రుద్రమగా బిజీ బిజీ...
రుద్రమగా బిజీ బిజీ...
Published Wed, Sep 4 2013 12:30 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
కాకతీయ ప్రాభవాన్ని జగతికి చాటిన వీరనారి రాణీ రుద్రమదేవి చరిత్ర ఆధారంగా గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి’. టైటిల్ రోల్ అనుష్క పోషిస్తున్న విషయం తెలిసిందే. దేశంలోనే తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ త్రీడిగా రూపొందుతోన్న ఈ చిత్రం 40 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ చిత్రం గురించి గుణశేఖర్ చెబుతూ -‘‘నాటి కాకతీయ చరిత్రకు దర్పణంలా ఈ చిత్రం ఉంటుంది. అలనాటి వైభవాన్ని కళ్లకు కట్టేలా తోట తరణి అద్భుతమైన సెట్‌లు నిర్మిస్తున్నారు.
కాకతీయ సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా ప్రాంతాల్లో విస్తరించి ఉండేది. అందుకే 13వ శతాబ్దం నాటి ఆయా ప్రాంతాల వాతావరణాన్ని ప్రతిబింబించేలా అన్నపూర్ణ ఏడెకరాల్లో తోట తరణి సెట్స్ వేస్తున్నారు. ఓ వైపు సెట్స్ నిర్మాణం జరుగుతుంటే, మరో వైపు ఈ నెల 2 నుంచి షూటింగ్‌ని కూడా కానిచ్చేస్తున్నాం. ఈ భారీ సెట్‌లో భాగ మైన కాకతీయ సామ్రాజ్యంలోని పాకనాడు(ఇప్పటి ప్రకాశం జిల్లా) సెట్‌లో రుద్రమదేవి అనుష్క, నిడవర్ధ్యప్రోలు (ఇప్పటి నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రుడు రానాలపై కీలక సన్నివేశాలు తీస్తాం.
వీటితో పాటు అజయ్, రవిప్రకాష్, శివాజీరాజా, కాదంబరి కిరణ్, పాకనాడు గ్రామ ప్రజలుగా నటిస్తున్న వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా సన్నివేశాలను చిత్రీకరిస్తాం. అలాగే... ఓరుగల్లు కోట నుంచి వెయ్యి స్థంభాల గుడి వరకూ అప్పట్లో ఓ సొరంగం ఉండేది. ఆ సెట్‌ని అబ్బురపరిచేలా వేశారు తోట తరణి. ఆ సెట్‌లో అనుష్క, నాగదేవుడిగా నటిస్తున్న బాబా సెహగల్‌పై కొన్ని సన్నివేశాలు తీస్తాం. ఈ భారీ సెట్‌లో మరో భాగం దివిసీమ ప్రాంతం సెట్. ఈ సెట్‌లో చిన్నారి రుద్రమగా నటిస్తున్న హీరో శ్రీకాంత్ కుమార్తె మేధ, శివదేవయ్యగా నటిస్తున్న ప్రకాష్‌రాజ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం.
ఈ నెల 17 దాకా ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. మళ్లీ వచ్చే 1 నుంచి నాలుగవ షెడ్యూల్ మొదలవుతుంది. ఇప్పటివరకూ తీసిన పాటలు, సన్నివేశాలు అద్భుతం అనిపించేలా వచ్చాయి. భారత చలనచిత్ర చరిత్రలో ‘రుద్రమదేవి’ చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అవుతుంది’’అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: ఇళయరాజా, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కెమెరా: అజయ్ విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకరప్రసాద్, కాస్ట్యూమ్స్ డిజైనర్: నీతా లుల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కె.రామ్‌గోపాల్.
Advertisement