నంబర్‌గేమ్స్ మీద నమ్మకం లేదు! : అనుష్క | i won't believe in number games : anushka | Sakshi
Sakshi News home page

నంబర్‌గేమ్స్ మీద నమ్మకం లేదు! : అనుష్క

Published Sun, Dec 15 2013 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

నంబర్‌గేమ్స్ మీద నమ్మకం లేదు! :  అనుష్క

నంబర్‌గేమ్స్ మీద నమ్మకం లేదు! : అనుష్క

తారాస్వరం
 
     నేను అన్నిటినీ పాజిటివ్‌గా తీసుకునే వ్యక్తిని. కష్టపడి పని చేస్తాను. ఓర్పుగా ఉంటాను. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను నేను నమ్ముతాను!
 
     నా లైఫ్‌లో ముఖ్యమైన మలుపులు చాలా ఉన్నాయి. సినిమాల్లోకి రావడం పెద్ద మలుపే. అయితే అసలు యోగా టీచర్ కావడమన్నది అంతకంటే పెద్ద మలుపు. ఇంటినిండా డాక్టర్లు, ఇంజినీర్లే ఉంటే... నేను యోగా టీచరవుతానంటే ఎలా ఉంటుంది! అయినా ఒప్పించాను. అది ఇప్పటికీ ఓ మెమరబుల్ మూమెంట్!
 
     ఒక సినిమా హిట్ అవ్వగానే ఆ హీరోహీరోయిన్లది హిట్ కాంబినేషన్ అనేస్తారు. పొరపాటున ఫెయిలయ్యిందో... వాళ్ల కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదని పెదవి విరుస్తారు. హిట్ సినిమాలో తప్పులున్నా ఎవరూ పట్టించుకోరు గానీ, ఫ్లాప్ సినిమాలో ప్రతి చిన్నదానిలోనూ తప్పులే కనబడుతుంటాయి అందరికీ!
 
     ‘రుద్రమదేవి’లో చేయడానికి ఒప్పుకున్న తరువాత ఇంటర్నెట్లో కాకతీయుల చరిత్ర చదువుదామని ప్రయత్నించాను. కానీ ఒక్కో వెబ్‌సైట్లో ఒక్కోలా రాసి ఉంది. దాంతో కన్‌ఫ్యూజై వదిలేశాను. గుణశేఖర్ ఎలా చెబితే అలా ఫాలో అవుతున్నాను. నా లైఫ్‌లో ఇదో బెస్ట్ పాత్ర అవుతుందని నా నమ్మకం!
 
     కలలో కూడా ఊహించని పాత్ర ‘బాహుబలి’ ద్వారా వెతుక్కుంటూ వచ్చింది.  ప్రభాస్‌తో మూడోసారి చేస్తున్నాను. రాజమౌళిగారితో రెండోసారి పని చేస్తున్నాను. ‘ఆయన హీరోయిన్స్‌ని రిపీట్ చేయరు’ అంటుంటారు. బహుశా ఆ అదృష్టం నాకే దక్కినట్టుంది!
 
     నచ్చే పని చేసేటప్పుడు ఎంత కష్టమైనా భరించే శక్తి వస్తుంది. అందుకే కత్తియుద్ధాలు, గుర్రపుస్వారీలు చేయడం వంటి వాటిని చేయగలిగాను. వర్ణకోసం జోర్డాన్‌లో తొంభై రోజులు షూటింగ్ చేశాం. కనీస సౌకర్యాలు కూడా లేవు. బాత్‌రూమ్స్ కూడా సరిగ్గా లేవు. వేణ్నీళ్లు ఉండేవి కాదు. అయినా అవన్నీ తట్టుకుని షూటింగ్ చేశాం.
 
     నాకు నంబర్ గేమ్స్ మీద నమ్మకం లేదు. అందరూ అనడమే తప్ప నేనెప్పుడూ నంబర్‌వన్ పొజిషన్ గురించి ఆలోచించలేదు. మంచి పాత్రలు ఎంచుకుంటాను. డెరైక్టర్ చెప్పింది చేసుకుంటూ పోతాను. అంతకుమించి మరేమీ ఆలోచించను. డబ్బుల విషయంలో కూడా అంతే. రెమ్యునరేషన్ కోసం ఎప్పుడూ ఏ నిర్మాతనీ ఇబ్బంది పెట్టలేదు. నిర్మాతలు కూడా నన్ను చూసి డబ్బు పెట్టడం లేదు. అందరం కథకు లోబడి పని చేయాల్సిందే!
 
     హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు బాగానే వస్తున్నాయిప్పుడు. దీనికి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డిగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన హీరోయిన్ల మీద భారీగా ఖర్చుపెట్టి సినిమాలు తీసి, హిట్ చేసి చూపించారు. అందుకే మిగతా నిర్మాతలు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు తీయడానికి ముందుకొస్తున్నారు. గుణశేఖర్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు!
 
  జీవితంలో గెలుపోటములు రెండూ ఉంటాయి, ఉండాలి కూడా. ఓడిపోయినప్పుడు కాస్త బాధ అనిపిస్తుంది. కానీ ఎక్కడ తప్పు చేశామా అని పరిశోధించి, వాటిని సరి చేసుకోవడం వల్ల పర్‌ఫెక్షన్ వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... గెలిచినప్పుడు సంతోషపడటమే కాదు, ఓడిపోయినప్పుడు మనలోని లోపాన్ని కూడా ఒప్పుకోవాలి!
 
  అందం కోసం పనిగట్టుకుని వర్కవుట్లు చేయడం ఇష్టం ఉండదు నాకు. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తాను. క్రమం తప్పకుండా యోగా చేస్తాను కాబట్టి వేరే ఏదీ చేయాల్సిన అవసరం లేదు!
  పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారంతా. ఇప్పుడప్పుడే కాదు గానీ త్వరలోనే చేసుకుంటాను. పెళ్లి అనేది ప్లాన్ చేసి చేసుకునేది కాదు అని నా అభిప్రాయం. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. అయినా... రుద్రమదేవి, బాహుబలి లాంటి రెండు పెద్ద ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించేంత సమయం ఎక్కడ దొరుకుతుంది!
 
  కత్తియుద్ధాలు, భారీ పాత్రలు చేసి చేసీ కాస్త బోరు కొట్టింది. కాకపోతే అలాంటి కథలు అరుదుగా వస్తాయి కాబట్టి చేస్తున్నాను. కానీ వరుసగా అలాంటివే చేయడం కాస్త ఇబ్బందే. అందుకే కొన్నాళ్ల వరకూ మళ్లీ అలాంటి పాత్రలు చేయకూడదని అనుకుంటున్నాను. లైట్‌గా, సింపుల్‌గా ఉండే రెగ్యులర్ పాత్రలే చేస్తానిక!

 పుట్టినరోజు: నవంబర్ 7
 జన్మస్థలం: మంగుళూరు
 మాతృభాష: తుళు
 చదువు: బీసీఏ
 నచ్చే రంగులు: నలుపు, తెలుపు
 నచ్చే దుస్తులు: చీరలు
 నచ్చే ప్రదేశం: లండన్
 నచ్చే కారు: స్విఫ్ట్
 నచ్చిన పుస్తకాలు: ద అల్‌కెమిస్ట్, ట్యూజ్‌డేస్ విత్ మోరీ
 నచ్చే హీరోలు: హృతిక్ రోషన్, మహేశ్‌బాబు
 నచ్చే హీరోయిన్లు: కాజోల్, సౌందర్య

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement