చరిత్ర సృష్టించాం..
* ఇస్రో ‘మార్కు’ గ ‘ఘన’ విజయం
* జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 ప్రయోగం సూపర్ సక్సెస్
* విజయవంతంగా దూసుకెళ్లిన భారీ రాకెట్
* నింగికి చేరి, వాతావరణంలోకి పునఃప్రవేశించిన ‘కేర్’ మాడ్యూల్
* అండమాన్ వద్ద సముద్రంలో సురక్షితంగా ల్యాండింగ్
* మానవ సహిత అంతరిక్ష యాత్రకు ముందడుగు
సాక్షి, శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో భారీ విజయం సొంతం చేసుకుంది. తొలిసారిగా అతిభారీ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించి చరిత్ర సృష్టించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి గురువారం ఉదయం జియో సింక్రోనస్ లాంచ్ వెహికిల్ మార్క్-3 (జీఎస్‌ఎల్‌వీ మార్క్-3/ఎల్‌వీఎం 3-ఎక్స్)ని విజయవంతంగా ప్రయోగించింది. సమయం సరిగ్గా ఉదయం 9.30 గంటలు. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక పై రాకెట్ సిద్ధంగా ఉంది. 24.30 గంటల కౌంట్‌డౌన్ పూర్తి కావస్తోంది. అంతా నిశ్శబ్దం. 10, 9,8.. మైక్‌లో అంకెలు వినిపిస్తున్నాయి. 3, 2, 1, 0.. అందరి చూపూ తూర్పువైపు మళ్లింది.
మరుక్షణమే.. పెద్ద శబ్దంతో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగిరింది. శాస్త్రవేత్తలు ఉత్కంఠగా రాకెట్ గమనాన్ని పరిశీలిస్తున్నారు. రాకెట్ మొదటి దశలోని రెండు ఎస్-200 రాకెట్ బూస్టర్లు అనుకున్న విధంగానే సమర్థంగా పనిచేశాయి. తర్వాత ఎల్-110 రెండో దశ కూడా సత్తా చాటింది. దీంతో 325.52 సెకన్లకు రాకెట్ శిఖర భాగంలోని కేర్ మాడ్యూల్(వ్యోమగాముల గది) విడివడింది. తర్వాత వేగంగా కిందికి ప్రయాణిస్తూ వాతావరణంలోకి పునఃప్రవేశించిన మాడ్యూల్ పారాచూట్ల సాయంతో అండమాన్ వద్ద సముద్రంలో సురక్షితంగా దిగిపోయింది. దీంతో మిషన్ కంట్రోల్‌రూంలోని ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది. ప్రయోగం పూర్తిగా విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు ఒకరితో ఒకరు కరచాలనం, ఆలింగనాలు చేసుకుంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
క్రయోజనిక్ దశ పూర్తయితే విజయాలే!
ఇప్పటివరకూ ఇస్రో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా 2 టన్నుల లోపు బరువున్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించగలిగింది. 2 నుంచి 4 టన్నుల బరువైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ఫ్రాన్స్ సహకారంతో ఫ్రెంచి గయానా నుంచి వారి రాకెట్ల ద్వారా ప్రయోగిస్తోంది. మార్క్-3తో 4 టన్నుల బరువైన ఉపగ్రహాలను కూడా సొంతంగా ప్రయోగించొచ్చు. విదేశాలకు చెందిన ఉపగ్రహాలను పంపి వాణిజ్య ప్రయోజనాలు పొందొచ్చు. చంద్రుడు, అంగారకుడి పైకి భారీ ఉపగ్రహాలను పంపడమే కాదు.. మన వ్యోమగాములను కూడా అంతరిక్షానికి పంపొచ్చు. అయితే, ఈ ప్రయోగంలో మూడోదైన క్రయోజనిక్(సీ 25) దశ డమ్మీది. దీని తయారీకి మరో రెండేళ్లు పట్టనుంది. అది సిద్ధమైతే మరోసారి మార్క్-3ని పూర్తిస్థాయిలో పరీక్షిస్తారు. అది కూడా విజయవంతం అయితే ఇక.. భారత్‌కు అన్నీ గ‘ఘన’ విజయాలే!
శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి, ప్రధాని, చంద్రబాబు, జగన్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో కీలక ముందడుగైన ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా శాస్త్రవేత్తలను అభినందించారు.
రెండేళ్లలో పూర్తిస్థాయి ప్రయోగం: రాధాకృష్ణన్
జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 తొలి ప్రయోగం అన్ని రకాలుగా అనుకున్నట్లుగానే విజయవంతం అయిందని ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ తెలిపారు. మరో రెండేళ్లలో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3ని పూర్తిస్థాయిలో ప్రయోగిస్తామన్నారు. రాకెట్‌లో ముఖ్యంగా ఎస్-200, ఎల్-110 దశలు సక్రమంగా పని చేయడంతో ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. మరోవైపు ఈ విజయం స్ఫూర్తితో జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 పూర్తిస్థాయి ప్రయోగం విజయానికి కృషిచేస్తామని షార్ డెరైక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, ఇతర శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రయోగం జరిగిందిలా...
148.98 సెకన్లకు మొదటి దశ పూర్తయింది. 114.71 సెకన్లకు మండటం ప్రారంభమైన ఎల్-110 రెండో దశ 320.42 సెకన్లకు పూర్తయి రాకెట్ మరింత ఎత్తుకు దూసుకెళ్లింది. 325.52 సెకన్లకు 126 కి.మీ. ఎత్తుకు చేరుకున్న తర్వాత రాకెట్ శిఖర భాగంలో ఉన్న కేర్ మాడ్యూల్(క్రూ మాడ్యూల్ అట్మాస్పెరిక్ రీఎంట్రీ ఎక్స్‌పెరిమెంట్-కేర్) విడివడింది. అక్కడి నుంచి కేర్ మాడ్యూల్ తిరిగి భూమి వైపు ప్రయాణం మొదలుపెట్టింది. 129 సెకన్ల వ్యవధిలోనే మాడ్యూల్ వేగంగా కిందకు వస్తూ 80 కి.మీ.కు చేరింది.
మరో 122 సెకన్లలో 80 కి.మీ. ఎత్తు నుంచి వేగం తగ్గించుకుంటూ 15.5 కి.మీ.కు, అక్కడి నుంచి సెకనుకు 233 కి.మీ. వేగంతో కిందికి ప్రయాణిస్తున్న మాడ్యూల్‌లో అమర్చిన పారాచూట్లు విచ్చుకుని వేగాన్ని తగ్గించాయి. 1,280 సెకన్లకు సెకన్‌కు ఏడు కిలోమీటర్లు వేగంతో కేర్ మాడ్యూల్ అండమాన్‌కు 180 కి.మీ. దూరంలో సముద్రంలో సురక్షితంగా దిగి సంకేతాలు పంపింది. బంగాళాఖాతంలో నౌకపై సిద్ధంగా ఉన్న కోస్ట్‌గార్డులు, వాయుసేన సిబ్బంది, ఇస్రో శాస్త్రవేత్తలు కేర్ మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనిని తమిళనాడులోని మహేంద్రగిరిలో గల ఇస్రో కేంద్రానికి తరలించి వివిధ పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రయోగంలో కృష్ణా విద్యార్థులకూ భాగం
ఘంటసాల: ఈ ప్రయోగంలో కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లిలోని శ్రీసన్ ఫ్లవర్ ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ (2005-09 బ్యాచ్, ఈసీఈ) విద్యార్థులు చామర్తి దీపక్ (విజయవాడ), సామా లోహిత్ నాగవెంకట భానుతీర్థ్ (మచిలీపట్నం) పాలుపంచుకున్నారు. ఎక్కువ ఒత్తిడి కలిగిన ట్యాంకులో ఇంధనం నింపడంపై వీరు ఇస్రోలో చేసిన ప్రాజెక్ట్ వర్క్‌లో వాడిన విధానాన్ని శాస్త్రవేత్తలు రాకెట్‌లోని ఎస్-200 మోటార్‌లో నైట్రోజన్ గ్యాస్ నింపేందుకు ఉపయోగించారు.