మాలో మాకు నచ్చేవి అవే..! - ప్రకాశ్, కనిక | special chit chat with size zero dirctor | Sakshi
Sakshi News home page

మాలో మాకు నచ్చేవి అవే..! - ప్రకాశ్, కనిక

Published Thu, Nov 19 2015 12:49 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

మాలో మాకు నచ్చేవి అవే..!   - ప్రకాశ్, కనిక

మాలో మాకు నచ్చేవి అవే..! - ప్రకాశ్, కనిక

‘సైజ్ జీరో’ సినిమాకు కథ అందించిన రచయిత్రిగా కూడా దక్షిణాదిలో మీరిప్పుడు వార్తల్లో ఉన్నారు.

ఒక కోడలి కథ
 
మంచి లావు ఛాన్స్ కొట్టేసింది - కోడలు పిల్ల.
‘సైజ్ జీరో’ సినిమా కథ ఆమెదే.
లావుగా ఉన్నా మాకు ఓకే అంటున్నారు అత్తింటివారు.
ఎంత లావు సక్సెస్ కొడుతుందో చూడాలి.
రాఘవేంద్రరావు కొడుకు - కోడలుతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.

 
 
సాక్షి: మాకు పూనమ్ ధిల్లాన్ తెలుసు. ఇప్పుడు రాఘవేంద్రరావుగారి కోడలు కనికా ధిల్లాన్ అనేసరికి తెలుగువారు మీ పట్ల కుతూహలంగా ఉన్నారు.
కనిక: ఓ... అవునా... థ్యాంక్యూ.
‘సైజ్ జీరో’ సినిమాకు కథ అందించిన రచయిత్రిగా కూడా దక్షిణాదిలో మీరిప్పుడు వార్తల్లో ఉన్నారు.
కనిక: అవును... ఆ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సంతోషంగా ఉంది.

ఇంతకూ మీ నేపథ్యం ఏంటి? ప్రకాశ్‌కు మీరెలా పరిచయం అయ్యారు.
 కనిక: మాది అమృత్‌సర్. నాన్నది వ్యాపారం. అమ్మ ప్రిన్సిపాల్. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ వల్ల కథలు అలవాటయ్యాయి. అలా రచయిత్రి కావాలనే కోరిక పుట్టింది. ముంబైలో షారూక్ ఖాన్ సంస్థలో పని చేశాను. ప్రకాశ్ ముంబైలో పని చేస్తూ కథలు రాసే వాళ్ల కోసం వెతుకుతూ నా గురించి తెలుసుకున్నారు. అలా మా పరిచయం అయ్యి, ప్రేమగా మారింది. ఐదేళ్లకు పెళ్లి చేసుకున్నాం.

అక్కడే ఉన్న రాఘవేంద్రరావుతో: కనికను పెళ్లి చేసుకుంటానని మీ అబ్బాయి చెప్పగానే ఎలా అనిపించింది?
 రాఘవేంద్రరావు: అంతకు ముందు పెళ్లి గురించి ప్రకాశ్ అంతగా ఇంట్రస్ట్ చూపించేవాడు కాదు. అందుకని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే ఆనందపడ్డాను. అయితే మా ఆవిడ ఒప్పుకోదనుకున్నాను. వెంటనే ఒప్పుకుని నన్ను ఆశ్చర్యపరిచింది. కథ, డెరైక్టర్ భార్యాభర్తల్లాంటివాళ్లు. కనిక రచయిత. ప్రకాశ్ డెరైక్టర్. కనుక మంచి జోడీ అనిపించింది. తను కూడా ఎన్నో ఏళ్ల నుంచి పరిచయం ఉన్న అమ్మాయిలాగా మా ఇంట్లో కలిసిపోయింది. నా సిస్టర్స్, బ్రదర్స్.. వాళ్ల పిల్లలతో చాలా బాగుంటుంది.  మాకు ఒకే ఒక్క కొడుకు కాబట్టి.. మా కోడలినే కూతురిలా భావిస్తున్నాం.
     
పెళ్లయిన ఈ ఏడాది కాలంలో మీ అత్తామామలు  మీకిచ్చిన భరోసా గురించి?

కనిక: మా అత్తామామలు నన్ను ఓ కోడలిలా చూడలేదు. కూతురిలానే అనుకున్నారు. ఎప్పుడైనాసరే అత్తామామల నుంచి ఎంకరేజ్‌మెంట్ లభిస్తే ఆ కోడలు కెరీర్‌పరంగా రాణించే వీలుంటుంది. పెళ్లయిన తర్వాత కూడా నేను సక్సెస్‌ఫుల్‌గా కథలు రాసుకుంటూ, ప్రకాశ్‌తో కలిసి సినిమాలు చేయగలుగుతున్నానంటే మా అత్తామామలు ఇచ్చే ఎంకరేజ్‌మెంటే కారణం.

మీ భార్య అత్తగారి దగ్గర ఉత్తమ కోడలనిపించుకోగలిగారా?
 ప్రకాశ్: (నవ్వుతూ) అమ్మ ముందు నుంచీ హౌస్ వైఫ్. గుళ్లకు ఎక్కువగా వెళుతుంది. కనిక ఎప్పుడూ ఏదో ఒకటి రాసుకుంటూ బిజీగా ఉంటుంది. ఇద్దరూ మాటా మాటా అనుకోవడం, లేనిపోని పట్టింపులు, పంతాలకు పోవడం చేయరు.

కనికకు తెలుగు తెలియదు కాబట్టి మీ అమ్మగారు, తన మధ్య సంభాషణకు తావు లేకపోవడం కూడా ఓ అడ్వాంటేజ్ ఏమో?
 ప్రకాశ్: (నవ్వుతూ). మాటలకన్నా సైగలు ఎక్కువ. అమ్మ మాట్లాడింది అర్థం చేసుకోవడానికి గూగుల్ ట్రాన్స్‌లేటర్ సహాయం తీసుకుంటుంది. అదంతా భలే ఉంటుంది.
 కనిక: కానీ, తెలుగు నేర్చుకుని ఒకరోజు అత్తయ్యతో గడాగడా తెలుగులో మాట్లాడి, ఆమెను సర్‌ప్రైజ్ చేయాలని ఉంది.

ఇక్కడి సంప్రదాయాల గురించి మీ అత్తగారు చెబుతుంటారా?
 కనిక: ఇక్కడి ఫంక్షన్లకు ఎలా రెడీ అవ్వాలో నాకు తెలియదు. ఎలాంటి చీరలు కట్టుకోవాలో, ఎలాంటి నగలు పెట్టుకోవాలో అత్తమ్మే చెబుతుంది. ఎలాంటి కలర్స్ సెలక్ట్ చేసుకోవాలో కూడా చెబుతుంది.
     
మీ కోసం మీ అత్తగారు ఏమైనా వంటలు చేసి పెడుతుంటారా?

కనిక: దోసలాగ పెద్దగా ఉంటుందే.. అది దోస కూడా కాదు (ప్రకాశ్: దిబ్బరొట్టె గురించి చెబుతోంది). అది చాలా బాగుంటుంది. ఉప్మా చేసి పెడుతుంది. ఒక్కోసారి మా నార్త్ ఇండియన్ డిషెస్ కూడా చేసి పెడుతుంది. ఒకవేళ నాకు ఏదైనా నచ్చకపోతే ‘ఓకే... వేరే చేసి పెడతాను’ అని చెబుతుంది.
     
మీకు ఎవరైనా అక్కా, తమ్ముళ్లు, చెల్లెళ్లు ఉన్నారా? వాళ్లతో ప్రకాశ్ ఎలా ఉంటారు?
కనిక: నాకు ఓ అక్క, తమ్ముడు ఉన్నారు. అక్క లండన్‌లో జాబ్ చేస్తోంది. తమ్ముడు ముంబైలో బ్యాంకర్. ప్రకాశ్ మా ఫ్యామిలీతో చాలా బాగుంటారు. వాళ్లు కూడా ఆయన తో అలాగే ఉంటారు. ప్రకాశ్‌తో మాట్లాడటం మొదలుపెట్టాక ఆయన ఎవరికైనా నచ్చేస్తాడు. మావాళ్లందరికీ చాలా త్వరగా దగ్గరయ్యాడు.
     
లవ్ ప్రపోజల్ ముందు ఎవరు చేశారు? ఎలా చేశారు?
 ప్రకాశ్: నేనే చేశాను. సినిమాటిక్‌గా అయితే కాదు.
     
{పకాశ్ ప్రపోజ్ చేస్తారని మీరు ముందే ఊహించారా?

 కనిక: ఇద్దరి మధ్య సమ్‌థింగ్ ఉందని మా ఇద్దరికీ తెలుసు. మా అమ్మానాన్నలకి ఓ విచిత్రమైన సంఘటన ద్వారా తెలిసింది. నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చి, ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను. అప్పుడు ప్రకాశ్ చాలా బాగా చూసుకున్నాడు. అప్పుడే మా అమ్మగారు ప్రకాశ్‌ని కలిసింది. ‘ఎవరీ కుర్రాడు.. ఇంత కేర్ తీసుకుంటున్నాడు. చాలా బాగున్నాడు’ అని అడిగింది.
     
మీ నాన్నగారు ఫుల్ మాస్. మీరు క్లాస్ అనిపిస్తోంది. చిన్నప్పట్నుంచీ నాన్నగారి  సినిమాలు చూస్తూ పెరిగినా ఆయన ప్రభావం మీ మీద పడలేదనుకోవచ్చా?
 ప్రకాశ్: బేసిక్‌గా చిన్నప్పట్నుంచీ సినిమాలు చూసినా సినిమాలంటే నాకు ఇంట్రస్ట్ లేదు. థియేటర్ (రంగస్థలం) ద్వారా సినిమాలంటే ఇష్టం ఏర్పడింది. కాలేజ్‌లో థియేటర్ చేశాను. ఆ తర్వాత అమెరికా వెళ్లి నేర్చుకున్నాను. థియేటర్ కథలు కమర్షియల్‌గా ఉండవు. నా మీద వాటి ప్రభావమే ఎక్కువగా ఉంది.
 
ముందు ఆర్టిస్ట్‌గానే పరిచయం అయ్యారు కదా..  తర్వాత డెరైక్షన్ వైపు వెళ్లిపోయారేంటి?
 ప్రకాశ్: అమెరికాలో థియేటర్‌లో నేర్చుకున్నది యాక్టింగే. అక్కడ నేర్చుకున్న యాక్టింగ్‌కీ, ఇక్కడ సినిమాలకు చేసే యాక్టింగ్‌కీ చాలా వ్యత్యాసం ఉందనిపించింది. నేను ఏదైతే ట్రైన్ అయ్యానో అందుకు పూర్తి డిఫరెంట్‌గా ఇక్కడ చేయమన్నారు. ఓ రెండు సినిమాలు చేసిన తర్వాత ఇక్కడ చేసే తరహా యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ ఏర్పడలేదు. డెరైక్షన్ మీద ముందు నుంచీ ఇంట్రస్ట్ ఉండటంతో అటువైపు వెళ్లిపోయాను.
     
‘అనగనగా ఓ ధీరుడు’ తర్వాత మీరు చాలా గ్యాప్ ఎందుకు తీసుకున్నారు?

 ప్రకాశ్: ఆ సినిమా తర్వాత ఓ ఏడాది కొన్ని కథలు రాసుకున్నాను. ‘గాన్ ఆఫ్ హంటర్స్’ అని ఒక హిందీ టెలివిజన్ షో చేశాను. అది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. దానికి రెండేళ్లు పట్టింది. ఆ తర్వాత కమర్షియల్ బారామీటర్స్‌కు అతీతంగా సినిమా చేయాలనుకున్నాను. ఆ సమయంలోనే కనిక చెప్పిన కథ నచ్చింది. కథలో మానవీయ విలువలు ఉన్నాయనిపించింది. అందుకని ‘సైజ్ జీరో’ చేశాను.  
     
వంద చిత్రాలకు పైగా చేసిన మీ నాన్నగారు ఎక్కువ సినిమాలు తీయమని ఒత్తిడి చేయలేదా? మీరు నాన్నగారి మేకింగ్ స్టయిల్‌ని అడాప్ట్ చేసుకోవాలనుకోలేదా?

 ప్రకాశ్: నేను ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనే విషయం మీద మా ఫ్యామిలీలో ఎప్పుడూ నిబంధనలు పెట్టలేదు. నాన్నగార్ని ఫాలో కావాలనుకోలేదు. ఆయన అన్ని సినిమాల్లోనూ ఫ్రూట్స్ లాంటి కలర్‌ఫుల్ థింగ్స్ వాడలేదు. ‘జ్యోతి’లో కానీ, ‘ఆమె కథ’లో కానీ అలాంటివి కనిపించవు. ఎందుకంటే, ఆ కథలకు అవి అవసరంలేదు. మేకింగ్ స్టయిల్ అనేది స్టోరీ జానర్‌ని బట్టే ఉంటుంది. నేను ఎన్నుకునే కథలు ఎలాంటి మేకింగ్ స్టయిల్‌ని డిమాండ్ చేస్తే అదే చేస్తాను.

ఓకే... మళ్లీ కనికతో మాట్లాడదాం... మీ భర్త టాలెంటెడ్ అయినప్పటికీ ఇప్పటివరకూ చేసిన బొమ్మలాట, అనగనగా ఓ ధీరుడు కమర్షియల్‌గా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. మీరు ఇచ్చిన కథతో ఆయన తీసిన ‘సైజ్ జీరో’ ఆ కొరతను తీస్తుందంటారా?
 కనిక: ప్రకాశ్ ఆల్రెడీ సక్సెస్‌ఫుల్. జాతీయ అవార్డు సాధించాడు. ఇక.. కమర్షియల్ సక్సెస్‌కి వస్తే.. ‘సైజ్ జీరో’ ఫన్ మూవీ, ఫ్యామిలీ ఫిల్మ్. సో.. అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అంతే తప్ప ఆ సినిమా ఇంత సక్సెస్ కావాలని నేను లెక్కలేసుకోవడంలేదు. మంచి సినిమా తీశాం. అందరూ ఎంజాయ్ చేయాలన్నది నా ఆకాంక్ష.
     
మీ మామగారి మేకింగ్ స్టయిల్‌తో ప్రకాశ్ మేకింగ్ స్టయిల్‌ని కంపేర్ చేస్తే మీకేమనిపిస్తుంది?

 కనిక: మా మామగారిది విభిన్న శైలి.
 ప్రకాశ్‌ది మరో శైలి. ఇద్దరి టేకింగ్‌నీ కంపేర్ చేయలేం. మా మామగారి టేకింగ్ గురించి బాలీవుడ్‌లో కూడా మాట్లాడుకుంటారు. అక్కడి దర్శకుల్లో చాలామంది ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటారు. మామగారి ప్రభావం ప్రకాశ్ మీద అంతగా లేదు. ఎందుకంటే, ప్రకాశ్ ఎంచుకునే కథలు మామగారి కథలకు పూర్తి భిన్నంగా ఉంటాయి.
     
కనికా.. మీరు కథలు రాస్తుంటారు కాబట్టి, ఓ స్టోరీ రైటర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?

కనిక: నేను తెలుసుకున్నదేంటంటే.. ఏ కథకైనా మంచి కథావస్తువు ముఖ్యం. కథలో ఎమోషన్ ఉండాలి. వేగం ఉండాలి. ఆ కథకు తగ్గ స్క్రీన్‌ప్లే-డైలాగ్స్ ఉండాలి. నేను కథలు రాసేటప్పుడు ఆ విషయాల్నే దృష్టిలో పెట్టుకుంటాను. ఇంట్లో మామగారు ఉంటారు కాబట్టి, కథ రాసేటప్పుడు ఇంకా జాగ్రత్తపడాలి. ఎందుకంటే, తెలియకుండా ఆయన ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
     
{పకాశ్‌లో ఉన్న మూడు బెస్ట్ క్వాలిటీస్ చెబుతారా?

 కనిక: ప్రకాశ్ గురించి మా అమ్మ దగ్గర చెప్పగానే ఆవిడ కూడా ఇలానే అడిగారు (నవ్వుతూ). బేసిక్‌గా నేను క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్నాను కాబట్టి, తనూ ఈ ఫీల్డ్‌లో ఉండటం, స్టోరీ టెల్లింగ్‌లో తను చూపించే కొత్తదనం నాకు చాలా నచ్చాయి. ప్రకాశ్ చాలా టాలెంటెడ్. ఆ టాలెంట్‌ని ఇష్టపడ్డాను. ఎదుటి వ్యక్తుల కోసం తనను తాను మార్చుకోడు. ఎలా ఉండాలనుకుంటే అలానే ఉంటాడు. ఎవరి దగ్గరా నటించడు. ఈ రోజుల్లో ఇలాంటి లక్షణాలున్నవాళ్లు చాలా అరుదు.
     
{పకాశ్.. కనికలో మీకు నచ్చిన లక్షణాలు?

 ప్రకాశ్: మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. చాలా మంచి వ్యక్తి. పంతం నెగ్గించుకోవాలనుకోదు. పట్టువిడుపుగా వ్యవహరిస్తుంది. స్నేహంగా ఉంటుంది. టోటల్‌గా కూల్ పర్సన్. ఇద్దరం ఒకే ఫీల్డ్‌లో ఉంటాం కాబట్టి, చాలా విషయాల్లో ఇద్దరం కనెక్ట్ అవుతాం. ప్రొఫెషనల్లీ ఎదగడానికి మేం ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటాం.
     
మీ చేతి వంటను ప్రకాశ్‌కు రుచి చూపించారా?
 కనిక: వంట చేస్తాను. అది తినే ధైర్యం ఒక్క ప్రకాశ్ మాత్రమే చేస్తాడు. రెగ్యులర్‌గా కుక్ చేయను. అప్పుడప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాను. ప్రకాశ్ వద్దనకుండా తింటాడు.
     
మరి.. మీకు వంట వచ్చా?
 ప్రకాశ్: అంత కాదు.. అస్సలు రాదనే చెప్పాలి.
 కనిక: శాండ్‌విచెస్ చేస్తాడు (నవ్వుతూ).
     
ఓకే.. ఈ ఏడాది జీవితం ఎలా అనిపించింది?

 కనిక: ముందు మీరే చెప్పండి.
 ప్రకాశ్: వెరీ గుడ్ అండి. కనిక వేరే సిటీ నుంచి వచ్చిన అమ్మాయి. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడాలి. నేను షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా ఇంట్లో లేకపోతే తాను ఒంటరిగా ఉండాల్సి వచ్చేది. బాగానే ఎడ్జస్ట్ అయింది. పైగా మంచి రచయిత కావడంతో సెట్‌కు వచ్చి మంచి డెసిషన్స్ కూడా తీసుకునేది. నాకు ఆన్ సెట్‌లో మంచి సపోర్ట్ ఇస్తుంది. అఫ్ సెట్.. అంటే ఇంట్లో మేం హ్యాపీ కపుల్.
 కనిక: ఏడాది ఎలా గడిచిపోయిందో తెలియడంలేదు. కొత్త వ్యక్తులు, కొత్త వాతావరణం, కల్చర్ అన్నీ కొత్తే. కానీ ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్‌ను మర్చిపోలేను.
     
బర్త్‌డేస్‌కి సర్‌ప్రైజ్ చేసుకోవడం వంటివి?
 ప్రకాశ్: నా 40వ పుట్టిన రోజుకి కనిక సర్‌ప్రైజ్‌తో కూడిన షాక్ ఇచ్చింది.
 కనిక: ఆయనకు సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం. అందుకే పుట్టిన రోజున మంచి సర్‌ప్రైజ్ ఇచ్చాను. ప్రకాశ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ సూపర్ హీరో గెటప్‌లో పార్టీకి హాజరయ్యేలా చేశా. ఆయనకు నిజంగా ఆ రోజున  అది స్వీట్ షాక్.
     
మీ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న తొలి చిత్రం ‘సైజ్ జీరో’ ఎలా ఉంటుంది?

 కనిక: అందరూ మంచి సినిమా తీశారని అంటారు. ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ కాదు. అందర్నీ ఆకట్టుకుంటుంది. యూత్, ఫ్యామిలీస్ అందరూ బాగా కనెక్ట్ అవుతారు.
     
మీరింత సన్నగా ఉన్నారు. జీరో సైజ్ అని ఓ లావుగా ఉన్న అమ్మాయి గురించి రాయాలని ఎందుకనిపించింది?

 కనిక: నా చుట్టూ ఉన్న వాళ్లల్లో కొంతమంది జీవితం ఆధారంగా ఈ కథ రాశాను. పెళ్లి అవుతుందంటే నాలుగు నెలల ముందు నుంచి అమ్మాయిని బరువు తగ్గమంటారు. నార్త్, సౌత్ ఎక్కడైనా ఈ పద్ధతి ఒక్కటే. ముఖ్యంగా న్యూస్ పేపర్స్ తెరిస్తే స్లిమ్ సెంటర్స్ గురించే ఉంటున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని కథ రాశాను. ఓ లావుగా ఉన్న అమ్మాయి జీవితం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఆ అమ్మాయికి కొన్ని వెయిట్ ఇష్యూస్ ఉంటాయి. ఆ అమ్మాయి వాటిని ఎలా ఫేస్ చేసింది? అనేది సినిమా. ఎమోషనల్‌గా ఉంటూ నవ్విస్తుంది.
     
ఒకవేళ భవిష్యత్తులో కనిక ‘సైజ్ జీరో’లోలా అనుష్క అంత బరువు పెరిగితే మీరు యాక్సెప్ట్ చేస్తారా?
 ప్రకాశ్: చెప్పాలంటే... నేను తనను బరువు పెరగమనే చెబుతున్నాను. వినడం లేదు.
 కనిక: ఆయనకు నేను బరువు పెరిగితే హ్యాపీనే.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement