుక్ అద్భుతమని యూనిట్ సభ్యుల సమాచారం.
40 రోజుల పాటు బన్నీపై చిత్రీకరించే సన్నివేశాలతో ‘రుద్రమదేవి’ షూటింగ్ పూర్తవుతుందని గుణశేఖర్ తెలిపారు. ఇంకా ఆయన చెబుతూ- ‘‘పద్మశ్రీ తోట తరణి వేసిన ఏడు కోట గోడల అద్భుతమైన సెట్‌లో గోన గన్నారెడ్డి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. బన్నీ నట విశ్వరూపాన్ని ఇందులో చూస్తారు. ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్‌తో పాటు అనుష్క, రానా, ప్రకాశ్‌రాజ్, కృష్ణంరాజు, హంసానందిని తదితరులు కూడా పాల్గొంటారు.
గోన గన్నారెడ్డి పాత్ర ఈ సినిమాకే ఓ మణిమకుటం లాంటిది. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని గుణశేఖర్ చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: ఇళయరాజా, కెమెరా: అజయ్ విన్సెంట్, కూర్పు: శ్రీకరప్రసాద్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్‌గోపాల్, సమర్పణ: రాగిణి గుణ.