హృదయ రాణులు
గ్లామర్ పాయింట్
సినిమా అంటేనే కల్పన అంటారు. కానీ కల్పిత కథలకే కాదు, యదార్థ గాథలకూ అక్కడ చోటుంది.
అందుకే చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోయిన కొన్ని సంఘటనలను,
కొందరు మహామహుల జీవితాలను తెరకెక్కించే ప్రయత్నం అడపా దడపా చేస్తుంటారు దర్శకులు.
అలాంటి చారిత్రాత్మక చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మలు వీరు...
ఐశ్వర్యారాయ్
అందానికే అందం ఐశ్వర్యారాయ్. ఆమె అందం మరింత ఇనుమడించింది ‘జోథా’ పాత్రలో. అక్బర్ హృదయరాణిగా ‘జోథాఅక్బర్’లో రాజసాన్ని ఒలికించిందామె. సాహిత్యం ఆధారంగా తెరకెక్కిన ఉమ్రావ్‌జాన్, దేవదాస్ వంటి చిత్రాల్లో తన నటనతో మెస్మరైజ్ చేసిన ఐష్.... ఈ హిస్టారికల్ ఫిల్మ్‌తో నటిగా మరో మెట్టు ఎదిగిందని చెప్పాలి.
కరీనా కపూర్
గ్లామరస్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో కరీనా స్థానం ప్రత్యేకమైనది. ‘అశోకా’ చిత్రంలో అయితే ఓ గ్లామరస్ క్వీన్‌గా చేసింది. సామ్రాట్ అశోకగా షారుఖ్ ఖాన్ నటించిన ఆ చిత్రంలో కళింగ సామ్రాజ్యపు యువరాణి కరువాకిగా వైవిధ్య భరిత పాత్ర చేసింది కరీనా. ‘రాత్ కా నషా’ అని పాడుతూ సామ్రాట్ అశోక మనసుతో పాటు తన అభిమానుల హృదయాలనూ దోచేసింది.
అనుష్క
అనుష్క రూటే సెపరేటు. గ్లామర్ పాత్రలతో మొదలెట్టి, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల నాయికగా మారిపోయింది. ‘అరుంధతి’ చూశాక... తనలో ఇంత ప్రతిభ ఉందా అంటూ ఆశ్చర్యపోయా రంతా. ఆమె అద్భుత నటనకు, చూపు తిప్పుకోనివ్వని హావభావాలకు హ్యాట్సాఫ్ చెప్పారు. ఇప్పుడు అంతకంటే పవర్‌ఫుల్‌గా కనిపించింది ‘రుద్రమదేవి’లో. కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి గురించి పాఠాల్లో చదువుకున్నా... వెండితెరపై ఆమెను ఒక పాత్రగా చూడటం, అందులోనూ ఆ పాత్రలో అనుష్క కనిపించడం అన్నది ఓ గొప్ప అనుభూతి అంటున్నారు ఆమె ఫ్యాన్స్.
దీపికా పదుకొనె
ఫీల్డ్‌లో అడగుపెట్టిన కొత్తలో దీపికను చూసి... ఓ గ్లామర్ డాల్‌గా మిగిలిపోతుందేమో అనుకున్నా రంతా. ‘ఓం శాంతి ఓం’ లాంటి సినిమా ద్వారా ఓ బరువైన పాత్రతో పరిచయమైనా... ఆ తర్వాత మామూలు ప్రేమకథా చిత్రాలు చేసుకుంటూ పోవడమే దానికి కారణం. కానీ ఉండేకొద్దీ తన స్టయిల్‌ను మార్చింది దీపిక. డిఫరెంట్‌గా ఉండే పాత్రలే ఎంచుకోవడం మొదలెట్టింది. ఆ క్రమంలోనే ఇప్పుడు మరాఠా రాజుల కాలం నాటి కథతో వస్తోన్న ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంలో ‘మస్తానీ’గా మెరవబోతోంది.