చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులో చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్
సూళ్లూరుపేట: చందమామ రహస్యాలు, గుట్టుమట్లను విప్పడమే లక్ష్యంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. చంద్రయాన్–2ను ప్రయోగించి రెండేళ్లు పూర్తయ్యాయి. 2019లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి చంద్రయాన్–2ను ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం బెంగళూరులో నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చంద్రయాన్–2లో భాగంగా మొదట ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అక్కడ నుంచి చంద్రుడి వైపు సుమారు కోటి కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఆగస్టు 20న చంద్రుడి కక్ష్య సమీపానికి చేరుకుంది.
సెప్టెంబర్ 6న ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. జాబిల్లి రహస్యాలను తెలుసుకోవడానికి వీలుగా మిషన్‌లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను అమర్చి పంపారు. శాటిలైట్.. ఆర్బిటర్, ల్యాండర్, రోవర్‌లను చంద్రుడిపై సురక్షితంగా జారవిడిచింది. అయితే చివరి రెండు నిమిషాల్లో ఆందోళన నెలకొంది. ల్యాండర్ చంద్రుడిపై దిగే క్రమంలో దాని ఉపరితలాన్ని ఢీకొనడంతో రోవర్ కనిపించకుండా పోయింది. దీంతో ల్యాండర్, రోవర్‌ల నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ఇస్రో శాస్త్రవేత్తలు వివిధ దేశాల సాయం తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఆర్బిటర్ మాత్రం చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తోంది. జాబిల్లిపై పలు పరిశోధనలు చేస్తూ ఛాయాచిత్రాలను అందించడంలో విజయవంతంగా పనిచేస్తోంది. ఇప్పటివరకు ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ 9 వేల సార్లు పరిభ్రమించి అద్భుతమైన సమాచారాన్ని భూమికి చేరవేసింది.
చంద్రుడిపై తేమ ఉనికి..
ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఇస్రో సోమవారం నుంచి రెండు రోజులపాటు బెంగళూరులో లూనార్ సైన్స్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ మంగళవారం మాట్లాడుతూ.. చంద్రయాన్–2లో ఐదు ఉపకరణాలు ఇప్పటికీ విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. ఈ రెండేళ్లలో ఆర్బిటర్ పంపిన సమాచారాన్ని మీడియాకు వివరించారు. కొన్ని రోజుల క్రితం చంద్రుడి ఉపరితలంపై హైడ్రాక్సిల్ నీటి అణువులను ఆర్బిటర్ కనుగొందన్నారు. ఈ సమాచారాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. చంద్రుడిపై తేమ ఉనికి ఉన్నట్టుగా కూడా తెలుస్తోందన్నారు. ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా పరిభ్రమిస్తూ ఎప్పటికప్పుడు డేటాను ఇస్తోందని తెలిపారు.
ఆర్బిటర్‌తోపాటు ఐదు పేలోడ్స్.. వాటి పనులివే..
చంద్రయాన్–2లో ప్రయోగించిన ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. దీన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారుచేసింది. ఆర్బిటర్.. చంద్రుడికి వంద కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ఇందులో అమర్చిన లార్జ్ ఏరియా సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్.. చంద్రుడి ఉపరితలంపై ప్రధాన మూలకాలను మ్యాపింగ్ చేస్తుంది. ఎల్ అండ్ ఎస్ బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్.. చంద్రుడిపై నీరు, మంచు వంటి వాటి ఉనికిని శోధిస్తుంది. ఇమేజింగ్ ఐఆర్ స్పెక్ట్రోమీటర్.. చంద్రుడిపై ఖనిజ, నీటి అణువులను పసిగట్టి సమాచారాన్ని అందజేస్తుంది. టెరియన్ మ్యాపింగ్ కెమెరా.. చంద్రుడిపై ఖనిజాల అధ్యయనానికి అవసరమైన త్రీడీ మ్యాప్‌లను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది.
కొనసాగింపుగా చంద్రయాన్–2
అతి తక్కువ ఖర్చుతో ఇస్రో 2008లో తొలిసారిగా చంద్రయాన్–1 ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి కక్ష్యలో ఉపగ్రహాన్ని తిప్పి పరిశోధనలు చేసింది. చంద్రయాన్–1 ఉపగ్రహాన్ని రెండేళ్లపాటు పనిచేసేలా రూపొందించగా సాంకేతిక లోపంతో పది నెలలు మాత్రమే పనిచేసింది. అప్పటికే చంద్రుడిపై నీటి అణువుల జాడ ఉందని గుర్తించి చరిత్ర సృష్టించింది. దీనికి కొనసాగింపుగా చంద్రయాన్–2ను ప్రయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment