చిట్‌చాట్
బాలీవుడ్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గా రెండు దశాబ్దాలుగా రాణిస్తున్న నీతా లుల్లా, ‘బ్లెండర్స్‌ప్రైడ్ ఫ్యాషన్ టూర్-2014’ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ‘రుద్రమదేవి’ చిత్రానికి డిజైనర్‌గా పనిచేసిన ఆమె పుట్టింది ముంబైలోనే అయినా, పెరిగింది హైదరాబాద్‌లోనే. ఇక్కడే చదువు సంధ్యలు సాగించిన నీతా లుల్లా తెలుగులో గలగలా మాట్లాడుతూ, నగరంతో అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. అది ఆమె మాటల్లోనే..
హైదరాబాద్‌లోనే నా చదువు సంధ్యలన్నీ సాగాయి. మొదట్లో ఒక కొరియోగ్రాఫర్ దగ్గర కొద్దికాలం పనిచేశాను. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ ప్రయోగాలపై ఆసక్తి ఉండటంతో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి మళ్లాను. రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో కొనసాగుతున్నాను. ఇప్పటికి 400కి పైగా సినిమాలకు డిజైనింగ్ చేశాను. ఫలక్‌నుమా ప్యాలెస్, సాలార్‌జంగ్ మ్యూజియం.. చదువుకునే రోజుల్లో నాకిష్టమైన ఈ రెండుచోట్లకు తరచూ వెళ్లేదాన్ని. వీటినే స్ఫూర్తిగా తీసుకుని చాలా డిజైన్లు రూపొందించాను.
ఫలక్‌నుమా ప్యాలెస్‌లోకి అడుగుపెట్టగానే నేనే ఒక ప్రిన్సెస్ అనే ఫీలింగ్ వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ఫ్యాషన్ షో కోసం 1950ల నాటి ఫ్యాషన్స్ స్ఫూర్తితో డిజైనింగ్ చేశాను. ఢిల్లీ, ముంబై, చెన్నై తరహాలోనే హైదరాబాద్‌లోనూ ఫ్యాషన్ రంగం శరవేగంగా విస్తరించే అవకాశాలున్నాయి. ఇక్కడి డిజైనర్లు ఎక్కడైనా రాణించగలరనేందుకు నేనే ఉదాహరణ. మనిషి రూపురేఖల్ని బట్టి నేను డ్రెస్ డిజైన్ చేస్తాను. నేను డిజైన్ చేసిన డ్రెస్‌లో వాళ్ల అంతస్సౌందర్యాన్ని ఇనుమడింపజేయడమే
నా లక్ష్యం.
ఇక్కడి నవాబీ ఫుడ్ చాలా ఇష్టం
హైదరాబాద్ ఫ్లేవర్ ఉన్న నవాబీ ఫుడ్ అంటే నాకు తగని ఇష్టం. ఇక్కడ చదువుకునే రోజుల్లోనే తెలుగు బాగా నేర్చుకున్నాను. ఇక్కడి హామ్‌స్టెక్ ఫ్యాషన్ కాలేజీ విద్యార్థులకు డిజైనింగ్ పాఠాలు బోధిస్తున్నా. నలుగురు హ్యామ్‌స్టెక్ స్టూడెంట్స్‌ను రుద్రమదేవి సినిమా కోసం అసిస్టెంట్స్‌గా పెట్టుకున్నాను. ఫ్యాషన్ అభిమానులందరికీ నేను డిజైన్ చేసిన దుస్తులు చేరాలనేదే నా ఆశయం. ఎన్నిచోట్ల ఫ్యాషన్ షోస్‌లో పాల్గొన్నా, నాకు హైదరాబాద్‌లో షో చేయడమంటే చాలా స్పెషల్. ఇక్కడ రిసీవ్ చేసుకునే విధానం, ఇక్కడి ప్రజల ఆదరణ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నా డిజైన్లను ప్రదర్శించడానికి కూడా లక్ష్మి మంచు, శ్రీదేవి నెక్కెంటి, కవితారెడ్డి తదితర హైదరాబాదీ మహిళలనే ఎన్నుకున్నాను.
..:: సిరి
సిటీ.. షో స్పెషల్
Published Mon, Nov 17 2014 12:18 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
Advertisement