జాబిల్లిని చేరుకున్నాం.. కానీ!! | ROUNDUP 2019: India Launches Chandrayaan 2 successful mission | Sakshi
Sakshi News home page

జాబిల్లిని చేరుకున్నాం.. కానీ!!

Published Mon, Dec 30 2019 6:21 AM | Last Updated on Mon, Dec 30 2019 7:51 AM

ROUNDUP 2019: India Launches Chandrayaan 2 successful mission - Sakshi

భారత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు ఈ ఏడాది ఘనవిజయాలే నమోదు చేశాయి. ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–2 ప్రయోగం చివరి క్షణంలో వైఫల్యం ఎదుర్కోవడాన్ని మినహాయిస్తే ఇస్రో ఈ ఏడాది అభివృద్ధివైపు పురోగమించిందనే చెప్పాలి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో సిద్ధం చేసుకున్న నావిగేషన్‌ మైక్రో ప్రాసెసర్లతో రాకెట్లు నడవడం ఒక విజయమైతే... పీఎస్‌ఎల్‌వీ తన 50వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం, వివిధ దేశాలకు చెందిన 50 వరకూ ఉప గ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం ఇస్రో కీర్తి కిరీటంలో కలికి తురాయిలే. చెన్నై సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ షణ్ముఖ సుబ్రమణియన్‌ విక్రమ్‌ ల్యాండర్‌ అవశేషాలను గుర్తించి నాసా ప్రశంసలు అందుకోవడం ఈ ఏడాది హైలైట్‌!.

ఇక చంద్రయాన్‌ –2 గురించి... జాబిల్లిపై ఓ రోవర్‌ను దింపేందుకు, మన సహజ ఉపగ్రహానికి వంద కిలోమీటర్ల దూరంలో ఓ ఆర్బిటర్‌ను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన చంద్రయాన్‌ –2 ప్రయోగం జూలై 22న జరిగింది. జీఎస్‌ఎల్వీ మార్క్‌–3 రాకెట్‌ ద్వారా 3840 కిలోల బరువున్న చంద్రయాన్‌–2 పలుమార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టి.. జాబిల్లి కక్ష్యలోకి చేరింది. ఆ తరువాత క్రమేపీ జాబిల్లిని చేరుకుంది. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విజయవంతంగా విడి పోయినప్పటికీ జాబిల్లిపైకి దిగుతున్న క్రమంలో కొంత ఎత్తు లోనే సంబంధాలు తెగి పోయాయి. ఆ తరువాత కొద్ది కాలానికి ల్యాండర్‌ జాబిల్లి ఉపరితలాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది.

భారతీయ శాస్త్రవేత్త పేరుతో నక్షత్రం
► సౌర  కుటుంబానికి ఆవల ఉన్న ఒక గ్రహం తిరుగుతున్న నక్షత్రా నికి ఈ ఏడాది భారత శాస్త్రవేత్త బిభా ఛౌదరీ పేరు పెట్టారు.

► ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోపుగా పేరొందిన థర్టీ మీటర్‌ టెలిస్కోపు ద్వారా పరిశీలనలు జరిపేందుకు భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందీ ఈ ఏడాదే.

► ప్రభుత్వ రంగ సీఎస్‌ఐఆర్‌కు చెందిన సంస్థ కాలుష్యం వెదజల్లని టపాసులను సిద్ధం చేయగా, బొగ్గును మండించడం ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించే పరిశోధ నలు చేపట్టేందుకు బెంగళూరులో ఓ కేంద్రం ఏర్పాటైంది.

► కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఈ ఏడాది మానవ అట్లాస్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ‘మానవ్‌’పేరుతో జరుగుతున్న ఈ ప్రయత్నంలో శరీరంలోని కణస్థాయి నెట్‌వర్క్‌ తాలూకూ వివరాలు ఉంటాయి.

► వెయ్యి మంది భారతీయుల జన్యుక్రమ నమోదును ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్స్, హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement