అందరి చూపూ ఇక సెప్టెంబర్‌ 7 వైపు! | Chandrayaan-2 September 7 moon landing | Sakshi
Sakshi News home page

అందరి చూపూ ఇక సెప్టెంబర్‌ 7 వైపు!

Published Tue, Jul 23 2019 5:04 AM | Last Updated on Tue, Jul 23 2019 5:04 AM

Chandrayaan-2 September 7 moon landing - Sakshi

హమ్మయ్యా...! ఒక ఘట్టం ముగిసింది. చంద్రయాన్‌ –2 ప్రయోగం విజవంతమైంది. ఇంకేముంది.. అంతా హ్యాపీయేనా?. ఊహూ.. అస్సలు కాదు. ఇస్రోకు అసలు పరీక్ష ముందుంది. కచ్చితంగా చెప్పాలంటే సెప్టెంబరు 7వ తేదీన! ఆ రోజు ఏం జరగబోతోంది?

చక్కగా వేసిన రహదారిపై వాహనాన్ని నడపడం చాలా సులువే. రహదారి అస్సలు లేకపోతేనే సమస్య. ఇస్రో పరిస్థితి ఇప్పుడు ఇదే. ఇప్పటివరకూ ఎవ్వరూ చేయని విధంగా జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో చంద్రయాన్‌ –2ను దింపాలన్న ఇస్రో ఆలోచన చాలా సమస్యలతో కూడుకున్నది. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ స్వయంగా అంగీకరించారు కూడా. జూలై 22న నింగికి ఎగసిన చంద్రయాన్‌ –2 ముందుగా భూమి చుట్టూ కొన్ని చక్కర్లు కొట్టి.. ఆ తరువాత జాబిల్లి కక్ష్యలోకి చేరుతుంది. చందమామను కూడా కొన్నిసార్లు చుట్టేసిన తరువాత ఆచితూచి జాబిల్లిపైకి దిగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత సంక్లిష్టమైన, సమస్యా పూర్వక ఘట్టం.. జాబిల్లిపై చంద్రయాన్‌ దిగే చివరి 15 నిమిషాలు మాత్రమే!

భూమి చుట్టూ 23 రోజులు, చంద్రుడి చుట్టూ 12 రోజులు
భూమికి అతిదగ్గరగా 170 కిలోమీటర్లు (అపోజీ) అతి దూరంగా 40,000 కిలోమీటర్లు (పెరిజీ) ఉండేలా దాదాపు 23 రోజుల పాటు చక్కర్లు కొడుతూ ఉంటుంది. పూర్తిస్థాయి వేగం అందుకున్న తరువాత చంద్రయాన్‌ –2ను జాబిల్లి కక్ష్యలోకి పంపుతారు.          ఇందుకు ఐదు రోజుల సమయం అవసరమవుతుంది. ఒక్కసారి జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత లాండర్‌ విక్రమ్, రోవర్‌ ప్రజ్ఞ్యాన్‌లతో కూడిన చంద్రయాన్‌–2 మాడ్యూల్‌ దాదాపు 12 రోజుల పాటు చక్కర్లు కొడుతూ క్రమేపీ తన వేగాన్ని తగ్గించుకుంటూ జాబిల్లికి దగ్గరగా చేరుతుంది. ప్రయోగం జరిగిన 48వ రోజున.. అంటే సెప్టెంబరు ఏడున ఆర్బిటర్‌ (జాబిల్లి చుట్టూ తిరిగి వివరాలు సేకరించే భాగం) నుంచి రోవర్‌తో కూడిన ల్యాండర్‌     వేరుపడుతుంది.

జరిగేది జూలై 15 ప్రణాళిక ప్రకారమే
ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ వేరుపడటంతో మొత్తం ప్రయోగంలో అత్యంత కీలకమైన ఘట్టం మొదలవుతుంది. దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఇప్పటికే గుర్తించిన రెండు భారీ గుంతల మధ్య దిగేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ల్యాండర్‌ తన వేగాన్ని నియంత్రించుకుంటూ.. నిర్దిష్ట ప్రాంతంలో దిగాల్సి ఉండటం ఇందుకు కారణం. ఈ ప్రక్రియ కాస్తా విజయవంతమైతే.. కొంత సమయం తరువాత ల్యాండర్‌ లోపలి నుంచి రోవర్‌ కిందకు దిగుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ముందుగా అనుకున్నట్లు చంద్రయాన్‌ –2 ప్రయోగం జూలై 15న జరిగి ఉంటే.. జాబిల్లిపై ల్యాండింగ్‌ 54వ రోజు జరగాల్సి ఉండింది.

కానీ ప్రయోగం వాయిదా పడింది. అయినాసరే.. సెప్టెంబరు 6–7 మధ్యకాలంలో జాబిల్లిపై ల్యాండ్‌ అయితే వచ్చే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇస్రో కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. భూమి చుట్టూ తిరిగే కాలాన్ని 17 నుంచి 23 రోజులకు పెంచింది. అదేసమయంలో జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించడం, అక్కడ చక్కర్లు కొట్టే కాలాన్ని తగ్గించింది. జాబిల్లిపై రోవర్, ల్యాండర్‌లు చేయాల్సిన ప్రయోగాలకు ఇది కీలకం. ఈ రెండు పరికరాలూ సోలార్‌ ప్యానెల్స్‌తో విద్యుదుత్పత్తి చేసుకుని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. సెప్టెంబరు ఆరవ తేదీ మొదలుకొని కొన్ని రోజుల పాటు ల్యాండర్, రోవర్‌లు దిగే ప్రాంతం భూమికి అభిముఖంగా ఉంటూ సూర్యుడి కిరణాలు ప్రసారమవుతూంటాయి.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement