
పది దాటేసిన అనుష్క
నటి అనుష్క పదేళ్ల ప్రాయాన్ని దాటేసి పదకొండవయేట అడుగు పెట్టారు. ఏమిటీ ఆశ్చర్యంగా ఉందా? లేక నమ్మశక్యంగా లేదా? నమ్మాలండీ బాబూ. ఎందుకంటే ఇక్కడ చెప్పేది అనుష్క అసలు వయసు గురించి కాదు. ఆమె సినిమా వయసు గురించండీ. అందానికే కాదు అభినయానికీ నిలువెత్తు అద్దం అనుష్క. ప్రస్తుతం మంచి చరిష్మా ఉన్న పాత్రలు, చారిత్రాత్మక పాత్రలు చేయాలన్నా ముందుగా గుర్తొచ్చే నటి అనుష్కనే. అరుంధతి చిత్రంతోనే ఆమె నటిగా తనేమిటో నిరూపించుకున్నారు. మధ్యలో కొన్ని గ్లామర్ పాత్రలు చేసినా, తాజాగా రుద్రమదేవి, బాహుబలి వంటి భారీ చారిత్రాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ముఖ్యంగా రుద్రమదేవి చిత్రంలో కత్తిసాము, గుర్రపుస్వారి అంటూ యుద్ధభూమిలో కదం తొక్కే సాహస కృత్యాలు ప్రేక్షకుల్ని అబ్బుర పరుస్తాయంటున్నారు. టాలీవుడ్‌లో 2005లో సూపర్ అనే చిత్రం ద్వారా రంగప్రవేశం చేసి ఈయోగా సుందరి ఆ చిత్రంలో అందాలు బాగానే ఆరబోశారు. కోలీవుడ్‌లో రెండు అనే చిత్రంతో దిగుమతి అయ్యారు. ఆ చిత్రంలో అయితే ఈత దుస్తులతో దుమ్మురేపారు. ఇలా గ్లామర్‌తోనూ, పర్ఫార్మెన్స్‌తోను,అశేష అభిమానుల్ని పొందిన అనుష్క గురువారం నాటికి నటిగా దశాబ్దం పూర్తి చేసుకున్నారు. ఈసందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలను తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.