ఇంటర్‌కొచ్చాకే ఎంజాయ్
చిట్‌చాట్
జోయా అఫ్రోజ్.. నటిగా మారిన మోడల్. బాల్యం నుంచే బాలీవుడ్‌తో పాటు సీరియల్స్‌లోనూ నటించి టీవీ ప్రేక్షకులకూ దగ్గరమైన ఈ ముద్దుగుమ్మ శనివారం హైదరాబాద్‌కు వచ్చింది. బంజారాహిల్స్ తాజ్‌కృష్ణలో మూడు రోజుల పాటు జరగనున్న ‘యూ ఈ ది జ్యువెలరీ ఎక్స్‌పో’ను ప్రారంభించింది. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ఆమె చిట్‌చాట్...
- శిరీష చల్లపల్లి
ముంబైలో పెరగడం వల్ల ఫ్యాషన్ ఫీల్డ్ తొందరగా పరిచయమైంది. అదీ కాక చిన్నప్పటినుంచే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘హమ్ సాత్ సాత్ హై’తోపాటు చాలా సీరియల్స్‌లో చేశాను. తర్వాత అనేక యాడ్ ఆఫర్స్ వచ్చాయి. 2013లో పాండ్స్ ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ గెలుపు నా కెరీర్‌ను మార్చేసింది. కుచ్ న కహోతోపాటు ఇంగ్లిష్, పంజాబీ సినిమాల్లో కూడా చేశాను. ఇక టాలీవుడ్ విషయానికొస్తే.. మంచి కథ, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ ఆఫర్ వస్తే నటిస్తా.
ఫన్నీడేస్...
మా స్వస్థలం కల్చరల్ క్యాపిటల్ లక్నో. చదువంతా ముంబైలో సాగింది. నాన్న బిజినెస్‌మేన్, అమ్మ గృహిణి, ఒక తమ్ముడు ఉన్నాడు. టెన్త్ క్లాస్ వరకు నేను చాలా సెలైంట్ అండ్ కామ్ గోయింగ్. ఇంటర్‌కి వెళ్లగానే ఆ ధైర్యం ఎలా వచ్చిందో తెలియదు కానీ ఫ్రెండ్స్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేసేదాన్ని. క్లాసులకు బంక్ కొట్టి షాపింగ్‌కి, సినిమాలకు తిరిగేదాన్ని. ఎగ్జామ్స్ టైమ్‌లో మాత్రం ఫ్రెండ్స్‌తో కలిసి నైటవుట్ చేసి మరీ చదివేదాన్ని. ఇక రిజల్ట్స్ వస్తున్నాయంటే గుళ్లు గోపురాల చుట్టూ అందరం రౌండ్లు కొట్టేవాళ్లం. భలే ఫన్నీగా ఉండేవి ఆ రోజులు.
కంఫర్ట్ సిటీ...
నాలుగేళ్ల కిందట మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చాను. నాకు సాధారణంగా ముంబై తప్ప ఏ ప్లేస్‌కు వెళ్లినా కంఫర్ట్‌గా అనిపించదు. కానీ హైదరాబాద్ డిఫరెంట్. ముంబై తర్వాత నాకు సౌకర్యంగా అనిపించే నగరమిది. ఇక్కడి వాతావరణం నన్ను కట్టిపడేస్తుంది. ఇక నాకు కుకింగ్ అంటే ఇష్టం ఉండదు. ఎవరైనా వండిపెడితే ఎంచక్కా తింటాను. అది మంచి లక్షణం కాదనుకోండి. ఏ టూర్‌కి వెళ్లినా అక్కడి స్పెషల్ ఫుడ్ ఏంటో గూగుల్‌లో తె లుసుకుని మరీ తింటాను.