ఇకపై కత్తి పట్టను: అనుష్క
Published Mon, Oct 28 2013 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
‘‘భవిష్యత్తులో కూడా చాలా గర్వంగా చెప్పుకునే సినిమా ‘వర్ణ. చాలా మంచి ప్రేమ కథ ఇది. వర్ణ, బాహుబలి, రుద్రమదేవి చిత్రాలు పూర్తయ్యాక హీరోలతో డ్యాన్సులు చేసే సినిమాలు చేయాలనుంది. ఇకపై కత్తిపట్టను’’ అని అనుష్క చెప్పారు. ఆర్య, అనుష్క జంటగా శ్రీ రాఘవ దర్శకత్వంలో పి.వి.పి. పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మిస్తున్న ‘వర్ణ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. రఘురామరాజు పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని శ్రీ రాఘవకు ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ -‘‘రాబోయే రోజుల్లో హాలివుడ్ స్థాయి సినిమాలూ మనమూ తీయగలం. అందుకు ‘వర్ణ’ ఓ ప్రారంభం మాత్రమే. ఆర్య, అనుష్క, శ్రీ రాఘవ లేకపోతే ‘వర్ణ’ అనే రంగుల ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించలేకపోయేవాళ్లం. రెండేళ్లు కష్టపడి దేశ విదేశాలు తిరిగి ఈ సినిమా చేశాం’’ అని తెలిపారు. శ్రీ రాఘవ మాట్లాడుతూ -‘‘‘అవతార్’ గొప్ప సినిమా అని మనం ప్రతిసారి మాట్లాడుకోనవసరం లేదు. ఇక్కడ కూడా రాజమౌళిలాంటి దర్శకులు ఎందరో ఉన్నారు.
రాబోయే 10, 15 ఏళ్లలో ‘అవతార్’లాంటి సినిమాలు మనమూ తీయగలం’’ అని చెప్పారు. ‘కొలవరి డి’ ఫేమ్ అనిరుథ్ నేతృత్వంలో హాలీవుడ్‌లో ఫేమస్ రికార్డింగ్ స్టూడియో బుడాపెస్ట్‌లో రీరికార్డింగ్ జరుగుతోందని సంగీత దర్శకుడు హారిస్ జైరాజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్య, భోగవల్లి ప్రసాద్, దానయ్య, సి.కల్యాణ్, ‘దిల్’రాజు, శరత్ మరార్, బండ్ల గణేష్, దశరథ్, వంశీ పైడిపల్లి, మారుతి, శ్రీకాంత్ అడ్డాల, గుణ్ణం గంగరాజు, చంద్రబోస్, పరుచూరి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు.
Advertisement