భారత సంకల్పానికి నిదర్శనం | PM Modi congratulates ISRO for successful launch of Chandrayaan 2 | Sakshi
Sakshi News home page

భారత సంకల్పానికి నిదర్శనం

Published Tue, Jul 23 2019 5:25 AM | Last Updated on Tue, Jul 23 2019 5:26 AM

PM Modi congratulates ISRO for successful launch of Chandrayaan 2 - Sakshi

ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తున్న మోదీ

న్యూఢిల్లీ: చంద్రయాన్‌–2 ప్రయోగం మన శాస్త్రవేత్తల శక్తిసామర్థ్యాలను, శాస్త్రరంగంలో కొత్త లక్ష్యాలను సాధించాలన్న 130 కోట్ల మంది దేశ ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చంద్రయాన్‌–2 ప్రయోగం విజయవంతంపై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని ట్విట్టర్‌ ద్వారా ఈ ప్రయోగంలో పాలు పంచుకున్నవారందరికీ ఆడియో మెసేజ్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రయాన్‌–1 ప్రయోగంలో ఏర్పడిన అవాంతరాలను శాస్త్రవేత్తలు అధిగమించారు. ఈ ప్రయోగం ద్వారా వారి పట్టుదల, సంకల్పం మరోసారి రుజువయ్యాయి. ప్రతి భారతీయుడు ఎంతో గర్వపడుతున్నాడు’ అని పేర్కొన్నారు. ‘ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు కొత్త ఉత్సాహం వచ్చింది.

చంద్రుని గురించిన మరెన్నో విషయాలు తెలిసే అవకాశాలున్నాయి..ఇప్పటి వరకు ఎవరూ చేపట్టని విధంగా చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంపై అధ్యయనం జరగనుంది. ఘనమైన మన దేశ చరిత్రలో ఇది చాలా ప్రత్యేకమైన సమయం’ అని పేర్కొన్నారు. భారీ టీవీ స్క్రీన్‌పై చంద్రయాన్‌–2 ఉపగ్రహం ప్రయోగాన్ని తిలకిస్తున్నట్లు ఉన్న తన ఫొటోలను కూడా ప్రధాని జత చేశారు. ట్విట్టర్‌ ఆడియో సందేశంలో ప్రధాని.. ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌తోపాటు శాస్త్రవేత్తల బృందానికి ప్రధాని అభినందనలు తెలిపారు. నైపుణ్యం, సామర్థ్యం, ఆత్మవిశ్వాసం కలిగిన మన శాస్త్రవేత్తలు ఎలాంటి సవాల్‌నైనా స్వీకరిస్తారనేందుకు ఇది గొప్ప ఉదాహరణ అని తెలిపారు. ‘సవాల్‌ ఎంత పెద్దదైతే, పట్టుదల కూడా అంతే ఉంటుంది. ప్రయోగం వారం ఆలస్యమైనా సరే, చంద్రయాన్‌–2 చంద్రుని చేరాలనే లక్ష్యం మాత్రం మారలేదు. ఈ ప్రయోగం ద్వారా చంద్రునిపైకి మొట్టమొదటి భారతీయ ఉపగ్రహం చేరనుంది. అలాగే, చంద్రునిపైకి చేరనున్న నాలుగో దేశం భారత్‌ కానుంది’ అని పేర్కొన్నారు.

శాస్త్రవేత్తలకు పార్లమెంట్‌ అభినందనలు
చంద్రయాన్‌–2ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం ప్రారంభించిన ఇస్రో శాస్త్రవేత్తలను పార్లమెంట్‌ అభినందించింది. ఈ ప్రయోగం ద్వారా దేశ అంతరిక్ష ప్రయోగాల్లో భారత దేశం ఆధిక్యత మరోసారి రుజువైందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా పేర్కొన్నారు. ‘మన శాస్త్రవేత్తలు సాధించిన ఘనత దేశానికి గర్వకారణం. భారత శాస్త్రవేత్తలకు, ఇందుకు తోడ్పాటు అందించిన ప్రధాని మోదీకి అభినందనలు’ అని స్పీకర్‌ అన్నారు. దేశీయ పరిజ్ఞానంతో చంద్రయాన్‌–2 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తంచేశారు.

నెహ్రూను గుర్తు చేసుకోవాల్సిన సమయం: కాంగ్రెస్‌
చంద్రయాన్‌–2 ప్రయోగం విజయవంతంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ ఘనత తమ పాలనతోనే సాధ్యమైందని కాంగ్రెస్‌ అంటుండగా, భవిష్యత్తు నాయకత్వం కనిపించనప్పుడు గతాన్ని తవ్వుకోవడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని బీజేపీ తిప్పికొట్టింది. చంద్రయాన్‌–2పై కాంగ్రెస్‌ పార్టీ ..‘ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు. ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను గుర్తు చేసుకోవాల్సిన మంచి సమయమిది. అంతరిక్ష పరిశోధనలకు గాను 1962లో ఆయన ఏర్పాటు చేసిన ఇండియన్‌ నేషనల్‌ కమిటీ ఫర్‌ స్పేస్‌ రీసెర్చ్‌ అనే సంస్థను ఆ తర్వాత ఇస్రోగా పేరు మార్చారు. అలాగే, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ 2008లో చంద్రయాన్‌–2కు ఆమోదం తెలి పారు’ అని తెలిపింది. దీనిపై బీజేపీ ప్రతినిధి సంబిత్‌ పాత్ర మండిపడ్డారు. ‘ఇది నిజంగా దిగజారుడుతనం. ప్రతి ఒక్కరూ గర్వించాల్సిన ఈ క్షణాన్ని రాజకీయం చేయడం తగదు’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement