GSLV mark-3
-
21న జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగం
సూళ్లూరుపేట: న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12.02 నిమిషాలకు తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జియో శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (జీఎస్ఎల్వీ మార్క్–3, ఎం–2) ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. యునైటెడ్ కింగ్డం(యూకే)కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్(వన్ వెబ్ కంపెనీ)తో ఇస్రో, న్యూ స్పేస్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ సంస్థలు ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇటీవల ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగానే వన్ వెబ్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను ఒకేసారి లోయర్ ఎర్త్ ఆర్బిట్ (లియో అర్బిట్) రోదశీలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో ఉపగ్రహం బరువు 137 కిలోలు ఉంటుందని, 36 ఉపగ్రహాలు కలిపితే 4,932 కిలోల బరువుగా ఇస్రో పేర్కొంది. ఈ ఉపగ్రహాలు, వాటితోపాటు ఫ్యూయల్‌ను కలిపితే 5.21 టన్నుల బరువుగా నిర్ధారించింది. జీఎస్ఎల్వీ మార్క్–3 ఎం–2 లాంటి భారీ రాకెట్‌ను వాణిజ్యపరంగా వాడుకునేందుకు వన్ వెబ్ కంపెనీ మూడుసార్లు 36 చొప్పున 108 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మరో రెండుసార్లు జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగాలను నిర్వహించేందుకు ఇస్రో ఇప్పటికే సిద్ధమైంది. వన్ వెబ్ కంపెనీ గ్లోబల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌గా రూపాంతరం చెంది వాణిజ్యపరంగా ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు ఇస్రోతో కలిసి ఈ ప్రయోగం చేపడుతోంది. -
జాబిల్లిని చేరుకున్నాం.. కానీ!!
భారత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలు ఈ ఏడాది ఘనవిజయాలే నమోదు చేశాయి. ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయోగం చివరి క్షణంలో వైఫల్యం ఎదుర్కోవడాన్ని మినహాయిస్తే ఇస్రో ఈ ఏడాది అభివృద్ధివైపు పురోగమించిందనే చెప్పాలి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో సిద్ధం చేసుకున్న నావిగేషన్ మైక్రో ప్రాసెసర్లతో రాకెట్లు నడవడం ఒక విజయమైతే... పీఎస్ఎల్వీ తన 50వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం, వివిధ దేశాలకు చెందిన 50 వరకూ ఉప గ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం ఇస్రో కీర్తి కిరీటంలో కలికి తురాయిలే. చెన్నై సాఫ్ట్వేర్ ఇంజినీర్ షణ్ముఖ సుబ్రమణియన్ విక్రమ్ ల్యాండర్ అవశేషాలను గుర్తించి నాసా ప్రశంసలు అందుకోవడం ఈ ఏడాది హైలైట్!. ఇక చంద్రయాన్ –2 గురించి... జాబిల్లిపై ఓ రోవర్‌ను దింపేందుకు, మన సహజ ఉపగ్రహానికి వంద కిలోమీటర్ల దూరంలో ఓ ఆర్బిటర్‌ను ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ –2 ప్రయోగం జూలై 22న జరిగింది. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా 3840 కిలోల బరువున్న చంద్రయాన్–2 పలుమార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టి.. జాబిల్లి కక్ష్యలోకి చేరింది. ఆ తరువాత క్రమేపీ జాబిల్లిని చేరుకుంది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విజయవంతంగా విడి పోయినప్పటికీ జాబిల్లిపైకి దిగుతున్న క్రమంలో కొంత ఎత్తు లోనే సంబంధాలు తెగి పోయాయి. ఆ తరువాత కొద్ది కాలానికి ల్యాండర్ జాబిల్లి ఉపరితలాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది. భారతీయ శాస్త్రవేత్త పేరుతో నక్షత్రం ► సౌర కుటుంబానికి ఆవల ఉన్న ఒక గ్రహం తిరుగుతున్న నక్షత్రా నికి ఈ ఏడాది భారత శాస్త్రవేత్త బిభా ఛౌదరీ పేరు పెట్టారు. ► ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోపుగా పేరొందిన థర్టీ మీటర్ టెలిస్కోపు ద్వారా పరిశీలనలు జరిపేందుకు భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిందీ ఈ ఏడాదే. ► ప్రభుత్వ రంగ సీఎస్ఐఆర్కు చెందిన సంస్థ కాలుష్యం వెదజల్లని టపాసులను సిద్ధం చేయగా, బొగ్గును మండించడం ద్వారా వచ్చే కాలుష్యాన్ని తగ్గించే పరిశోధ నలు చేపట్టేందుకు బెంగళూరులో ఓ కేంద్రం ఏర్పాటైంది. ► కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఈ ఏడాది మానవ అట్లాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ‘మానవ్’పేరుతో జరుగుతున్న ఈ ప్రయత్నంలో శరీరంలోని కణస్థాయి నెట్వర్క్ తాలూకూ వివరాలు ఉంటాయి. ► వెయ్యి మంది భారతీయుల జన్యుక్రమ నమోదును ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. -
విక్రమ్ ధ్వంసం కాలేదు
బెంగళూరు/కరాచీ: చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని పక్కకు ఒరిగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. అయితే ఈ ఘటనలో ల్యాండర్ ధ్వంసం కాలేదని వెల్లడించింది. విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొంది. ఈ విషయమై ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. ‘చంద్రుడిని ఢీకొన్న విక్రమ్ ముక్కలు కాలేదు. ఓ పక్కకు పడిపోయి ఉంది. దక్షిణ ధ్రువంలో మేం ల్యాండర్‌ను దించాలనుకున్నచోటుకు చాలా దగ్గరలో విక్రమ్ ఉన్నట్లు గుర్తించాం. విక్రమ్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇస్రోలో ఓ బృందం అవిశ్రాంతంగా పనిచేస్తోంది’ అని చెప్పారు. ఇస్రో జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా జూలై 22న చంద్రయాన్–2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈనెల 7న తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ జాబిల్లివైపు పయనమైంది. చంద్రుడికి 2.1 కి.మీ ఎత్తులో విక్రమ్ ఉండగా, కమాండ్ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఇస్రోకు పాక్ వ్యోమగామి మద్దతు.. విక్రమ్ వైఫల్యంపై పాక్ సైన్స్, టెక్నాలజీ మంత్రి ఫవాద్ చౌదరి ఎగతాళి చేసిన వేళ పాకిస్తాన్ నుంచే ఇస్రోకు మద్దతు లభించింది. చంద్రయాన్–2 ప్రయోగం గొప్ప ముందడుగని పాక్ తొలి మహిళా వ్యోమగామి నమీరా సలీం ప్రశంసించారు. ‘చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు చంద్రయాన్–2తో చారిత్రాత్మక ప్రయోగం చేపట్టిన ఇస్రోను అభినందిస్తున్నా. ఈ ప్రయోగంతో దక్షిణాసియా మాత్రమే కాదు.. అంతర్జాతీయ అంతరిక్ష పరిశ్రమ కూడా గర్వపడేలా ఇస్రో చేసింది’ అని కితాబిచ్చారు. పారిశ్రామికవేత్త రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన ‘వర్జిన్ గెలాక్టిక్’ అనే సంస్థ ప్రయోగించిన వాహకనౌక ద్వారా అంతరిక్షంలో విహరించిన నమీరా ఈ ఘనత సాధించిన తొలి పాకిస్తానీ. -
‘విక్రమ్’ను గుర్తించాం!
బెంగళూరు/వాషింగ్టన్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా జాబిల్లిపై దూసుకెళుతూ భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన ‘విక్రమ్’ ల్యాండర్‌ను గుర్తించామని తెలిపారు. చందమామ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటర్‌కు అమర్చిన కెమెరాలు ‘విక్రమ్’కు సంబంధించిన థర్మల్ ఇమేజ్‌లను చిత్రీకరించాయని వెల్లడించారు. ఈ చిత్రాలను చూస్తే విక్రమ్ హార్డ్ ల్యాండింగ్ అయినట్లు (చంద్రుడిపై పడిపోయినట్లు) అనిపిస్తోందని వ్యా ఖ్యానించారు. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్, అండ్ కమాండ్ నెట్వర్క్ కేంద్రంలో శివన్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విక్రమ్ ల్యాండర్ దెబ్బతిందా? అన్న మీడియా ప్రశ్నకు..‘ఆ విషయంలో మాకు స్పష్టత లేదు. ల్యాండర్ లోపలే రోవర్ ప్రజ్ఞాన్ ఉంది’ అని జవాబిచ్చారు. ఇస్రో ఈ ఏడాది జూలై 22న జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా చంద్రయాన్–2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. అయితే గత శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుడివైపు నెమ్మదిగా కదిలింది. మరో 2.1 కి.మీ ప్రయాణిస్తే ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలాన్ని తాకుతుందనగా, భూకేంద్రంతో ఒక్కసారిగా సంబంధాలు తెగిపోయాయి. సమయం మించిపోతోంది.. చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’ ల్యాండర్‌తో సంబంధాల పునరుద్ధరణకు సమయం మించిపోతోందని ఇస్రో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు పునరుద్ధరించే అవకాశాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ఈ విషయంలో ఆలస్యమయ్యేకొద్దీ విక్రమ్‌తో కమ్యూనికేషన్ వ్యవస్థల్ని పునరుద్ధరించడం కష్టమైపోతుంది. ఇప్పటికైనా ల్యాండర్ సరైన దిశలో ఉంటే సోలార్ ప్యానెల్స్ సాయంతో చార్జింగ్ చేసుకోగలదు. అయితే ఇది జరిగే అవకాశాలున్నట్లు కనిపించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. చంద్రుడిపై సురక్షితంగా దిగేలా విక్రమ్‌ను రూపొందించామనీ, అయితే జాబిల్లి ఉపరితలాన్ని వేగంగా తాకడం కారణంగా ల్యాండర్ దెబ్బతిని ఉండొచ్చని మరో ఇస్రో శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. ఇస్రో రూ.978 కోట్ల వ్యయంతో చంద్రయాన్–2 ప్రయోగాన్ని చేపట్టింది. ఇందులో జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ కోసం రూ.375 కోట్లు, ఆర్బిటర్–ల్యాండర్–రోవర్ కోసం రూ.603 కోట్లు వెచ్చించింది. మరోవైపు విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు శివన్ తెలిపారు. ఇస్రో ప్రయోగించిన ఆర్బిటర్‌లో 8 సాంకేతిక పరికరాలు ఉన్నాయనీ, ఇవి చంద్రుడి ఉపరితలాన్ని మ్యాపింగ్ చేయడంతో పాటు బాహ్య వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయని వెల్లడించారు. దేశ ప్రజలకు ఇస్రో కృతజ్ఞతలు.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగంలో ఒడిదుడుకులు ఎదురైనా ప్రధాని మోదీతో పాటు యావత్ భారతం తమవెంట నిలవడంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయమై శివన్ మాట్లాడుతూ..‘ప్రధాని మోదీతో పాటు దేశమంతా మాకు అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ చర్య శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల నైతిక స్థైర్యాన్ని అమాంతం పెంచింది’ అని తెలిపారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ స్పందిస్తూ..‘భారత ప్రజలు చూపిన సానుకూల దృక్పథంతో మేం కదిలిపోయాం. ఇస్రో చైర్మన్ శివన్, ఇతర శాస్త్రవేత్తల్ని వెన్నుతట్టి ప్రోత్సహించే విషయంలో ప్రధాని గొప్పగా ప్రవర్తించారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ల్యాండింగ్ ప్రక్రియ ఎంత సంక్లిష్టమైనదో ప్రజలు గుర్తించి తమకు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందని ఇస్రోకు గతంలో చైర్మన్‌గా పనిచేసిన ఏఎస్ కిరణ్‌కుమార్ వెల్లడించారు. ఇందుకోసం తాము దేశానికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ‘ఇస్రో’పై అమెరికా ప్రశంసలు.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగంపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రశంసలు కురిపించింది. ఈ ప్రయోగంతో తాము స్ఫూర్తి పొందామనీ, ఇస్రోతో కలిసి సౌర వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ప్రకటించింది. ఈ విషయమై నాసా స్పందిస్తూ.. ‘అంతరిక్ష ప్రయోగాలు అన్నవి చాలా సంక్లిష్టమైనవి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగేందుకు ఇస్రో చేపట్టిన చంద్రయాన్–2ను స్వాగతిస్తున్నాం’ అని తెలిపింది. ఇస్రో చేపట్టిన ప్రయోగం అద్భుతమనీ, దీనివల్ల శాస్త్రీయ పరిశోధనలు మరింత వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తంచేసింది. చంద్రుడిపై దిగే తొలిప్రయత్నంలో ఇండియా విజయవంతం కాకపోయినా భారత ఇంజనీరింగ్ నైపుణ్యం, సామర్థ్యం ఏంటో చంద్రయాన్–2తో ప్రపంచం మొత్తానికి తెలిసిందని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రశంసించింది. అమెరికా చేపట్టిన ‘అపోలో మిషన్’తో పోల్చుకుంటే ఎంతో చవకగా కేవలం 141 మిలియన్ డాలర్ల వ్యయంతోనే భారత్ చంద్రయాన్–2 చేపట్టిందని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. -
ముందుంది మరో నవోదయం
బెంగళూరు: చంద్రయాన్ –2 ప్రయోగం చివరి క్షణంలో ఎదురైన అడ్డంకిని చూసి శాస్త్రవేత్తలు నిరాశపడొద్దని, సరికొత్త నవోదయం మరోటి మనకోసం ఎదురుచూస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రయాన్–2లోని విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయిన క్షణం నుంచే ఇస్రో శాస్త్రవేత్తలను ఊరడించిన ప్రధాని శనివారం ఉదయం ఎనిమిదిగంటలకు వారందరిని కలసి మాట్లాడారు. ‘భారత్ మాతా కీ జై’ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. శాస్త్రవేత్తల్లో నెలకొన్న నిస్తేజాన్ని పోగొట్టి, ఉత్సాహపరిచేందుకు సాంత్వన వచనాలు పలికారు. లక్ష్యాన్ని సాధించే కొద్ది క్షణాల ముందు వైఫల్యం ఎదురవడం తనకూ తెలుసని, సైంటిస్ట్‌ల భావోద్వేగాలను అర్థం చేసుకోగలనని చెప్పారు. ల్యాండర్‌తో కమ్యూనికేషన్ నిలిచిపోయినపుడు శాస్త్రవేత్తల బాధను చూడలేకే ఇస్రో కేంద్రం నుంచి వెళ్లిపోయానని, ఏదో బోధించడానికి కాకుండా.. మీ నుంచి స్ఫూర్తి పొందేందుకే మళ్లీ ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నానని చెప్పారు. ఇస్రో సాధించిన గత ఘనతలన్నింటికీ భారత్ ఎంతో గర్విస్తోందని, భారత్ మీ వెన్నంటే ఉందన్నారు. ‘లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చాం. భవిష్యత్తులో మరింత పట్టుదలతో పనిచేయాలి. ఈ రోజు నేర్చుకున్న పాఠాలు మనల్ని భవిష్యత్తులో మరింత మెరుగుపరుస్తాయి. శక్తిమంతులుగా తీర్చిదిద్దుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారత అంతరిక్ష ప్రయోగాల్లో అసలైన ఘన విజయాలు ముందున్నాయని, కొత్త లక్ష్యదూరాలకు వెళ్లాలని, ఈ ప్రయాణంలో దేశ ప్రజలందరూ ఇస్రో వెన్నంటే ఉన్నారని భరోసా ఇచ్చారు. చంద్రయాన్ –2 సక్సెస్ కోసం శాస్త్రవేత్తలు చేసిన కృషి చాలా విలువైందని కొనియాడారు. విక్రమ్ జాబిల్లిని కౌగిలించుకుంది.. కవులు, కథల్లో జాబిల్లిని భావాత్మకంగా వర్ణించారని, బహుశా విక్రమ్ వీటి ప్రభావానికి లోనై, చివరి క్షణాల్లో జాబిల్లిని కౌగిలించుకుని ఉంటుందని మోదీ చమత్కరించారు. ఈ సంఘటన జాబిల్లిని అందుకోవాలన్న మన సంకల్పాన్ని దృఢం చేసిందన్నారు. ల్యాండర్‌తో సమాచారం తెగిపోయిందని తెలీగానే మీరంతా భావోద్వేగానికి లోనయ్యారు. కానీ, ఈ వైఫల్యం తాత్కాలికం మాత్రమేనని భవిష్యత్ విజయాలకు శక్తినిచ్చే విషయమన్నారు. ‘సైన్స్‌లో వైఫల్యాలు ఉండవు. ప్రయత్నాలు, ప్రయోగాలే ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. -
‘విక్రమ్’ ఎక్కడ..?
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–2లో చివరి క్షణంలో సాంకేతిక సమస్య ఎదురైంది. శనివారం తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా ఇస్రో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఎంతో ఆసక్తితో ప్రయోగాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తల్లో ఒక్కసారిగా గందరగోళం, నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు దేశ ప్రజలు, అటు శాస్త్రసాంకేతిక నిపుణుల్లో నైతికస్థైర్యం నింపేలా ఇస్రో కీలక ప్రకటన చేసింది. చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి 90 నుంచి 95 శాతం లక్ష్యాలను అందుకున్నామని తెలిపింది. చంద్రుడికి సంబంధించి తమ పరిశోధనలు కొనసాగుతాయంది. విక్రమ్ ల్యాండర్ అనుకున్న ప్రకారం తన వేగాన్ని తగ్గించుకుని చంద్రుడికి 2.1 కి.మీ దగ్గరకు సమీపించగానే సంకేతాలు నిలిచిపోయాయని చెప్పింది. రాబోయే 14 రోజుల్లో విక్రమ్‌తో కమ్యూనికేషన్ సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని పేర్కొంది. ఈ ప్రయోగానికి సంబంధించిన డేటాను తాము ప్రస్తుతం విశ్లేషిస్తున్నామని చెప్పింది. ఏడేళ్ల పాటు ఆర్బిటర్ సేవలు.. చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి ఇస్రో కీలక విషయాన్ని ప్రకటించింది. ఇందులో ప్రయోగించిన ఆర్బిటర్ జీవితకాలం ఏడు రెట్లు పెరిగిందని చెప్పింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా ఈ ఏడాది జూలై 22న చంద్రయాన్–2ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రయోగించిన ఆర్బిటర్ జీవితకాలం 12 నెలలు కాగా, ఇప్పుడు ఏడేళ్ల పాటు పనిచేసే అవకాశముందని ఇస్రో తెలిపింది. వాహకనౌకను అత్యంత కచ్చితత్వంతో ప్రయోగించడం, మిషన్ నిర్వహణ పద్ధతుల కారణంగా ఆర్బిటర్ జీవితకాలం 7 సంవత్సరాలు పెరిగిందని వెల్లడించింది. చంద్రుడి ధ్రువ ప్రాంతాల్లో మార్పులు, ఖనిజాలు, నీటి అణువులను ఈ ఆర్బిటర్ విశ్లేషిస్తుందని చెప్పింది. ఇందులోవాడిన అంత్యంత శక్తిమంతమన కెమెరా, చంద్రుడికి సంబంధించిన కీలక ఫొటోలను చిత్రీకరిస్తుందని ఇస్రో పేర్కొంది. అసలేమైంది..? కూలిపోయిందా?... సమాచార వ్యవస్థ మాత్రమే పనిచేయడం లేదా? మళ్లీ పనిచేసే అవకాశముందా? విక్రమ్‌పై ఇక ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? శనివారం ఉదయం నుంచి భారతీయులందరి మదిలో మెదిలిన ప్రశ్నలు ఇవే. కచ్చితమైన సమాధానాలకు కొంత కాలం వేచి చూడాల్సిందేగానీ.. నిపుణులు మాత్రం విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ వైఫల్యానికి పలు కారణాలు చెబుతున్నారు. విక్రమ్ ల్యాండర్‌తో సమాచారం తెగిపోయేందుకు ఒకటి కంటే ఎక్కువ కారణాలు ఉండవచ్చునని ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్ నాయర్ అభిప్రాయపడ్డారు. సెన్సర్లు పనిచేయకపోవడం మొదలుకొని, విక్రమ్‌లోని సాఫ్ట్వేర్ పనితీరులో తేడాలు, చివరి సెకనులో ఇంజిన్లు అందించే థ్రస్ట్ (చోదక శక్తి)లో మార్పులు వంటి కారణాలు ఉండవచ్చునని.. అసలు కారణమేదో ఇస్రో సమాచార విశ్లేషణతో తెలుస్తుందన్నారు. విక్రమ్ ప్రయాణించాల్సిన మార్గం, వేగాల్లో తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెగిపోయేంత వరకూ ఉన్న వివరాలను పరిశీలిస్తే కారణమేమిటో తెలియకపోదు అని ఆయన అన్నారు. జాబిల్లి ఉపరితలంపై దిగే క్రమంలో విక్రమ్ దిశ మారిపోయి ఉండవచ్చునని లేదా ఇంజిన్లు పనిచేయకపోవడం, కంప్యూటర్ సంబంధిత సమస్యలు వచ్చి ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని సాట్సెర్చ్ సంస్థ చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ నారాయణ ప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఇంకో 2.1 కిలోమీటర్లు మాత్రమే దిగాల్సిన స్థితిలో సమాచార సంబంధాలు తెగడం చూస్తే ఇంజిన్ సమస్యలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయన్నారు. విక్రమ్ క్రాష్‌ల్యాండ్ అవడంతో, దాని యంటెన్నా ధ్వంసమై సిగ్నల్స్ ఆగిపోయి ఉండొచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. గతి తప్పిందా? సెప్టెంబర్ 2న ఆర్బిటర్ నుంచి విడిపోయి విక్రమ్ ల్యాండర్ క్రమేపీ తన కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ జాబిల్లికి దగ్గరవడం తెల్సిందే. ఈ క్రమంలో ఇది సుమారు 35 కిలోమీటర్ల ఎత్తు నుంచి నెమ్మదిగా తన వేగాన్ని తగ్గించుకుంటూ ఉపరితలంపైకి నెమ్మదిగా ల్యాండ్ కావాలి. అయితే సమాచార సంబంధాలు తెగిపోయేందుకు క్షణం ముందు వరకూ విక్రమ్ ప్రయాణించిన మార్గాన్ని పరిశీలిస్తే... అది ముందుగా ల్యాండింగ్‌కు నిర్దేశించిన స్థానం నుంచి చాలా పక్కకు జరిగిందని ఒక నిపుణుడు తెలిపారు. విక్రమ్‌లోని నాలుగు ఇంజిన్లలో ఏ ఒక్కటి పనిచేయకపోయినా... వేగాన్ని నియంత్రించుకోవడం విక్రమ్ వల్ల అయ్యే పనికాదని, దీంతో అది వేగంగా పడిందేమోనన్నారు. విక్రమ్ ప్రయాణమార్గాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు. విక్రమ్ కిందకు దిగే సమయంలో జాబిల్లిపై గురుత్వాకర్షణ శక్తి వివరాలు కచ్చితంగా అందించాల్సిన అవసరముందని.. ఇందులో వచ్చే సూక్ష్మమైన మార్పులనూ లెక్కించాలని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సీఈవో పవన్ చందన చెప్పారు. విక్రమ్‌లోని ఆటానమస్ ల్యాండింగ్ సిస్టమ్ (తనంతట తానే కిందకు దిగేందుకు ఏర్పాటైన వ్యవస్థ), సమాచార వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విజయావకాశాలు 37 శాతమే విక్రమ్ సాఫ్ట్‌ల్యాండింగ్ ఆషామాషీ వ్యవహారం కాదని.. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రయోగంలో విజయావకాశాలు కేవలం 37 శాతమే అని శివన్ గతంలో అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు జరిగిన ప్రయత్నాల్లో విజయవంతమైంది 37 శాతమే. ఇస్రో ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. కాబట్టి అందరిలో ఉత్సుకత నెలకొంది’ అని శివన్ శుక్రవారం అన్నారు. ఈ నేపథ్యంలో చంద్రయాన్–2 చివరిక్షణంలో ఎదురుదెబ్బ ఎదుర్కోన్నా 95 శాతం సక్సెసే అనేది నిపుణుల మాట. -
మహిళా శక్తి @ చంద్రయాన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగించిన చంద్రయాన్–2 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తున్నట్టు సమాచారం. అంతరిక్ష శాస్త్ర విజ్ఞాన రంగం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో తామేమీ తక్కువ కాదన్నట్టుగా చంద్రయాన్–2 ప్రయోగంలో 30 శాతం మంది మహిళలు ఎంతో కృషి చేశారు. త్రీ–ఇన్–ఒన్‌గా భావిస్తున్న చంద్రయాన్–2 ప్రాజెక్టులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లు రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్, బెంగళూరులోని ప్రొఫెసర్ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్లో పని చేసి ల్యాండర్, రోవర్‌ను రూపొందించడంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం కూడా ఉంది. ఇందులో కొంతమందిని మాత్రమే ఇక్కడ ఉదహరిస్తున్నాము. భారతదేశానికి ఎంతో తలమానికంగా నిలిచే ఈ ప్రయోగంలో మహిళా శాస్త్రవేత్తల కృషి దాగి ఉండడం విశేషం. ఇస్రోలో 30 మంది మహిళా శాస్త్రవేత్తలు పనిచేస్తుండగా ఈ ప్రయోగంలో రీతూ కరిథల్ మిషన్ డైరెక్టర్‌గా, ఎం.వనిత ప్రాజెక్టు డైరెక్టర్‌గా అత్యంత కీలకంగా ఉన్నారు. బాలు శ్రీ దేశాయ్, డాక్టర్ సీత, కె.కల్పన, టెస్సీ థామస్, డాక్టర్ నేహ సటక్ అనే శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములై మహిళాశక్తిని నిరూపించారు. ‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ రీతూ.. చంద్రయాన్–2 మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరించిన రీతూ కరిథల్ ‘‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’’గా ఇస్రోలో అందరూ పిలుస్తుంటారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగంలో కూడా ఈమె డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈమె 2007లో మాజీ రాష్ట్రపతి, అణుపరీక్షల నిపుణులు డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం చేతుల మీదుగా ఇస్రో యంగ్ సైంటిస్ట్ అవార్డును కూడా అందుకున్నారు. చంద్రయాన్–2 మిషన్‌లో అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా అందరి మన్ననలను అందుకుంటున్నారు. ఉపగ్రహాల తయారీలో దిట్ట.. చంద్రయాన్–2 ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా పనిచేసిన ఎం.వనిత ఉపగ్రహాల రూపకల్పనలో నిపుణురాలు. ఆమె డిజైన్ ఇంజినీర్‌గా శిక్షణ తీసుకుని చంద్రయాన్–2 అత్యంత కీలకమైన మహిళా శాస్త్రవేత్తగా ఎంతో గుర్తింపు పొందారు. ‘‘ఆస్ట్రనామికల్ సొసైటీ అఫ్ ఇండియా ’’నుంచి 2006లో బెస్ట్ ఉమెన్ సైంటిస్టు అవార్డును అందుకున్నారు. చంద్రయాన్–2 మిషన్ బాధ్యతలన్నింటిని వనిత చూసుకుని ప్రయోగాన్ని విజయవంతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు: గవర్నర్ చంద్రయాన్–2 ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. భారతీయ అంతరిక్ష పరిశోధనల చరిత్రలో చంద్రయాన్2 మిషన్ భారీ ముందడుగు అని అన్నారు. గొప్ప ముందడుగు: ఏపీ సీఎం జగన్ చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం అయినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలను అభినందించారు. అంతరిక్ష రంగంలో ఈ విజయం అతి గొప్ప ముందడుగు అని ప్రశంసించారు. ఈ విజయంతో భారత్ చంద్రునిపై ప్రయోగాలు చేస్తున్న దేశాల సరసన చేరిందని అన్నారు. సీఎం కేసీఆర్ అభినందనలు చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంలో భారతీయ శాస్త్రవేత్తల కఠోర శ్రమ, మేథా సంపత్తి దాగి ఉందని కొనియాడారు. -
చంద్రుడి గుట్టు విప్పేందుకే..!
శ్రీహరికోట (సూళ్లూరుపేట): చంద్రుడు ఎలా ఉద్భవించాడు? చంద్రుడి ఉపరితలంపై ఉన్న మూలకాలు ఏంటి? భూమి ఏర్పడిన తొలినాళ్లలో చంద్రుడిలాగే ఉండేదా? అనే విషయాలను అధ్యయనం చేయడం కోసమే ఇస్రో చంద్రయాన్–2ను ప్రయోగించింది. చంద్రుడిని అధ్యయనం చేయడం వల్ల తొలినాళ్లలో భూవాతావరణం ఎలా ఉండేదన్న విషయాన్ని అర్థం చేసుకోగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చంద్రయాన్2 ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు పదేళ్లపాటు కష్టపడ్డారు. జీఎస్ఎల్వీ మార్క్3 రాకెట్ ద్వారా ప్రయోగించిన చంద్రయాన్–2 కాంపోజిట్ మాడ్యూల్స్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉంటాయి. ముందుగా ఆర్బిటర్ చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తూ అక్కడి సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగుతుంది. అనంతరం కొద్దిసేపటికే ల్యాండర్ నుంచి రోవర్ బయటకొచ్చి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు జరుపుతుంది. ఈ మూడు పరికరాలు సమన్వయంతో పనిచేస్తూ బెంగళూరులోని బైలాలులోని భూనియంత్రిత కేంద్రానికి డేలా పంపిస్తాయి. ఇందులో ల్యాండర్ 14 రోజులే పనిచేస్తుంది. ఆర్బిటర్ చంద్రునికి 100 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఏడాది పాటు సేవలు అందిస్తుంది. ఈ ప్రయోగానికి రూ. 978 కోట్లు వెచ్చించారు. ల్యాండర్ ‘విక్రమ్’అత్యంత కీలకం.. చంద్రయాన్2 మిషన్‌లోని ల్యాండర్‌ను శాస్త్రవేత్తలు ‘విక్రమ్’గా నామకరణం చేశారు. 1471 కేజీల బరువున్న ఈ ల్యాండరే ప్రయోగంలో అత్యంత కీలకమైనది. ఇలా చంద్రుని ఉపరితలంపై ల్యాండర్‌ను దించే ప్రయత్నం చేస్తున్న మొట్టమొదటి దేశం భారతే కావడం విశేషం. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా దేశాలు బాల్స్ ద్వారా రోవర్లు పంపారు. అయితే భారత్ మాత్రం నేరుగా ల్యాండర్‌ను దించే ప్రయత్నం చేస్తోంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్ చంద్రుడిపైకి దిగే 15 నిమిషాలే ఈ ప్రయోగంలో కీలకమైనవి. ల్యాండర్ ‘విక్రమ్’చంద్రుడివైపు నిమిషానికి 2 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే ప్రక్రియ సంక్లిష్టమైంది. ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగగలిగితే ప్రయోగం సక్సెస్ అయినట్లే. ఈ ల్యాండర్లో శాస్త్రవేత్తలు 3 పేలోడ్స్‌ను అమర్చారు. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలను కొలిచేందుకు ‘థర్మో–ఫికల్ ఎక్స్ఫర్మెంట్’ప్లాస్మా సాంద్రతను పరిశోధించేందుకు ‘లాంగ్ ముయిర్ ప్రోబ్’, చంద్రుని మూలాలను తెలుసుకోవడానికి ‘ఇన్స్ట్రుమెంట్ ఫర్ లూనార్ సీయాస్మిక్ యాక్టివిటి’అనే పరికాలను చంద్రయాన్–2లో ప్రయోగించారు. ప్రజ్ఞాన్ ‘రోవర్’తో త్రీడీ చిత్రాలు ఓసారి ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్నాక అందులోని రోవర్ విడిపోతుంది. దీనికి ‘ప్రజ్ఞాన్’ అని పేరుపెట్టారు. 27 కిలోల బరువుంటే ప్రజ్ఞాన్ సౌరశక్తితో ప్రయాణిస్తుంది. సెకన్‌కు ఒక సెంటీమీటర్ చొప్పున చంద్రుడిపై రోజుకు 500 మీటర్లు ప్రయాణిస్తూ అక్కడి ఉపరితలంపై ఉన్న అణువులను విశ్లేషించి డేటాను ల్యాండర్‌కు పంపుతుంది. ల్యాండర్ ఈ డేటాను ఆర్బిటర్‌కు చేరవేస్తే, అక్కడి నుంచి సమాచారం బెంగళూరులోని భూనియంత్రిత కేంద్రానికి చేరుతుంది. ఈ రోవర్‌కు ముందుభాగంలో మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు మోనోక్రోమాటిక్ నావ్ కెమెరాలున్నాయి. ఇవి ప్రజ్ఞాన్ ఉన్న ప్రదేశానికి సంబంధించిన 3డీ ఫొటోలను పంపుతాయి. ఈ రోవర్లో 2 పేలోడ్స్ ఉన్నాయి. ఇందులోని ఆల్ఫా పర్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, లాజర్ ఇన్డ్యూసెడ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనే పరికరాలు చంద్రుడు ఎలా ఏర్పడ్డాడు? అక్కడి పరిస్థితులు ఏంటి? అనే విషయాలతో పాటు పలు అంశాలపై పూర్తిస్థాయిలో పరిశోధనలు చేపట్టనుంది. ఈ రోవర్లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన లాజర్ రెట్రోరెఫ్లెక్టర్ అర్రే పరికరాన్ని కూడా అమర్చారు. ఈ పరికరం చంద్రుడి అంతర్భాగంతో ఏముందో పరిశోధించి నాసాకు పంపిస్తుంది. ఆర్బిటర్‌లో అయిదు పేలోడ్స్ ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. దీంట్లో 5 పేలోడ్స్ వున్నాయి. ‘లార్ట్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్’అనే ఉపకరణం చంద్రుడి ఉపరితలంపై ప్రధాన మూలకాల మ్యాపింగ్ చేపడుతుంది. ‘ఎల్ అండ్ ఎస్ బ్యాండ్ సింథటిక్ ఆపార్చర్ రాడార్’చంద్రునిపై నీరు, మంచు జాడను అన్వేషిస్తుంది. ఇక ‘ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రో మీటర్’ ఖనిజ, నీటి అణువులను పసిగట్టి సమాచారాన్ని చేరవేస్తుంది. ‘టెరియన్ మ్యాపింగ్ కెమెరా’ ఖనిజాల అధ్యయనం, త్రీడీ మ్యాపింగ్‌లో సాయపడనుంది. -
భారత సంకల్పానికి నిదర్శనం
న్యూఢిల్లీ: చంద్రయాన్–2 ప్రయోగం మన శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలను, శాస్త్రరంగంలో కొత్త లక్ష్యాలను సాధించాలన్న 130 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని ట్విట్టర్ ద్వారా ఈ ప్రయోగంలో పాలు పంచుకున్నవారందరికీ ఆడియో మెసేజ్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రయాన్–1 ప్రయోగంలో ఏర్పడిన అవాంతరాలను శాస్త్రవేత్తలు అధిగమించారు. ఈ ప్రయోగం ద్వారా వారి పట్టుదల, సంకల్పం మరోసారి రుజువయ్యాయి. ప్రతి భారతీయుడు ఎంతో గర్వపడుతున్నాడు’ అని పేర్కొన్నారు. ‘ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది. చంద్రుని గురించిన మరెన్నో విషయాలు తెలిసే అవకాశాలున్నాయి..ఇప్పటి వరకు ఎవరూ చేపట్టని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంపై అధ్యయనం జరగనుంది. ఘనమైన మన దేశ చరిత్రలో ఇది చాలా ప్రత్యేకమైన సమయం’ అని పేర్కొన్నారు. భారీ టీవీ స్క్రీన్‌పై చంద్రయాన్–2 ఉపగ్రహం ప్రయోగాన్ని తిలకిస్తున్నట్లు ఉన్న తన ఫొటోలను కూడా ప్రధాని జత చేశారు. ట్విట్టర్ ఆడియో సందేశంలో ప్రధాని.. ఇస్రో చైర్మన్ కె.శివన్‌తోపాటు శాస్త్రవేత్తల బృందానికి ప్రధాని అభినందనలు తెలిపారు. నైపుణ్యం, సామర్థ్యం, ఆత్మవిశ్వాసం కలిగిన మన శాస్త్రవేత్తలు ఎలాంటి సవాల్‌నైనా స్వీకరిస్తారనేందుకు ఇది గొప్ప ఉదాహరణ అని తెలిపారు. ‘సవాల్ ఎంత పెద్దదైతే, పట్టుదల కూడా అంతే ఉంటుంది. ప్రయోగం వారం ఆలస్యమైనా సరే, చంద్రయాన్–2 చంద్రుని చేరాలనే లక్ష్యం మాత్రం మారలేదు. ఈ ప్రయోగం ద్వారా చంద్రునిపైకి మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం చేరనుంది. అలాగే, చంద్రునిపైకి చేరనున్న నాలుగో దేశం భారత్ కానుంది’ అని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలకు పార్లమెంట్ అభినందనలు చంద్రయాన్–2ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభించిన ఇస్రో శాస్త్రవేత్తలను పార్లమెంట్ అభినందించింది. ఈ ప్రయోగం ద్వారా దేశ అంతరిక్ష ప్రయోగాల్లో భారత దేశం ఆధిక్యత మరోసారి రుజువైందని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. ‘మన శాస్త్రవేత్తలు సాధించిన ఘనత దేశానికి గర్వకారణం. భారత శాస్త్రవేత్తలకు, ఇందుకు తోడ్పాటు అందించిన ప్రధాని మోదీకి అభినందనలు’ అని స్పీకర్ అన్నారు. దేశీయ పరిజ్ఞానంతో చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తంచేశారు. నెహ్రూను గుర్తు చేసుకోవాల్సిన సమయం: కాంగ్రెస్ చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ ఘనత తమ పాలనతోనే సాధ్యమైందని కాంగ్రెస్ అంటుండగా, భవిష్యత్తు నాయకత్వం కనిపించనప్పుడు గతాన్ని తవ్వుకోవడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని బీజేపీ తిప్పికొట్టింది. చంద్రయాన్–2పై కాంగ్రెస్ పార్టీ ..‘ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను గుర్తు చేసుకోవాల్సిన మంచి సమయమిది. అంతరిక్ష పరిశోధనలకు గాను 1962లో ఆయన ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనే సంస్థను ఆ తర్వాత ఇస్రోగా పేరు మార్చారు. అలాగే, ప్రధాని మన్మోహన్సింగ్ 2008లో చంద్రయాన్–2కు ఆమోదం తెలి పారు’ అని తెలిపింది. దీనిపై బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర మండిపడ్డారు. ‘ఇది నిజంగా దిగజారుడుతనం. ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన ఈ క్షణాన్ని రాజకీయం చేయడం తగదు’ అని పేర్కొన్నారు. -
అందరి చూపూ ఇక సెప్టెంబర్ 7 వైపు!
హమ్మయ్యా...! ఒక ఘట్టం ముగిసింది. చంద్రయాన్ –2 ప్రయోగం విజవంతమైంది. ఇంకేముంది.. అంతా హ్యాపీయేనా?. ఊహూ.. అస్సలు కాదు. ఇస్రోకు అసలు పరీక్ష ముందుంది. కచ్చితంగా చెప్పాలంటే సెప్టెంబరు 7వ తేదీన! ఆ రోజు ఏం జరగబోతోంది? చక్కగా వేసిన రహదారిపై వాహనాన్ని నడపడం చాలా సులువే. రహదారి అస్సలు లేకపోతేనే సమస్య. ఇస్రో పరిస్థితి ఇప్పుడు ఇదే. ఇప్పటివరకూ ఎవ్వరూ చేయని విధంగా జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్ –2ను దింపాలన్న ఇస్రో ఆలోచన చాలా సమస్యలతో కూడుకున్నది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ కె.శివన్ స్వయంగా అంగీకరించారు కూడా. జూలై 22న నింగికి ఎగసిన చంద్రయాన్ –2 ముందుగా భూమి చుట్టూ కొన్ని చక్కర్లు కొట్టి.. ఆ తరువాత జాబిల్లి కక్ష్యలోకి చేరుతుంది. చందమామను కూడా కొన్నిసార్లు చుట్టేసిన తరువాత ఆచితూచి జాబిల్లిపైకి దిగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత సంక్లిష్టమైన, సమస్యా పూర్వక ఘట్టం.. జాబిల్లిపై చంద్రయాన్ దిగే చివరి 15 నిమిషాలు మాత్రమే! భూమి చుట్టూ 23 రోజులు, చంద్రుడి చుట్టూ 12 రోజులు భూమికి అతిదగ్గరగా 170 కిలోమీటర్లు (అపోజీ) అతి దూరంగా 40,000 కిలోమీటర్లు (పెరిజీ) ఉండేలా దాదాపు 23 రోజుల పాటు చక్కర్లు కొడుతూ ఉంటుంది. పూర్తిస్థాయి వేగం అందుకున్న తరువాత చంద్రయాన్ –2ను జాబిల్లి కక్ష్యలోకి పంపుతారు. ఇందుకు ఐదు రోజుల సమయం అవసరమవుతుంది. ఒక్కసారి జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞ్యాన్‌లతో కూడిన చంద్రయాన్–2 మాడ్యూల్ దాదాపు 12 రోజుల పాటు చక్కర్లు కొడుతూ క్రమేపీ తన వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లికి దగ్గరగా చేరుతుంది. ప్రయోగం జరిగిన 48వ రోజున.. అంటే సెప్టెంబరు ఏడున ఆర్బిటర్ (జాబిల్లి చుట్టూ తిరిగి వివరాలు సేకరించే భాగం) నుంచి రోవర్‌తో కూడిన ల్యాండర్ వేరుపడుతుంది. జరిగేది జూలై 15 ప్రణాళిక ప్రకారమే ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరుపడటంతో మొత్తం ప్రయోగంలో అత్యంత కీలకమైన ఘట్టం మొదలవుతుంది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇప్పటికే గుర్తించిన రెండు భారీ గుంతల మధ్య దిగేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ల్యాండర్ తన వేగాన్ని నియంత్రించుకుంటూ.. నిర్దిష్ట ప్రాంతంలో దిగాల్సి ఉండటం ఇందుకు కారణం. ఈ ప్రక్రియ కాస్తా విజయవంతమైతే.. కొంత సమయం తరువాత ల్యాండర్ లోపలి నుంచి రోవర్ కిందకు దిగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముందుగా అనుకున్నట్లు చంద్రయాన్ –2 ప్రయోగం జూలై 15న జరిగి ఉంటే.. జాబిల్లిపై ల్యాండింగ్ 54వ రోజు జరగాల్సి ఉండింది. కానీ ప్రయోగం వాయిదా పడింది. అయినాసరే.. సెప్టెంబరు 6–7 మధ్యకాలంలో జాబిల్లిపై ల్యాండ్ అయితే వచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇస్రో కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. భూమి చుట్టూ తిరిగే కాలాన్ని 17 నుంచి 23 రోజులకు పెంచింది. అదేసమయంలో జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించడం, అక్కడ చక్కర్లు కొట్టే కాలాన్ని తగ్గించింది. జాబిల్లిపై రోవర్, ల్యాండర్లు చేయాల్సిన ప్రయోగాలకు ఇది కీలకం. ఈ రెండు పరికరాలూ సోలార్ ప్యానెల్స్‌తో విద్యుదుత్పత్తి చేసుకుని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు ఆరవ తేదీ మొదలుకొని కొన్ని రోజుల పాటు ల్యాండర్, రోవర్లు దిగే ప్రాంతం భూమికి అభిముఖంగా ఉంటూ సూర్యుడి కిరణాలు ప్రసారమవుతూంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నిప్పులు చిమ్ముతూ...
జాబిల్లి రహస్యాలను శోధించే లక్ష్యంతో చేపట్టిన చంద్రయాన్ 2 తొలి అడుగు విజయవంతంగా పడింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన బాహుబలి జీఎస్ఎల్వీ మార్క్ 3 ఎం 1 రాకెట్.. చంద్రయాన్ 2ను నిర్ధారిత కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇక.. సెప్టెంబర్ 7న చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండర్‌ను దింపడమనే మలి అడుగు కోసం మానవాళి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో విజయవంతంగా చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా భారత దేశ అంతరిక్ష పరిశోధన శక్తి సామర్థ్యాలను ఇస్రో మరోసారి ప్రపంచం కళ్లకు కట్టింది. శ్రీహరికోట (సూళ్లూరుపేట)/సాక్షి ప్రతినిధి, అమరావతి: చంద్రుణ్ని చేరుకునే ప్రయాణంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. బాహుబలిగా పిలిచే, 640 టన్నుల బరువుండే జీఎస్ఎల్వీ–మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్–2ను విజయవంతంగా భూ కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. 3,850 కేజీల బరువున్న చంద్రయాన్–2ను సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని రెండో వేదిక నుంచి నింగికి పంపారు. ప్రయోగం సమయంలో మేఘావృతమై ఉన్న ఆకాశంలోకి రాకెట్ నారింజ, పసుపు వర్ణాల్లో నిప్పులు చిమ్ముతూ ఎగిరింది. సరిగ్గా 16.14 నిమిషాల్లో చంద్రయాన్–2 మాడ్యూల్‌ను భూ కక్ష్యలోకి రాకెట్ ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది. ప్రయోగం సమయంలో ఎంతో ఉత్కంఠతో ఊపిరిబిగబట్టుకుని కూర్చున్న శాస్త్రవేత్తలు, తొలిదశ విజయవంతమైందన్న ప్రకటనతో ఒక్కసారిగా హర్షధ్వానాలతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని తమ సంతోషాన్ని పంచుకున్నారు. ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 15న తెల్లవారుజామున 2.51 గంటలకే చంద్రయాన్–2 ప్రయోగం జరగాల్సి ఉండగా.. రాకెట్‌లోని మూడో దశ క్రయోజనిక్‌లో పోగో గ్యాస్ బాటిల్స్ నుంచి క్రయోఇంజిన్ ట్యాంక్‌కు వెళ్లే పైపులు బయట ప్రాంతంలో లీకేజిని గుర్తించి ప్రయోగాన్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇస్రో శాస్త్రవేత్తలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 24 గంటల్లోనే లోపాన్ని సరిచేశారు. 48 రోజుల పాటు లక్షల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం సెప్టెంబర్ 7న ఈ ఉపగ్రహం జాబిల్లిపై అడుగుమోపనుంది. టెన్షన్.. టెన్షన్ చంద్రుడిపైకి మొట్టమొదటిగా ఆర్బిటర్ ద్వారా ల్యాండర్, ల్యాండర్లో అమర్చిన రోవర్ ప్రయోగం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలందరిలో ఎడతెగని టెన్షన్.. ఈ భారీ ప్రయోగంపైనే అందరి ధ్యాస. ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 20 గంటలు ముగిసే సమయం దగ్గర పడింది. షార్‌లోని మీడియా సెంటర్, మిషన్ కంట్రోల్ సెంటర్లోని మైక్‌లలో 6.. 5.. 4.. 3.. 2.. 1.. 0 అనగానే ఒక్కసారిగా అందరి కళ్లూ తూర్పు దిక్కున ఆకాశం వైపునకు మళ్లాయి. క్షణాల్లో ఆకాశంలో కమ్ముకున్న మబ్బులను చీల్చుకుంటూ జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక చంద్రయాన్–2ను మోసుకుని నింగివైపుకెళ్లింది. మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తలు కంప్యూటర్లను ఆపరేట్ చేస్తూ రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఒక్కో దశ విజయవంతంగా దూసుకుపోవడంతో శాస్త్రవేత్తల వదనాల్లో చిరునవ్వులు. ఇలా మూడు దశలను సమర్థవంతంగా పూర్తి చేశారు. చంద్రయాన్–2ను నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీంతో మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తల్లో విజయగర్వం తొణికిసలాడింది. చంద్రయాన్–2 భూ కక్ష్యలోకి చేరిందనీ, అంతా సవ్యంగా సాగుతోందని బెంగళూరులోని ఇస్రో మాస్టర్ కంట్రోల్ సెంటర్ ప్రకటించింది.శ్రీహరికోట నుంచి చేసిన అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో 75వ సారి ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది. ప్రయోగం ఇలా జరిగింది.. మొత్తం 3,850 కేజీల బరువైన చంద్రయాన్–2 మిషన్‌లో 2,379 కేజీల బరువైన ఆర్బిటర్, 1,471 కిలోల బరువు కలిగిన ల్యాండర్ (విక్రమ్), 27కేజీల బరువైన రోవర్ (ప్రజ్ఞాన్) ఉన్నాయి. ఇందులో మొత్తంగా 13 పేలోడ్లు ఉండగా, వాటిలో 3 యూరప్‌వి, రెండు అమెరికావి, ఒకటి బల్గేరియాది. నాసాకు చెందిన లేజర్ రెట్రోరిఫ్లెక్టర్ ఎరే (ఎల్ఆర్ఏ) కూడా వాటిలో ఓ పే లోడ్. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ మొదటి దశలో ఇరువైపులా అత్యంత శక్తివంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి తన ప్రయాణాన్ని దిగ్విజయంగా ప్రారంభించింది. ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 132.7 సెకన్లలో మొదటి దశను పూర్తి చేశారు. రెండో దశలో ఎల్–110 అంటే ద్రవ ఇంజిన్ మోటార్లు 110.84 సెకన్లకే స్టార్ట్ అయ్యాయి. 205 సెకన్లకు రాకెట్ శిఖరభాగాన అమర్చిన చంద్రయాన్–2 మిషన్‌కు ఉన్న హీట్‌షీల్డ్స్ విజయవంతంగా విడిపోయాయి. ఇక్కడ 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 307 సెకన్లకు రెండో దశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. క్రయోజనిక్ (సీ–25) మోటార్లు 311.22 సెకన్లకు మండించి 978 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను పూర్తి చేశారు. ఈ దశ నుంచి రాకెట్‌కు శిఖర భాగాన అమర్చిన త్రీ–ఇన్–ఒన్ చంద్రయాన్–2 మిషన్‌ను క్రయోజనిక్ దశతో 978.8 సెకన్లకు (16.55 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ) 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 40,000 కి.మీ. ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. రాకెట్ గమన తీరు అత్యంత సజావుగా సాగడంతో అపోజిని మరో 6,000 కి.మీ. దూరం ముందుకు పంపించి జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ తన సత్తాను చాటుకుంది. అంటే 46,000 కి.మీ. దూరంలోకి తీసుకెళ్లారు. దీనివల్ల చంద్రయాన్–2 కాలపరిమితి పెరగడమే కాకుండా ఆర్బిట్ రైజింగ్ ప్రక్రియ తగ్గింది. దీంతోచంద్రయాన్–2లో ఉన్న ఇంధనం కూడా ఆదా అయ్యి దాని జీవిత గమనం పెరిగిందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఇప్పటినుంచి చంద్రుడిపైకి వెళ్లే వరకు మిషన్‌ను బెంగళూరులోని మాస్టర్ కంట్రోల్ సెంటర్లోనే పూర్తి చేస్తారు. చంద్రుడిపైకి ఇలా... ముందుగా 16 రోజుల్లో ఆర్బిటర్‌లో నింపిన ఇంధనాన్ని మండించి అపోజిని 46,000 కి.మీ. నుంచి 1,41,000 కి.మీ.కు పెంచేందుకు ఆర్బిటర్‌ను మండించి 4సార్లు కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను చేపడతారు. ఐదోసారి ఆర్బిటర్‌కు ట్రాన్స్‌లూనార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుడివైపు ప్రయా ణం చేసేందుకు మళ్లిస్తారు. అనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు చంద్రునికి చుట్టూ రెట్రోబర్న్ చేసి వంద కి.మీ. వృత్తాకార కక్ష్యను తగ్గించడానికి 4సార్లు ఆపరేషన్ చేపడతారు. 100 కి.మీ. నుంచి 30 కి.మీ. ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్‌ను మండిస్తారు. ఆ తరువాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి మీదకు ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాత ల్యాండర్‌ను 15 నిమిషాలు మండించి చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దించే ప్రక్రియను చేపడతారు. ఆ 15 నిమిషాలు... చంద్రయాన్–1లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే చంద్రయాన్–2లోనూ ఉపయోగించారు. అయితే ఇందులో ల్యాండర్‌ను చంద్రు డిపై దించే ప్రక్రియను కొత్తగా రూపొందించారు. ఇప్పటి దాకా ఇలాంటి ల్యాండింగ్ ఎవరూ చేయలేదు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయే కీలకమైన సమయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతాయోనని ఇస్రో శాస్త్రవేత్తల్లో కొంత ఆందోళన నెలకొని ఉంది. ఈ 15 నిమిషాల సమయాన్ని అధిగమించేందుకు ఈ ప్రయోగంలో ఇస్రో మొదటిసారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించనున్నారు. చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ మృదువైన చోట ల్యాండ్ అయిన తరువాత ల్యాండర్ తలుపులు తెరుచుకోకుంటే ల్యాండర్ తలుపు బయటకొచ్చేలా డిజైన్ చేశారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపై రావడానికి 4 గంటల సమయం తీసుకుంటుంది. తొలిసారిగా చంద్రు ని దక్షిణ ధృవంపై అడుగుపెడుతున్న దేశంగా భారత్ రికార్డులకు ఎక్కనుంది. 14 రోజుల్లో 500 మీటర్లు రోవర్ సెకెండ్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుం ది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. చంద్రుడిపై ఒక రోజు అంటే భూమి మీద మనకు 14 రోజులు. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై మూలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్ నాలుగోది.ఇప్పటి వరకూ రష్యా, అమెరికా, చైనాలకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. ఇప్పుడు చంద్రయాన్–2 పేరుతో చంద్రుడి ఉపరితలంపైకి ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించే నాలుగోదేశంగా నిలిచింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు ఈ ఘనత సాధించాయి. మూడింటిని ఒకేసారి పంపిస్తున్నారు కనుక దీన్ని త్రీ ఇన్ ఒన్ ప్రయోగంగా ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చందమామ కథ ఇదీ.. అంతరిక్షంపై పట్టు బిగించడానికి అమెరికా గట్టి ప్రయత్నాలే చేసింది. అపోలో మిషన్ ద్వారా చంద్రలోకంపైకి తొలి అడుగు వేసింది. ప్రాజెక్టు జెమినీ ప్రారంభించి అపోలోకు సాంకేతికపరంగా కొత్త హంగులు అద్దడానికి కృషి చేసింది. మొదట్లో అపజయాలు ఎదురైనా కుంగిపోలేదు. అపోలో–1 ప్రయోగం విఫలమై ముగ్గురు వ్యోమగాములు మృతి చెందారు. ఆ తర్వాత మరిన్ని పరిశోధనలు చేసింది. మొత్తంగా 6,300 టెక్నాలజీలపై ఆధిపత్యం సాధించింది. సరిగ్గా యాభై ఏళ్ల క్రితం అపోలో–11ను ప్రయోగించింది. 1969 జూలై 16న నాసా కేప్ కేనర్వాల్ అంతరిక్ష కేంద్రం నుంచి శాటర్న్–5 రాకెట్ ద్వారా అపోలో–11 నింగికి ఎగిసింది. ఈ ప్రయోగం జరిగిన 3 రోజుల తర్వాత అపోలో–11 జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది. జూలై 20న జాబిల్లిపై నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ తొలి అడుగు వేశారు. ఆ తర్వాత ఆరు గంటల పైగా తేడాతో లూనార్ మాడ్యూల్ పైలట్ బజ్ అల్డ్రిన్ జాబిల్లిపైకి దిగారు. ఇద్దరు వ్యోమగాములు జాబిల్లిపై 21.38 గంటలు గడిపారు. 21.7 కేజీల మట్టి, రాతి నమూనాలను సేకరించారు. జూలై 22న లూనార్ మాడ్యూల్‌ను విడుదల చేసిన తర్వాత అపోలో భూమికి తిరుగు ప్రయాణమైంది. 1969 జూలై 24న ఇద్దరు వ్యోమగాములు సురక్షితంగా భూమికి వచ్చారు. ఇక సూర్యుడిపై... 2020లో ఆదిత్య ఎల్1 ప్రయోగం న్యూఢిల్లీ: చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై దృష్టి సారించింది. సూర్యుడి ఉపరితలంపై కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించిన ‘కరోనా’ను అధ్యయనం చేసేందుకు ‘ఆదిత్య –ఎల్1’ అనే వ్యోమనౌకను ప్రయోగించనుంది. 2020 ప్రధమార్థంలో ఈ ప్రయోగాన్ని చేపడతామని ఇస్రో తెలిపింది. ‘సూర్యుడి ఉపరితంలపై సాధారణంగా 6,000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అదే సూర్యుడి బాహ్య ఉపరితల ప్రాంతమైన ‘కరోనా’లో 9.99 లక్షల డిగ్రీల ఉష్ణోగ్రత నమోదువుతోంది. కరోనాలో ఇంతభారీగా ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయో ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. తాజాగా మేం ప్రయోగించనున్న ఆదిత్య–ఎల్1 నౌక కరోనాతో పాటు ట్రోపోస్పియర్, ఫొటోస్పియర్, సూర్యుడి నుంచి కణాల ప్రవాహాన్ని అధ్యయనం చేస్తుంది’ అని ఇస్రో వెల్లడించింది. వాతావరణ మార్పులపై కరోనా గణనీయమైన ప్రభావం చూపుతుందని పేర్కొంది. భూమికి సూర్యుడు 14.96 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. చంద్రయాన్–1తో పరిశోధనలిలా.. శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2007 దాకా వివిధ రకాలైన రాకెట్ల ద్వారా రిమోట్ సెన్సింగ్, సమాచారం, వాతావరణ పరిశోధన, ఖగోళ పరిశోధనలకు సంబంధించిన ప్రయోగాలు మాత్రమే చేస్తూ వచ్చింది. గ్రహాంతర ప్రయోగాలు చేయాలని నిశ్చయించుకుని 2008లో చంద్రయాన్–1 ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా చేపట్టింది. ఆ ప్రయోగంలో చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపి పరిశోధనలు చేసింది. అయితే చంద్రయాన్–1 ఉపగ్రహాన్ని రెండేళ్లపాటు పనిచేసే లా రూపొందించారు. అయితే, అందులో పంపిన పరికరాలు పది నెలలకే పనిచేయడం మానేశాయి. అంటే చంద్రయా న్–1 పది నెలలు పనిచేసిన తరువాత సాంకేతికపరమైన లోపంతో పనిచేయడం మానేసింది. అప్పటికే చంద్రుడిపై నీటి అణువుల జాడ ఉందని గుర్తించి ఇస్రో చరిత్ర సృష్టించి ంది. భారతదేశం నుంచి చంద్రుడిపైకి వెళ్లిన మొట్టమొదటి ప్రయోగం ఇదే. అతి తక్కువ ఖర్చుతో ఈ ప్రయోగాన్ని చేపట్టి చంద్రుడిపై పరిశోధనలు జరిపింది. చంద్రయాన్–1 మిషన్ పూర్తిస్థాయిలో పని చేయకపోవడంతో దానికి కొనసాగింపుగా చంద్రయాన్–2 మిషన్‌ను ప్రయోగించారు. ఇస్రోకు నాసా అభినందనలు చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రోకు అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా అభినందనలు తెలిపింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువం గురించి ఇస్రో వెలుగులోకి తెచ్చే కొత్త విషయాల కోసం ఎదురుచూస్తామని తెలిపింది. ‘చంద్రునిపై అధ్యయనానికి చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రోకు అభినందనలు. విశ్వాంతరాళంలో ఉన్న మా సాంకేతిక వనరులను మీకు సాయంగా అందించడానికి గర్విస్తున్నాం. చంద్రుని దక్షిణ ధ్రువం గురించి మీరు కనుగొనే కొత్త విషయాల కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలోనే మేం కూడా ఆర్టిమిస్ మిషన్ ద్వారా ఆ ప్రాంతంలోకి వ్యోమగాములను పంపనున్నాం’ అని ట్విట్టర్లో నాసా పేర్కొంది. చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం కావడం దేశ ప్రజలందరికీ గర్వించదగ్గ క్షణం. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలకు అభినందనలు. – ట్విట్టర్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇది ప్రతి భారతీయుడూ గర్వించాల్సిన విషయం. సాంకేతిక కారణాలతో గత వారం ఈ ప్రయోగం వాయిదాపడినా.. వారంలోనే విజయవంతంగా ప్రయోగం పూర్తి చేశారు. మీకు (ఇస్రో శాస్త్రవేత్తలకు) అభినందనలు. – ట్విట్టర్ ఆడియో సందేశంలో మోదీ గర్వంగా ఉంది. ఇందులో ప్రయోగించిన అన్ని సాంకేతిక పరికరాలను భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ చరిత్రాత్మక ప్రయాణం మొదలైంది. – డాక్టర్ కె.శివన్, ఇస్రో చైర్మన్ -
నాలుగు రోజుల్లోనే రెట్టించిన ఉత్సాహంతో
ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రయోగం. ప్రపంచ దేశాలన్నీ సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ వైపే చూశాయి. ఈ ప్రయోగాన్ని వీక్షించేం దుకు దేశ ప్రథమ పౌరుడు రామ్‌నాథ్ కోవింద్ కూడా వచ్చారు. ఆదివారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. దేశమంతా మేల్కొని ప్రయోగాన్ని చూస్తోంది. ఇంకొన్ని నిమిషాల్లో చంద్రయాన్–2 నింగికి పయనమయ్యేది.. కానీ క్రయోజనిక్ దశలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం వాయిదా పడింది. అందరితో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు సైతం నిరాశ చెందారు. ఇక ప్రయోగానికి రెండు నెలల సమయం పడుతుందనుకున్నారు. శాస్త్రవేత్తలు వెంటనే తేరుకున్నారు. కేవలం రోజుల వ్యవధిలోనే సమస్యను సరిచేశారు. రెట్టించిన ఉత్సాహంతో ఈ నెల 22వ తేదీన సగర్వంగా చంద్రయాన్–2ను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. సాక్షి, సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ రాకెట్ల ప్రయోగాల్లో ఇస్రోది తిరుగులేని ఆధిపత్యం. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో జీఎస్ఎల్వీ రాకెట్లను సైతం విజయవంతంగా నింగికి పంపుతోంది. ఇందులో క్రయోజనిక్ దశ కీలకమైంది. తొలినాళ్లలో రష్యా నుంచి తెచ్చిన క్రయోజనిక్ ఇంజిన్ల సహకారంతో జీఎస్ఎల్వీని ప్రయోగించేది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజిన్లు తయారు చేసే విషయంలో ఇస్రో ముందడుగు వేసింది. ఇప్పటివరకూ 13 జీఎస్ఎల్వీలు ప్రయోగించగా అందులో 7 స్వదేశీ ఇంజిన్లు ఉండడం గమనార్హం. ఇందులో ఒకటి మాత్రమే విఫలమైంది. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ల సిరీస్‌లో మూడు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. 2010 ఏప్రిల్ 5వ తేదీన తొలిసారిగా స్వదేశీ క్రయోజనిక్ ఇంజిన్‌తో చేసిన ప్రయోగం విఫలమైంది. అందులో జరిగిన లోపాలపై 2010 నుంచి 2013 దాకా అధ్యయనం చేసింది. లోపాలను సరిదిద్ది అదే సంవత్సరం ఆగస్టు 19న జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగానికి సిద్ధమైంది. ఆ ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్ ప్రారంభించి మరో గంటలో ప్రయోగం ఉందనగా రెండోదశలో లీకేజీని గుర్తించి ప్రయోగాన్ని ఆపేసింది. అది మేజర్ సాంకేతిక లోపం కావడంతో రాకెట్‌లోని ఇంధనాన్ని అంతా వెనక్కి తీయడమే కాకుండా రాకెట్‌ను పూర్తిగా విప్పేసి రెండో దశలో లీకేజీ వచ్చిన చోటును గుర్తించి నాలుగు నెలల్లో అంటే 2014 జనవరి నెలలో ప్రయోగాన్ని చేసి విజయవంతంగా గగనంలోకి పంపింది. ఆ తరువాత చేసిన జీఎస్ఎల్వీ ప్రయోగాలన్నీ విజయవంతం కావడం విశేషం. ప్రయోగానికి సిద్ధం తాజాగా చంద్రయాన్–2 మిషన్‌ను తీసుకెళ్లే జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్లో మూడో దశలోని క్రయోజనిక్ దశలో పోగో గ్యాస్బాటిల్స్ నుంచి ట్యాంక్‌కు వెళ్లే పైపులు బయటవైపు లీకేజీని గుర్తించి 56.24 నిమిషాల ముందు ప్రయోగాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ సాంకేతిక లోపాన్ని అధిగమించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు చర్యలు చేపట్టారు. కేవలం నాలుగు రోజుల్లోపే అంతా సరిచేసి ప్రయోగానికి సిద్ధమయ్యారు. అయితే ముందుగా సెప్టెంబర్ నెల వరకు పడుతుందని, ఈ ఏడాది ఆఖరు దాకా సమయం తీసుకుంటుందని అనుకున్నారు. శాస్త్రవేత్తలు దీనిని సవాలుగా తీసుకుని తక్కువ సమయంలో మరమ్మతులు చేశారు. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ ద్వారా చంద్రయాన్–2 ప్రయోగాన్ని ఈ నెల 22న సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. -
వెన్నెల రాజు చెంతకు..!
సాక్షి, శ్రీహరికోట(సూళ్లూరుపేట): చందమామ ఉపరితలంలో కలియదిరుగుతూ పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్–2 ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ అనుసంధానం కార్యక్రమాలు ముగిశాయి. ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశానికి ఈ ప్రయోగం తలమానికం కావడంతో ప్రపంచమంతా ఇస్రో వైపు చూస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ(ఇస్రో) ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను నింగిలోకి పంపనుంది. ఇందుకు సంబంధించి సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్ షార్ కేంద్రంలో రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ షార్‌లోని రెండో ప్రయోగవేదికపై ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక బిల్డింగ్(వ్యాబ్) జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ అనుసంధానం పూర్తయింది. అక్కడి నుంచి రాకెట్‌ను ఉంబ్లికల్ టవర్‌కు అనుసంధానం చేసిన తరువాత పలు పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షలు చేయడంలో భాగంగా మంగళవారం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్(ఎఫ్డీఆర్–1) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన పనులను పూర్తిచేయడంలో ఇస్రొ శాస్త్రవేత్తలు బిజీబిజీగా ఉన్నారు. ఈ నెల 13వ తేదీ మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించిన అనంతరం ప్రయోగతేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. చంద్రుని మీద ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే పరిశోధనలు చేశాయి. 2008లో భారత్ చంద్రయాన్–1 ద్వారా మొదటి ప్రయత్నంలో చంద్రుడి చుట్టూ ఉపగ్రహాన్ని పంపి పలు పరిశోధనలు చేసిన విషయం తెలిసిందే. చంద్రయాన్–2 మిషన్‌లో భాగంగా ఈ సారి చంద్రుడిపైకి ల్యాండర్‌ను దింపి అందులో ఉన్న రోవర్ ద్వారా చంద్రుడిపై పరిశోధనలు చేస్తారు. చంద్రుడి మీద పరిశోధనలు చేసే నాలుగో దేశంగా భారత్ ఆవిర్భవించనుంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఈ నెల 13న రాత్రి షార్కు చేరుకోనున్నారు. -
చంద్రుని దక్షిణ ధ్రువంపైకి రోవర్
సాక్షి ప్రతినిధి, చెన్నై/శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్–2 ప్రాజెక్టును ఈ ఏడాది జూలై 9వ తేదీ నుంచి 16వ తేదీల మధ్యలో ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చంద్రుని దక్షిణ ధ్రువంపైకి ఇస్రో ల్యాండర్, రోవర్లను పంపనుంది. ‘ఇప్పటి వరకు ఎవరూ కూడా చీకటిగా ఉండే ఈ ప్రాంతంలోకి రోవర్‌ను దించలేదు. చంద్రుని ఈక్వేటర్‌కు సమీపంలోకి ఇది వెళ్తుంది’ అని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా ప్రయోగించే ఉపగ్రహంలో ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ ఉంటాయి. ఇవి సెప్టెంబర్ నాటికి అక్కడికి చేరుకుంటాయని ఆయన వివరించారు. వీటి ద్వారా తాము సేకరించే సమాచారంపై ప్రపంచ నలుమూలలా ఉన్న శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రయోగాలన్నిటినీ పూర్తి చేసి 2022లోగా చంద్రునిపైకి మానవుడిని పంపుతామని ఇస్రో చైర్మన్ తెలిపారు. దీంతోపాటు వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య–ఎల్1 సూర్యుని కక్ష్యలోకి ప్రయోగిస్తామని తెలిపారు. ఈ ప్రయోగం వల్ల సూర్యుని గురించి ఇంతవరకు తెలియని అనేక విషయాలను తెలుసుకుంటామని చెప్పారు. ఇతర గ్రహాలపైనా పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో సమాయత్తం అవుతోందని తెలిపారు. -
గగన్‌యాన్ @ 10వేల కోట్లు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష రంగంలో మరో చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారతీయులను అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించిన ‘గగన్‌యాన్ ప్రాజెక్టు’కు ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ శుక్రవారం ఆమోదముద్ర వేసింది. రూ.10,000 కోట్ల బడ్జెట్‌తో చేపట్టనున్న ఈ ప్రయోగంలో భాగంగా ముగ్గురు వ్యోమగాముల బృందం అంతరిక్షంలో కనీసం వారంరోజుల పాటు గడపనుంది. ప్రాజెక్టులో భాగంగా తొలుత పూర్తి సన్నద్ధతతో ఉన్న రెండు మానవరహిత వాహకనౌకలను ప్రయోగిస్తారు. చివరగా ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతారు. అన్నిరంగాల భాగస్వామ్యం ‘శక్తిమంతమైన జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా వ్యోమగాముల మాడ్యూల్‌ను అంతరిక్షంలోని భూదిగువ కక్ష్యలోకి ప్రయోగిస్తాం. ఈ మిషన్ సందర్భంగా ముగ్గురు వ్యోమగాములకు దాదాపు వారం పాటు కావాల్సిన అన్ని వస్తువులు ఈ మాడ్యుల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే సిబ్బంది శిక్షణ, ఫ్లైట్ సిస్టమ్‌తో పాటు మౌలిక వసతుల అభివృద్ధిని గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా చేపడతాం. ఇందుకోసం పలు జాతీయ సంస్థలతో పాటు ల్యాబొరేటరీలు, విద్యావేత్తలు, పారిశ్రామికవర్గాలతో కలిసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) పనిచేస్తుంది. గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం కేటాయించిన రూ.10,000 కోట్లతో ఫ్లైట్ హార్డ్‌వేర్, అవసరమైన టెక్నాలజీ అభివృద్ధితో పాటు ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రయోగం వల్ల అత్యాధునిక టెక్నాలజీ విభాగంలో ఉద్యోగ కల్పనతో పాటు సుశిక్షితులైన మానవవనరులను తయారుచేయడం వీలవుతుంది. గగన్‌యాన్ ద్వారా విద్యార్థులు స్ఫూర్తి పొంది సైన్స్, టెక్నాలజీ రంగాన్ని తమ వృత్తిగా ఎంపికచేసుకుంటే దేశ నిర్మాణంలో వాళ్లంతా భాగస్వాములు అవుతారు’ అని కేంద్రం తెలిపింది. ముచ్చటగా 3 ప్రయోగాలు ‘ఆమోదం పొందిన నాటి నుంచి 40 నెలల్లోగా మానవసహిత అంతరిక్ష యాత్రను చేపట్టాల్సి ఉంటుంది. అంతకంటే ముందు పూర్తిస్థాయిలో సిద్ధమైన రెండు మానవరహిత అంతరిక్ష వాహకనౌకలను ప్రయోగించి మిషన్ సన్నద్ధతను శాస్త్రవేత్తలు పరీక్షిస్తారు. తద్వారా మిషన్ ఏర్పాట్లు, సన్నద్ధత, టెక్నాలజీ పనితీరును అర్థం చేసుకుంటారు. చివరగా ముగ్గురు వ్యోమగాములను జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపుతారు. ఈ ప్రయోగం వల్ల భారత్‌లో వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక భద్రత, కాలుష్యం, వ్యర్థాల నియంత్రణ, నీరు–ఆహారభద్రత రంగాలకు ఊపు లభిస్తుంది’ అని కేంద్రం వెల్లడించింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ.. గగన్‌యాన్ ప్రయోగం వల్ల భారత్‌లో 15,000 ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రయోగంలో వినియోగించే శక్తిమంతమైన జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌకను ఇస్రో ఇప్పటికే అభివృద్ధి చేసింది. అలాగే వ్యోమగాములు అంతరిక్షంలో విహరించేం దుకు అవసరమైన మాడ్యూల్‌ను, ప్రయోగం సందర్భంగా ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునే ‘క్రూ ఎగ్జిట్ సిస్టమ్’ను శాస్త్రవేత్తలు ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. అంతేకాకుండా వ్యోమగాములు ధరించే స్పేస్ సూట్‌ను, మాడ్యుల్లోని లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ను కూడా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసి పరీక్షించారు. 2022 లేదా అంతకంటే ముందే ఓ భారతీయుడిని సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపుతామని 2018, ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే 2022 నాటికి లేదా అంతకంటే ముందే ఈ దేశపు యువతి లేదా యువకుడు అంతరిక్షంలోకి త్రివర్ణ పతాకంతో వెళతారని మోదీ వ్యాఖ్యానించారు. చంద్రయాన్–1(2008), మంగళ్యాన్(2014) వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల తర్వాత ఇస్రో చేపడుతున్న కీలకమైన ప్రయోగం ఇదే కావడం గమనార్హం. శ్రీహరికోట నుంచి ప్రయోగం భారత్ రూ.10,000 కోట్ల వ్యయంతో 2022 నాటికల్లా మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’ను చేపట్టనుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అమెరికా, రష్యా, చైనాల తర్వాత సొంత పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి మానవుడిని విజయవంతంగా పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ► నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ► ప్రయోగంలో సాంకేతిక సాయం కోసం రష్యా, ఫ్రాన్స్‌లతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ► సంస్కృత పదం వ్యోమ్(అంటే అంతరిక్షం అని అర్థం) ఆధారంగా అంతరిక్షంలోకి వెళ్లే భారతీయులను ‘వ్యోమ్‌నాట్స్’ అని వ్యవహరిస్తారు. ► గగన్‌యాన్ కోసం అవసరమైన కీలక సాంకేతికతల అభివృద్ధికి ఇస్రో ఇప్పటివరకూ రూ.173 కోట్లు ఖర్చుపెట్టింది. అంతరిక్ష యాత్రను చేపట్టాలని 2008లో ఆలోచన చేసినప్పటికీ ఆర్థిక కారణాలు, రాకెట్ ప్రయోగాల వైఫల్యంతో ఇస్రో వెనక్కితగ్గాల్సి వచ్చింది. ► 2007లో ఇస్రో ‘రీ ఎంట్రీ టెక్నాలజీ’ని పరీక్షించింది. ఇందులో భాగంగా అంతరిక్షంలో 550 కేజీల బరువున్న ఉపగ్రహాన్ని పంపి సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చింది. ఇందుకోసం భారీ ఉష్ణోగ్రతను సైతం తట్టుకునే తేలికపాటి, దృఢమైన సిలికాన్ పొరలను వాడారు. ► వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే మాడ్యుల్‌ను జీఎస్ఎల్వీ మార్క్–3 ద్వారా ఇస్రో 2014లో ప్రయోగించింది. దాదాపు 3,745 కేజీల బరువున్న ఈ మాడ్యూల్ అంతరిక్షంలోకి వెళ్లి బంగాళాఖాతంలో విజయవంతంగా దిగింది. -
‘గగన్‌యాన్’ సాధ్యమే!
