కుటుంబ కలహాలు, చిన్న చిన్న కారణాలతో హత్యలు...పరిచయస్తులే కీచకులుగా మారి అత్యాచారాలు...సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలు...2019లో సిటీనేర చరిత్రను పోలీసులు విడుదల చేయగా..అవాక్కయ్యే నిజాలు వెల్లడయ్యాయి. సిటీలో మొత్తం 76 హత్యలు జరిగాయి. వీటలో కుటుంబ కలహాలతో 19..చిన్న చిన్న కారణాలతో 15 చోటుచేసుకున్నాయి. అత్యాచారాల విషయానికొస్తే మొత్తం 150 కేసులు నమోదవగా...పరిచయస్తులు చేసినవే ఎక్కువగా ఉన్నాయి. పొరుగువారు చేసినవి 33 అత్యాచారాలుండగా...బంధువులు చేసినవి 18 ఉన్నాయి. ప్రేమ,పెళ్లి పేరుతో మోసం చేసిన కేసులు 89 ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే సైబర్‌క్రైమ్‌విపరీతంగా పెరిగింది. ఓటీపీ మోసాలు, ఓఎల్‌ఎక్స్ ఫ్రాడ్స్‌తో జనం కోట్లాదిరూపాయలు నష్టపోయారు. గత ఏడాది మొత్తమ్మీద వీటి సంఖ్య 450 లోపేఉండగా..ఈ ఏడాది శుక్రవారం నాటికే 1358 నమోదయ్యాయి. ఏడాదిపూర్తయ్యే నాటికి ఇది 1500కు చేరుతుందని అధికారుల అంచనా.సైబర్‌క్రైమ్స్‌లో మొత్తం నిందితులు ఇతర రాష్ట్రాలు,దేశాలకు చెందిన వారే ఉన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: ప్రతి నేరానికి ఓ మూలం ఉన్నట్లే.. కారణం కూడా ఉంటుంది. అదే ఆ నేరం వెనుక ఉన్న నిజం అవుతుంది. 2019కు సంబంధించిన పోలీసులు గురువారం విడుదల చేసిన నేర గణాంకాలను పరిశీలిస్తే.. నమోదైన కేసులు, వాటి వెనుక ఉన్న వాస్తవాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. కేవలం మూడు రకాలైన నేరాలను విశ్లేషిస్తేనే అందులో అనేక ఆసక్తికరమైన కోణాలు వెలుగులోకి వచ్చాయి.
పరిచయస్తులే ‘పాపాత్ములు’..
మహిళలపై జరుగుతున్న నేరాల్లో అత్యాచారం తీవ్రమైనదిగా పోలీసులు పరిగణిస్తారు. నగరంలో ఈ ఏడాది నమోదైన అత్యాచారం కేసుల్లో పరిచయస్తులే నిందితులుగా ఉన్న ఉదంతాలే అత్యధికంగా ఉన్నాయి. మొత్తం రేప్ కేసుల్లో 59.33 శాతం పెళ్ళి, ప్రేమ పేరుతో సన్నిహితంగా మెలిగి మోసం చేసినవే ఉన్నాయి. డిసెంబర్ 15 వరకు 150 కేసులు నమోదు కాగా... వీటిలో 38 శాతం పరిచయస్తుల వల్ల జరిగినవే. మొత్తమ్మీద 59.33 శాతం కేసులు ప్రేమ, పెళ్ళి వ్యవహారాలకు సంబంధించినవిగా రికార్డు అయ్యాయి. వీటిలోనూ అత్యధికులు పరిచయస్తులే ఉంటారు. 18 కేసుల్లో బంధువులు, 33 కేసుల్లో పక్కింటి వాళ్ళో, అదే ప్రాంతానికి చెందిన వారో నిందితులుగా ఉన్నారు. అపరిచితులు చేసిన ఉదంతాలకు కేసులు నాలుగు ఉన్నాయి.
‘మామూలుగానే’ మర్డర్స్...
నిత్యం నమోదవుతున్న నేరాల్లో ప్రధానంగా రెండు రకాలైనవి ఉంటాయి. బాడీలీ అఫెన్స్‌గా పిలిచే హత్యలు, హత్యాయత్నాలు, దాడులు వంటివి మొదటిదైతే...
ప్రాపర్టీ అఫెన్సుల కేటగిరీలోకి వచ్చే చోరీ, దోపిడీ తదితరాలు రెండోవి. బాడీలీ అఫెన్సులకు... అందునా హత్య కేసులను పోలీసులు చాలా ప్రాధాన్యం ఇస్తారు. వీటి దర్యాప్తు కోసం అవసరమైతే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతారు. సాధారణంగా ఓ వ్యక్తి/వ్యక్తులు మరొకరిని చంపడానికి బలమైన కారణాలు, ఆర్థిక లావాదేవీలే ఉంటాయని భావిస్తాం. సిటీలో నమోదైన 76 హత్య కేసుల్లో అత్యధికంగా 19 కేసులు కేవలం కుటుంబ కలహాల వల్లే జరిగాయి. 15 కేసులతో చిరు వివాదాలు ఆ తర్వాత స్థానంలో నిలిచాయి. మిగిలినవి ఇతర కారణాల వల్ల జరిగాయి. సిటీలో ఎక్కడా కమ్యూనల్, ఫ్యాక్షన్ , ఎలక్షన్, టెర్రరిజం, మావోయిజం సంబంధిత హత్యలు నమోదు కాలేదు.
సైబర్ క్రైమ్‌లో ‘బయటివారి హవా’...
సిటీలో ఈ ఏడాది సైబర్ నేరాల నమోదు గణనీయంగా పెరిగింది. గత ఏడాది మొత్తమ్మీద వీటి సంఖ్య 450 లోపే ఉండగా..శుక్రవారం నాటికే 1358 నమోదయ్యాయి. ఏడాది పూర్తయ్యే నాటికి ఇది 1500కు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో 70 శాతం పైగా ‘బయటివారి’ కారణంగా జరిగినవే. సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో నిత్యం నమోదవుతున్న కేసుల్లో రెండు కేటగిరీలకు చెందినవి ఎక్కువగా ఉంటున్నాయి. జమ్‌తార కేంద్రంగా జరిగే ఓటీపీ ఫ్రాడ్స్‌తో పాటు భరత్‌పూర్ నుంచి చోటు చేసుకునే ఓఎల్‌ఎక్స్ మోసాలు. ఈ రెండు ప్రాంతాలు ఉత్తరాదిలోనే ఉన్నాయి. మొదటి దాంట్లో బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్లు చేసే నేరగాళ్లు ఓటీపీలు తెలుసుకుని అందినకాడికి స్వాహా చేస్తున్నారు. రెండో తరహా నేరాల్లో ఓఎల్‌ఎక్స్ కేంద్రంగా నకిలీ యాడ్స్ పెడుతున్న నేరగాళ్లు అడ్వాన్స్‌ల పేరుతో కొల్లగొడుతున్నారు. ఈ రెండు తరహాలకు చెందిన కేసులే 600 వరకు రిజిస్టర్ అయ్యాయి. ఉద్యోగాలు, ఇన్సూరెన్స్ పాలసీలపై బోనస్‌లు, వివాహాల పేరుతో జరిగే ఫ్రాడ్స్ మరో 400 వరకు నమోదయ్యాయి. వీటిలోనూ ఉత్తరాదికి చెందిన వాళ్ళే నిందితులుగా ఉంటున్నారు.
23 రాష్ట్రాలకు ప్రత్యేక టీమ్స్
సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో ఇప్పటి వరకు 1358 కేసులు నమోదు కాగా.. 207 కేసులు కొలిక్కి వచ్చాయి. ప్రత్యేక బృందాలు దేశంలోని 23 రాష్ట్రాలకు వెళ్లి 341 మందిని అరెస్టు చేసి తీసుకువచ్చాయి.
– అవినాష్ మహంతి,సంయుక్త కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment