ఆ వీరమరణానికి 726 ఏళ్లు
* రుద్రమదేవి చందుపట్లలోనే మరణించిందంటున్న స్థానిక శిలాశాసనం
* అంబదేవుడితో పోరాడుతూ నవంబర్ 27న కన్నుమూసిన ధీర వనిత
* కాకతీయ మహా సామ్రాజ్ఞి.. ధీరత్వానికి సిసలైన ప్రతిరూపం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాయగజకేసరి బిరుదాంకితురాలు.. కాకతీయ మహా సామ్రాజ్ఞి.. ధీరత్వానికి సిసలైన ప్రతిరూపమైన రాణి రుద్రమ వీరమరణం చెంది నేటికి సరిగ్గా 726 సంవత్సరాలు.
క్రీ.శ.1289వ సంవత్సరం నవంబర్ 27న, 80 ఏళ్ల వయసులో కాయస్థ అంబదేవుడితో నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందుపట్ల వద్ద జరిగిన యుద్ధంలో ఆమె వీరమరణం పొందినట్టు అక్కడ లభించిన త్రిపురాంతక శిలా శాసనం చెబుతోంది. వృద్ధాప్యంలో ఉన్న మహిళను చంపానన్న అపకీర్తి రాకుండా ఉండేందుకే అంబదేవుడు అప్పట్లో రుద్రమ మరణాన్ని ధ్రువీకరించలేదని చరిత్ర చెబుతోంది.
కానీ చందుపట్ల శాసనం మ్రాతం ‘శాసనకాలము శక సం:1211, మార్గశిర శుద్ధ ద్వాదశి, అనగా క్రీ.శ..1289 నవంబర్ 27న రుద్రమదేవి శివలోకానికి వెళ్లిన’ట్టు చెబుతోంది. రుద్రమ సేవకుడు పువ్వుల ముమ్ముడి వేయించిన ఈ శాసనం నాలుగడుగుల నాపరాయి గద్దెపై ఉంది. రుద్రమ 1296 దాకా జీవించే ఉన్నట్టు కొందరు చరిత్రకారులు చెప్పినా, చందుపట్ల శాసనం ప్రకారం 1289లోనే ఆమె మరణించారు. రుద్రమకు చాళుక్య వీరభద్రుడితో వివాహం జరిగినా పిల్లలు లేకపోవడంతో ముమ్మడాంబ, రుయ్యాంబ అనే అమ్మాయిలను దత్తత తీసుకుని, మనవడైన ప్రతాపరుద్రునికి ఓరుగల్లు పగ్గాలు అప్పజెప్పారు.
చందుపట్లలో మరిన్ని ఆనవాళ్లు..
త్రిపురాంతక శాసనంతో పాటు చందుపట్లలో ఆనేక ఆనవాళ్లు కాకతీయ రాజ వారసత్వ చరిత్రను చెపుతున్నాయి. ఇక్కడి నాపరాతి బండలపై కొలువై ఉన్న అనేక విగ్రహాలు కాకతీయ శిల్పకళా నైపుణ్యానికి నిలువుటద్దాలుగా నిలుస్తున్నాయి. రామప్ప ఆలయంలో ఉన్న ఓ విగ్రహం గణపతి ప్రతిమను పోలి ఉంది. దానికి ఎదురుగా ఉన్న మరో రాయిపై గుర్రంపై స్వారీ చేస్తున్న ఓ మహిళ విగ్రహం రాణీ రుద్రమనే అన్న భావన కలిగిస్తోంది.
జనగామలో రుద్రమ విగ్రహం
జనగామ: వరంగల్ జిల్లా జనగామ మండలంలో రుద్రమదేవి విగ్రహం వెలుగుచూసింది. సిద్దెంకి, ఎల్లంల, పెంబర్తి గ్రామాల శివారులోని అయ్యలకాడ అని పిలిచే ప్రాం తంలో గురువారం ఈ విగ్రహం బయటపడింది. ఈ రాతి విగ్రహం ఆమె కూర్చున్నట్టు ఉంది. ఒక చేతిలో కత్తి, మొలతాడుకు మరో చిన్న ఖడ్గం ఉన్నాయి. విగ్రహానికి ఎడమవైపు స్త్రీ పరిచారిక ఉండగా, కుడివైపున ఏనుగు తొండం కలిగి సవారీకి సిద్ధంగా ఉన్న గుర్రం, దానికింద సింహం ఉన్నాయి.
జనగామకు చెందిన పురావస్తు నిపుణుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో ఈవిగ్రహం వెలుగుచూసింది. విగ్రహం ఆధారాలను బట్టి అది రుద్రమదేవిదని భావిస్తున్నారు. 1289 నవంబర్ 27న రుద్రమదేవి మరణిం చినట్లుగా చందుపట్ల శాసనం చెబుతోంది. అయితే రుద్రమదేవి, తన సేనాధిపతి మల్లికార్జున నాయకుడు ప్రస్తుత ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గ్రామంలో మరణించి ఉండవచ్చని, చందుపట్లలో కాదని ప్రఖ్యాత శాసన పరిశోధకులు డాక్టర్ పి.వి.పరబ్రహ్మశాస్త్రి తెలిపినట్లు రత్నాకర్‌రెడ్డి చెప్పారు.
రుద్రమదేవి మరణించిన 11 రోజుల తర్వాత సేనాధిపతి మల్లికార్జుని కుమారుడు చందుపట్లలో శాససం వేశారు. దీన్ని బట్టి చూస్తే నవంబర్ 27 కాకుండా, అదే నెల17న వారు మరణించి ఉండవచ్చని పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయ పడినట్లు రత్నాకర్‌రెడ్డి తెలిపారు.