నా విజయ రహస్యం అదే!
కృష్ణంరాజు గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. శక్తిమంతమైన పాత్రలకు చెరగని చిరునామా ఆయన. ఇటీవలి కాలంలో ఆయన చాలా ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘ఎవడే సుబ్రమణ్యం’లోని రామయ్య పాత్ర ఆ సినిమాకుకీలకంగా నిలిచి, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఈ మధ్యకాలంలో పాత్రల ఎంపికలో చాలా సెలక్టివ్‌గా ఉంటున్నారు. ‘ఎవడే సుబ్రమణ్యం’లో రామయ్య పాత్ర చేయడానికి కారణం?
ఒక సినిమా టైటిల్ కార్డ్‌లో నా పేరు ఉందంటే.. సహజంగానే ఆ పాత్రపై ప్రేక్షకులకు అంచనాలుంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా లేకపోతే ‘ఎందుకీ పాత్ర చేయాల్సి వచ్చింది’ అనుకుంటారు. మొహమాటంతో స్నేహం కొద్దీ ఆ మధ్య చేసిన రెండు, మూడు పాత్రలు మామూలుగా ఉన్నాయి. దాంతో, అభిమానులు అసంతృప్తికి గురయ్యారు.
అందుకే, కారెక్టర్‌లో ‘దమ్ము’ ఉంటేనే అంగీకరిస్తున్నా. దాదాపు రెండు వందల సినిమాలు చేసిన నా దగ్గరకొచ్చి ఓ పాత్రకు అడిగారంటే, ఆ పాత్ర ఎంతో గొప్పగా ఉండాలి. నేను చేయడం ద్వారా ఆ సినిమాకి హెల్ప్ అవ్వాలి. అశ్వనీదత్ నాకు మంచి స్నేహితుడు కావడం కూడా ఈ సినిమా చేయడానికి ఒక కారణం. అతను నన్ను ‘మావా’ అని పిలుస్తాడు. అశ్వనీదత్ కూతుళ్లు స్వప్నాదత్, ప్రియాంకా దత్ ినా దగ్గరికొచ్చి. ‘ఓ వైవిధ్యమైన కథాంశంతో సినిమా చేస్తున్నాం. ఇందులో కీలక పాత్రను మీరు చేస్తే బాగుంటుంది’ అన్నారు. తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ కథ చెప్పినప్పుడు, అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందనిపించింది. నా పాత్ర కూడా బాగా నచ్చింది.
మరి, ఈ పాత్ర ఎలాంటి తృప్తినిచ్చింది?
రామయ్య పాత్ర సినిమాకు కీలకం. హీరోలో మంచి మార్పు రావడానికి కారణంగా నిలిచే పాత్ర. మామూలుగా ఓ సినిమాలో పూర్తి స్థాయి పాత్ర చేస్తే ఎన్ని అభినందనలు వస్తాయో, ఈ పాత్రకు అన్ని వచ్చాయి. బోల్డన్ని ఫోన్ కాల్స్, లెటర్స్ వచ్చాయి. కొంతమందైతే ‘సార్.. మీ వల్లే సినిమా ఆడుతోంది’ అన్నారు. అది అభిమానంతో అనే మాట. ఈ సినిమా విజయానికి నేనో కారణం మాత్రమే. ఓవరాల్‌గా సినిమా చాలా బాగుంటుంది. రామయ్య పాత్ర గెటప్ చాలా బాగుంటుంది. చిన్ని చిన్ని సంభాషణలతో, ఎదుటి వ్యక్తిని ప్రభావితం చేసే హావభావాలతో సాగే ఆ పాత్రకు మంచి నటన కనబరచడానికి కుదిరింది. దాంతో నటుడిగా సంతృప్తినిచ్చింది.
ఒక పాత్ర అంగీకరించిన తర్వాత మీరు చేసే కసరత్తులు ఎలా ఉంటాయి?
నేనే పాత్ర చేసినా నేను కనిపించకుండా ఆ పాత్రే కనిపించాలనుకుంటాను. ఈ విషయంలో నాకు ఎస్వీ రంగారావుగారు ఆదర్శం. నా తొలి చిత్రం ‘చిలకా గోరింక’లో ఆయన కాంబినేషన్లో చేశాను. మొదటి సినిమాకే అంతటి నటుడితో చేయడం, అది కూడా ఆయనకు దీటైన పాత్ర కావడంతో చాలా పట్టుదలగా చేశాను. ఎస్వీ రంగారావుగారు చాలా మెచ్చుకున్నారు. ఆ సమయంలో ఆయనో సలహా కూడా ఇచ్చారు. అదేంటంటే, ‘‘నువ్వు ఒక పాత్ర ఒప్పుకున్న తర్వాత, షూటింగ్‌లో క్లోజ్ షాట్ పెట్టి ‘అక్కడ చూడండి’ అని దర్శకుడంటే ‘ఎందుకు చూడాలి?’ అనడగాలి. అదే భయపడే సీన్ అయితే ‘దేనికి భయపడాలి. పులిని చూసినప్పుడు కలిగే భయం ఒకలా ఉంటుంది. మనిషిని చూస్తే ఒకలా ఉంటుంది? నా భయం ఎలా ఉండాలి’ అని అడగాలి. అలా ఓ పది ప్రశ్నలేసి డెరైక్టర్‌ను విసిగిస్తే, అతను తనకేం కావాలో బాగా వివరిస్తాడు. అప్పుడు మనం కూడా సహజమైన నటన కనబర్చగలుగుతాం. పాత్రకు ఎలాంటి హావభావాలు కనబరచాలో తెలుసుకోగలుగుతాం’ అన్నారు. ఆ మాటలు నా మీద బాగా పని చేశాయి. అప్పటి నుంచీ దర్శకుడు తాను అనుకున్నది వివరంగా చెప్పేవరకూ ప్రశ్నించడం నేర్చుకున్నా. నా విజయ రహస్యం కూడా అదే.
తెలుగు నటీనటులు, ఇతర భాషల నటీనటులను పోలిస్తే... ‘సహజమైన నటన’ ప్రదర్శించే తారల సంఖ్య ఎక్కడ ఎక్కువగా ఉంది?
నిస్సంకోచంగా తెలుగు పరిశ్రమకు చెందిన నటీనటులే అంటాను. అప్పట్లో తమిళ పరిశ్రమలో అగ్రహీరోలుగా రాణించినవారిలో చాలామంది ఎక్కువ డ్రామా పండించేవారు. ఉదాహరణకు శివాజీ గణేశన్ భారీ డైలాగ్‌లతో, అంతకు మించిన నటనతో ప్రేక్షకులు చప్పట్లు కొట్టేలా చేసేవారు. ఎస్వీ రంగారావుగారు కూడా భారీ డైలాగులు చెప్పారు. కానీ, నటనలో డ్రమటైజేషన్ ఉండదు. ఒక సినిమాలో కేవలం కంటి చూపుతో ఆయన పలికించిన హావభావాలకు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. ఎస్వీ రంగారావుగారు, కన్నాంబగారు... ఇలా కొంతమంది నటీనటులు నటించినట్లుగా ఉండదు. జీవించినట్లుగా ఉంటుంది. తమిళ, హిందీ రంగాల్లో కన్నా మన తెలుగు పరిశ్రమలోనే సహజత్వానికి దగ్గరగా నటించే తారలు ఎక్కువ ఉన్నారు.
గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా తీస్తున్న ‘రుద్రమదేవి’లో మీ పాత్ర గురించి?
ఇందులో నాది గణపతిదేవుడి పాత్ర. చారిత్రక పాత్ర కాబట్టి, సంభాషణలు శక్తిమంతంగా ఉంటాయి. అయితే అవి ఉపన్యాసం తరహాలో ఉండవు. చిత్రానికి కీలకమే కాక, నటనకు అవకాశం ఉన్న పాత్ర. గెటప్ కూడా బాగుంటుంది. కొంతమంది ఈ చిత్రం రషెస్ చూశారు. చాలా బాగుందన్నారు. నాక్కూడా సంతృప్తికరంగా అనిపించింది.
ఎప్పట్నుంచో మీ దర్శకత్వంలో ‘ఒక్క అడుగు’ సినిమా చేయాలనుకుంటున్నారు కదా! దాని గురించి?
అవును. అప్పటి ఎన్నికల నేపథ్యంలో కథ తయారు చేశాం. కానీ, ఎన్నికలు పూర్తి కావడంతో వాయిదా వేశాం. ఇప్పుడా కథను మార్చేశాం. తప్పకుండా ఈ చిత్రం ఉంటుంది.