కొన్ని సినిమాలు అనౌన్స్‌మెంట్ దశ నుంచే ఆసక్తి రేకెత్తిస్తాయి. ఇక మేకింగ్ మొదలైన దగ్గర్నుంచీ ఆ సినిమాకు సంబంధించిన ప్రతి వార్తా సంచలనమే. అలాంటి క్రేజీయెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్టులు అరుదుగానే తయారవుతుంటాయి. ప్రస్తుతం దక్షిణాదిలో అలాంటి నాలుగు ఆసక్తికరమైన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. కంటెంట్... కాన్సెప్ట్... కాంబినేషన్స్... మేకింగ్... టేకింగ్... బడ్జెట్... స్టార్ ఇమేజ్... జానర్... వర్కింగ్ స్టయిల్... టెక్నాలజీ... వీటన్నిటి పరంగా ఈ నాలుగు చిత్రాలు ‘టాక్ ఆఫ్ ది సౌత్’ అనిపించుకుంటున్నాయి. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా, అనురక్తిగా వేయి కళ్లతో ఎదురు చూస్తోన్న ఆ నాలుగు సినిమాల విశేషాల సమాహారమిది.
బాహుబలి
తారాగణం : ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా తదితరులు
దర్శకత్వం : ఎస్.ఎస్.రాజమౌళి
నిర్మాతలు : శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
ఛాయాగ్రహణం : సెంథిల్ కుమార్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
జానర్ : జానపదం
షూటింగ్ ప్రారంభం: 2013 జూలై 6న కర్నూలులో
నిర్మాణ వ్యయం : సుమారు రూ. 100 కోట్లు
విడుదల : 2015
ప్రత్యేకత : రెండు భాగాలుగా విడుదల
ప్రభాస్ ‘మిర్చి’ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రాజమౌళితో సినిమా చేయాలని వేరే కమిట్‌మెంట్స్ పెట్టుకోలేదు. ఇందులో పాత్రకు తగ్గట్టుగా తన శరీరాకృతిని మార్చుకున్నారు.
అనుష్క కూడా అంతే. తన పాత్ర కోసం గుర్రపు స్వారీ, కత్తి సాములో శిక్షణ పొందారు.
ఇందులో ప్రభాస్‌ది ద్విపాత్రాభినయం. ఒక పాత్ర పేరు బాహుబలి కాగా, మరో పాత్ర పేరు శివుడు.
బాహుబలి సరసన అనుష్క, శివునికి జోడీగా తమన్నా చేస్తున్నారు.
రానా, రమ్యకృష్ణ లాంటి ప్రముఖ తారలు కూడా ఇందులో నటిస్తున్నారు.
ఇండస్ట్రీలో ఉన్న మేకప్‌మేన్లు, కాస్ట్యూమర్లు దాదాపుగా ఈ సినిమాకు పని చేస్తున్నారు.
కర్నూలు, కేరళ, కర్ణాటకల్లో ఇప్పటి వరకూ షూటింగ్ చేశారు. ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీలో భారీ షెడ్యూల్ చేస్తున్నారు. డిసెంబర్ 23న మొదలైన ఈ షెడ్యూల్ మార్చి 5 వరకూ జరుగనుంది. ప్రస్తుతం యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించి ఏ విషయమూ బయటకు పొక్కకుండా రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్, అనుష్క, తమన్నా బర్త్‌డేలకు మాత్రం ఫస్ట్‌లుక్, కొంత సమాచారం రిలీజ్ చేశారు.
ఈ ఏడాది అంతా ఈ సినిమా వర్క్ నడుస్తుందని సమాచారం.
2015లో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేసే యోచనలో ఉన్నారట రాజమౌళి.
తెలుగు, తమిళ భాషల్లో రూపొదుతోన్న ఈ చిత్రాన్ని మలయాళం, హిందీతో పాటు విదేశీ భాషల్లో కూడా అనువదిస్తారు.
రుద్రమదేవి
తారాగణం : అనుష్క, రానా, నిత్యామీనన్, కృష్ణం రాజు తదితరులు
నిర్మాత, దర్శకుడు : గుణశేఖర్
ఛాయాగ్రహణం : అజయ్ విన్సెంట్
సంగీతం : ఇళయరాజా
జానర్ : చారిత్రకం
షూటింగ్ ప్రారంభం : 2013 ఏప్రిల్ వరంగల్‌లో
నిర్మాణ వ్యయం : సుమారు రూ. 40-50 కోట్లు
విడుదల : 2014 వేసవిలో
ప్రత్యేకత : తొలి భారతీయ చారిత్రక త్రీడీ చిత్రం
భారతదేశ చరిత్రలో 40 ఏళ్ల పాటు ఒక సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక మహిళ... రాణీ రుద్రమదేవి. ఆమె చరిత్రని చాలా ఇన్‌స్పయిరింగ్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు గుణశేఖర్.
13వ శతాబ్దం తాలూకు కథ కాబట్టి, అప్పటి వాతావరణాన్ని, పరిస్థితుల్ని యధాతథంగా ప్రెజెంట్ చేయడానికి ఎన్నో కసరత్తులు చేస్తున్నారు.
ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీతాలుల్లా ఈ టీమ్‌కి మెయిన్ ఎస్సెట్.
కళాదర్శకుడు తోట తరణి ఈ సినిమాకు మూలస్తంభం. అద్భుతమైన సెట్లు వేస్తున్నారాయన. అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో వేయిస్తంభాల గుడిని అచ్చు గుద్దినట్టుగా దింపేశారు. అలాగే మొగిలిచెర్ల ఏకవీరాదేవి గుడి, ఏడు కోట గోడలు, అప్పటి పల్లెటూళ్లు, రాజమందిరాలు, దర్బార్‌లు... వీటన్నిటినీ ఎంతో శ్రద్ధతో సెట్లు వేస్తున్నారు.
ఈ సినిమా కోసం సుమారు 60 అడుగుల ఎత్తున్న సెట్ వేశారు. ఆ సెట్‌లోకి వెళ్లడం కోసం ఏకంగా లిఫ్ట్ ఏర్పాటు చేశారు.
అలాగే చిన్న సెటప్‌కి కూడా పేరున్న తారలనే ఎంచుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం దగ్గర ఇటీవలే అనుష్క, రానాపై ఒక పాట, కొన్ని సీన్లు తీశారు. ఈ లొకేషన్‌లో సినిమా షూటింగ్ జరగడం ఇదే తొలిసారట.
ఝ గ్రాఫిక్స్‌కి అధిక ప్రాధాన్యం ఉంది. అసలే త్రీడీ మూవీ కాబట్టి మైన్యూట్ డీటైల్స్‌ని కూడా వర్కవుట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ 400, 500 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉండడం విశేషం.
ఇప్పటికి 65 శాతం సినిమా పూర్తయింది.
కోచ్చడయ్యాన్
తారాగణం : రజనీకాంత్, దీపికా పదుకొనే, శరత్‌కుమార్, శోభన తదితరులు
దర్శకత్వం : సౌందర్య, ఆర్.అశ్విన్
నిర్మాతలు : సునందమురళీమనోహర్, సునీల్ లుల్లా
ఛాయాగ్రహణం : రాజీవ్ మీనన్
సంగీతం : ఎ.ఆర్. రెహమాన్
జానర్ : జానపదం
షూటింగ్ ప్రారంభం: 2012 మార్చి
నిర్మాణ వ్యయం : సుమారు రూ. 125 కోట్లు
విడుదల : 2014 ఏప్రిల్ 10న
ప్రత్యేకత : తొలి భారతీయ త్రీడీ మోషన్ కాప్చర్ కంప్యూటర్ యానిమేటెడ్ చిత్రం
‘రోబో’ తర్వాత కేయస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రాణా’ సినిమా చేయాలనుకున్నారు రజనీకాంత్. ప్రారంభ వేడుక కూడా జరిగింది. అయితే రజనీ ఆ తర్వాత అనారోగ్యం పాలవ్వడంతో ‘రాణా’ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టేశారు.
ఆ తర్వాత రజనీ పెద్ద కూతురు సౌందర్య ‘కోచ్చడయాన్’ సినిమా అనౌన్స్ చేశారు. ‘రాణా’ కథకి ప్రీక్వెల్ ఇదని ఆమె ప్రకటించారు కూడా.
జేమ్స్ కేమరూన్ సృష్టించిన ‘అవతార్’ హాలీవుడ్ చిత్రం తరహాలో త్రీడీ మోషన్ కాప్చర్ కంప్యూటర్ యానిమేషన్ పరిజ్ఞానంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇండియాలో ఈ పరిజ్ఞానంతో తీసిన తొలి సినిమా ఇదే.
రజనీకాంత్ ఫేస్‌ని స్కాన్ చేయగా వచ్చిన రూపంతో త్రీడీలో ఓ మోడల్ తయారు చేశారు. ఆ మోడల్ స్కిన్‌ని టైట్ చేస్తే ‘ముత్తు’లో రజనీలాంటి రూపం వచ్చింది. రజనీ ఇందులో మూడు యానిమేటెడ్ పాత్రల్లో కనిపిస్తారు.
మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్న నీతాలుల్లా కాస్టూమ్స్ డిజైన్ చేశారు. ఇందుకోసం 8 నెలలు కసరత్తులు చేశారు. రజనీ యుద్ధ వీరుడి గెటప్ కోసమైతే దాదాపు 30 స్కెచ్‌లు వేశారామె.
ఝ తమిళనాడుకి చెందిన పాండ్యవంశ రాజు ‘కోచ్చడయ్యాన్ రణబీరన్’ జీవిత చరిత్రకు కొంత కాల్పనికతను జోడించి ఈ కథ తయారు చేశారు.
మలయాళం, హిందీ, ఇంగ్లిష్, జపనీస్, ఇటాలియన్, స్పానిష్ భాషల్లో ఈ చిత్రం అనువాదం కానుంది.
ఝ 2013 ఫిబ్రవరికే చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్‌కే ఇంత సమయం పట్టింది. లండన్, హాంకాంగ్, లాస్‌ఏంజిల్స్, చైనాల్లో ఫైనల్ వర్క్ జరుగుతోంది.
ఝ తెలుగులో ‘విక్రమ సింహ’ పేరుతో శ్రీ లక్ష్మీగణపతి ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది.
ఐ
తారాగణం : విక్రమ్, అమీ జాక్సన్ తదితరులు
దర్శకత్వం : శంకర్
నిర్మాత : ఆస్కార్ వి.రవిచంద్రన్
ఛాయాగ్రహణం : పి.సి.శ్రీరామ్
సంగీతం : ఎ.ఆర్. రెహమాన్
జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్
షూటింగ్ ప్రారంభం : 2012 జూలై 15న
నిర్మాణ వ్యయం : సుమారు రూ. 145 కోట్లు
విడుదల : 2014 ఏప్రిల్ 11న
ప్రత్యేకత : 17 భాషల్లో అనువాదం
‘అపరిచితుడు’ తర్వాత శంకర్, విక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. హిందీ ‘త్రీ ఇడియట్స్’ని తమిళంలో ‘నన్బన్’గా రీమేక్ చేసి పరాజయం పొందిన శంకర్ ఓ కసితో ఈ సినిమా చేస్తున్నారు.
ఝ వరుస పరాజయాలు, ప్రయోగాలతో వెనుకబడిపోయిన విక్రమ్ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వేరే అవకాశాలు కూడా వదిలేసుకుని అహరహం శ్రమిస్తున్నారు. పలురకాల శరీరాకృతుల్లో కనిపించడం కోసం ఎంతో కష్టపడుతున్నారు.
తొలుత సమంతను నాయికగా అనుకున్నారు. అనారోగ్యం కారణంగా ఆమె ఈ అవకాశం వదులుకోవడంతో, అమీజాక్సన్‌ని ఎంచుకున్నారు.
లార్డ్ ఆఫ్ ది రింగ్స్, అవతార్‌లాంటి హాలీవుడ్ చిత్రాలకు స్పెషల్ మేకప్ చేసిన వీటా వర్క్ షాప్ సంస్థ వాళ్లు విక్రమ్‌కి మేకప్ చేశారు. వరల్డ్‌లోనే ఎక్స్‌లెంట్ మేకప్ టీమ్ ఇదని శంకర్ స్వయంగా పేర్కొన్నారు.
హాలీవుడ్ ‘మెన్ ఇన్ బ్లాక్’ చిత్రాల సిరీస్‌కి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన మేరీ ఓగ్ దీనికి పనిచేశారు.
మన ఇండియన్ అనల్ అరసుతో పాటు చైనాకు చెందిన పీటర్ మింగ్ కొరియోగ్రఫీ చేశారు.
‘హ్యారీపోటర్’ సిరీస్‌కి పనిచేసిన ఆస్ట్రేలియన్ రైజింగ్‌సన్ పిక్చర్స్ వాళ్లు గ్రాఫిక్స్ సమకూరుస్తున్నారు.
‘ఐ’ అంటే తమిళంలో అందం, రాజు, గురువు, సున్నితం అని అర్థాలున్నాయి.
తెలుగులో ‘మనోహరుడు’ పేరుతో విడుదల కానుంది.