చెన్నై: 2022 నాటికి అంతరిక్షంలోకి భారత వ్యోమగామిని పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) చైర్మన్ కె. శివన్ వెల్లడించారు. జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా చేపట్టబోయే ఈ ప్రయోగం ద్వారా వారం రోజుల పాటు మానవుడిని అంతరిక్షంలో ఉంచుతామని చెప్పారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టుకు రూ.10వేల కోట్లకంటే తక్కువ వ్యయమే అవుతుందని తెలిపారు. ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ మానవ సహిత యాత్ర ‘గగన్‌యాన్’ గురించి ప్రకటన చేసిన నేపథ్యంలో శివన్ మీడియాతో మాట్లాడారు. ‘‘జీఎస్ఎల్వి మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. భూమి నుంచి 300– 400 కిలోమీటర్ల ఎత్తు వరకు రాకెట్ ప్రయాణిస్తుంది. ఈ ప్రయోగానికి ముందు రెండు మానవ రహిత స్పేస్ క్రాప్ట్‌లను పంపుతాం. రూ.10వేల కోట్ల కన్నా తక్కువ వ్యయంతోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ప్రమాద సమయంలో వ్యోమగాములను సురక్షితంగా నేలకు దించే క్రూ మోడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌లను ఇది వరకే పరీక్షించాం. వ్యోమగామికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్, స్పేస్ సూట్ లాంటి వాటిని తయారుచేసే దశలో ఉన్నాం. అంతరిక్షంలోకి పంపే వ్యోమగామిని వాయుసేన ఎంపిక చేస్తుంది’ అని అన్నారు. -
మార్క్-3 ప్రయోగంలో ‘కృష్ణా’ ఇంజనీర్లు
విజయవాడ: కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు యువ ఇంజనీర్లు అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో సత్తా చాటారు. ఇటీవల గగనతలంలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ మార్క్-3 తయారీలో ప్రత్యక్షంగా భాగస్వాములయ్యారు. దాదాపు ఐదేళ్ల క్రితం మార్క్-3 తయారీలో భాగస్వాములైన ఆ ఇద్దరు ఇంజనీర్లలో ఒకరు ప్రస్తుతం దేశంలోనే స్థిరపడగా మరొకరు విదేశాల్లో ఉన్నారు. మార్క్-3 నింగిలోకి దూసుకెళ్లిన క్రమంలో ఆ ఇద్దరూ ఆనందం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన లోహిత్ నాగవెంకట భానుతీర్థ్ శర్మ, విజయవాడకు చెందిన చామర్తి దీపక్ స్నేహితులు. వారు 2005 నుంచి 2009 వరకు బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ కోర్సును సన్‌ఫ్లవర్ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్తిచేశారు. రోబోటిక్స్‌లో ఏదైనా చేయాలని భావించిన వీరికి ఈ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అనుమతితో నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో మూడు నెలల ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం దక్కింది. ఇస్రో శాస్త్రవేత్త ఒకరు వారికి మార్గదర్శకం చేసి.. రాకెట్ తయారీలో భాగస్వాముల్ని చేశారు. నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో 2009 జనవరి నుంచి ఏప్రిల్ వరకు పనిచేశారు. -
చరిత్ర సృష్టించాం..
* ఇస్రో ‘మార్కు’ గ ‘ఘన’ విజయం * జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం సూపర్ సక్సెస్ * విజయవంతంగా దూసుకెళ్లిన భారీ రాకెట్ * నింగికి చేరి, వాతావరణంలోకి పునఃప్రవేశించిన ‘కేర్’ మాడ్యూల్ * అండమాన్ వద్ద సముద్రంలో సురక్షితంగా ల్యాండింగ్ * మానవ సహిత అంతరిక్ష యాత్రకు ముందడుగు సాక్షి, శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో భారీ విజయం సొంతం చేసుకుంది. తొలిసారిగా అతిభారీ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి గురువారం ఉదయం జియో సింక్రోనస్ లాంచ్ వెహికిల్ మార్క్-3 (జీఎస్ఎల్వీ మార్క్-3/ఎల్వీఎం 3-ఎక్స్)ని విజయవంతంగా ప్రయోగించింది. సమయం సరిగ్గా ఉదయం 9.30 గంటలు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక పై రాకెట్ సిద్ధంగా ఉంది. 24.30 గంటల కౌంట్‌డౌన్ పూర్తి కావస్తోంది. అంతా నిశ్శబ్దం. 10, 9,8.. మైక్‌లో అంకెలు వినిపిస్తున్నాయి. 3, 2, 1, 0.. అందరి చూపూ తూర్పువైపు మళ్లింది. మరుక్షణమే.. పెద్ద శబ్దంతో జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరింది. శాస్త్రవేత్తలు ఉత్కంఠగా రాకెట్ గమనాన్ని పరిశీలిస్తున్నారు. రాకెట్ మొదటి దశలోని రెండు ఎస్-200 రాకెట్ బూస్టర్లు అనుకున్న విధంగానే సమర్థంగా పనిచేశాయి. తర్వాత ఎల్-110 రెండో దశ కూడా సత్తా చాటింది. దీంతో 325.52 సెకన్లకు రాకెట్ శిఖర భాగంలోని కేర్ మాడ్యూల్(వ్యోమగాముల గది) విడివడింది. తర్వాత వేగంగా కిందికి ప్రయాణిస్తూ వాతావరణంలోకి పునఃప్రవేశించిన మాడ్యూల్ పారాచూట్ల సాయంతో అండమాన్ వద్ద సముద్రంలో సురక్షితంగా దిగిపోయింది. దీంతో మిషన్ కంట్రోల్‌రూంలోని ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రయోగం పూర్తిగా విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు కరచాలనం, ఆలింగనాలు చేసుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. క్రయోజనిక్ దశ పూర్తయితే విజయాలే! ఇప్పటివరకూ ఇస్రో పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 2 టన్నుల లోపు బరువున్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగలిగింది. 2 నుంచి 4 టన్నుల బరువైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఫ్రాన్స్ సహకారంతో ఫ్రెంచి గయానా నుంచి వారి రాకెట్ల ద్వారా ప్రయోగిస్తోంది. మార్క్-3తో 4 టన్నుల బరువైన ఉపగ్రహాలను కూడా సొంతంగా ప్రయోగించొచ్చు. విదేశాలకు చెందిన ఉపగ్రహాలను పంపి వాణిజ్య ప్రయోజనాలు పొందొచ్చు. చంద్రుడు, అంగారకుడి పైకి భారీ ఉపగ్రహాలను పంపడమే కాదు.. మన వ్యోమగాములను కూడా అంతరిక్షానికి పంపొచ్చు. అయితే, ఈ ప్రయోగంలో మూడోదైన క్రయోజనిక్(సీ 25) దశ డమ్మీది. దీని తయారీకి మరో రెండేళ్లు పట్టనుంది. అది సిద్ధమైతే మరోసారి మార్క్-3ని పూర్తిస్థాయిలో పరీక్షిస్తారు. అది కూడా విజయవంతం అయితే ఇక.. భారత్‌కు అన్నీ గ‘ఘన’ విజయాలే! శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని, చంద్రబాబు, జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో కీలక ముందడుగైన ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా శాస్త్రవేత్తలను అభినందించారు. రెండేళ్లలో పూర్తిస్థాయి ప్రయోగం: రాధాకృష్ణన్ జీఎస్ఎల్వీ మార్క్-3 తొలి ప్రయోగం అన్ని రకాలుగా అనుకున్నట్లుగానే విజయవంతం అయిందని ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ తెలిపారు. మరో రెండేళ్లలో జీఎస్ఎల్వీ మార్క్-3ని పూర్తిస్థాయిలో ప్రయోగిస్తామన్నారు. రాకెట్లో ముఖ్యంగా ఎస్-200, ఎల్-110 దశలు సక్రమంగా పని చేయడంతో ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. మరోవైపు ఈ విజయం స్ఫూర్తితో జీఎస్ఎల్వీ మార్క్-3 పూర్తిస్థాయి ప్రయోగం విజయానికి కృషిచేస్తామని షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, ఇతర శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగం జరిగిందిలా... 148.98 సెకన్లకు మొదటి దశ పూర్తయింది. 114.71 సెకన్లకు మండటం ప్రారంభమైన ఎల్-110 రెండో దశ 320.42 సెకన్లకు పూర్తయి రాకెట్ మరింత ఎత్తుకు దూసుకెళ్లింది. 325.52 సెకన్లకు 126 కి.మీ. ఎత్తుకు చేరుకున్న తర్వాత రాకెట్ శిఖర భాగంలో ఉన్న కేర్ మాడ్యూల్(క్రూ మాడ్యూల్ అట్మాస్పెరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్-కేర్) విడివడింది. అక్కడి నుంచి కేర్ మాడ్యూల్ తిరిగి భూమి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. 129 సెకన్ల వ్యవధిలోనే మాడ్యూల్ వేగంగా కిందకు వస్తూ 80 కి.మీ.కు చేరింది. మరో 122 సెకన్లలో 80 కి.మీ. ఎత్తు నుంచి వేగం తగ్గించుకుంటూ 15.5 కి.మీ.కు, అక్కడి నుంచి సెకనుకు 233 కి.మీ. వేగంతో కిందికి ప్రయాణిస్తున్న మాడ్యూల్లో అమర్చిన పారాచూట్లు విచ్చుకుని వేగాన్ని తగ్గించాయి. 1,280 సెకన్లకు సెకన్‌కు ఏడు కిలోమీటర్లు వేగంతో కేర్ మాడ్యూల్ అండమాన్‌కు 180 కి.మీ. దూరంలో సముద్రంలో సురక్షితంగా దిగి సంకేతాలు పంపింది. బంగాళాఖాతంలో నౌకపై సిద్ధంగా ఉన్న కోస్ట్‌గార్డులు, వాయుసేన సిబ్బంది, ఇస్రో శాస్త్రవేత్తలు కేర్ మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని తమిళనాడులోని మహేంద్రగిరిలో గల ఇస్రో కేంద్రానికి తరలించి వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయోగంలో కృష్ణా విద్యార్థులకూ భాగం ఘంటసాల: ఈ ప్రయోగంలో కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లిలోని శ్రీసన్ ఫ్లవర్ ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ (2005-09 బ్యాచ్, ఈసీఈ) విద్యార్థులు చామర్తి దీపక్ (విజయవాడ), సామా లోహిత్ నాగవెంకట భానుతీర్థ్ (మచిలీపట్నం) పాలుపంచుకున్నారు. ఎక్కువ ఒత్తిడి కలిగిన ట్యాంకులో ఇంధనం నింపడంపై వీరు ఇస్రోలో చేసిన ప్రాజెక్ట్ వర్క్‌లో వాడిన విధానాన్ని శాస్త్రవేత్తలు రాకెట్‌లోని ఎస్-200 మోటార్లో నైట్రోజన్ గ్యాస్ నింపేందుకు ఉపయోగించారు. -
డిసెంబర్లో జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): మానవ సహిత అంతరిక్ష యాత్రలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్లో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. వచ్చే నెల 15-20 తేదీల మధ్య శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. వ్యోమగాములను అంతరిక్షానికి పంపేందుకు ఉపయోగించే ‘క్య్రూ మాడ్యూల్(వ్యోమగాముల గది)’ని జీఎస్ఎల్వీ మార్క్-3 ద్వారా ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నామని శనివారం షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు.