కారు..ఠారు! | Car Accidents in 2019 Special Story | Sakshi
Sakshi News home page

కారు..ఠారు!

Published Sat, Dec 28 2019 8:37 AM | Last Updated on Sat, Dec 28 2019 8:37 AM

Car Accidents in 2019 Special Story - Sakshi

గురువారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ధ్వంసమైన కార్లు (ఫైల్‌)

సాక్షి, సిటీబ్యూరో: మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారు నడుపుకుంటూ వచ్చిన సందీప్‌రెడ్డి మియాపూర్‌లోని కళ్యాణ్‌ గార్డెన్‌ సమీపంలో ప్యాసింజర్ల కోసం వేచి చూస్తున్న ఆటోడ్రైవర్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆటోడ్రైవర్‌ కృష్ణ అక్కడిక్కడే మృతి చెందాడు.
అదుపు చేయలేని వేగంతో కారులో దూసుకువచ్చిన  అబ్దుల్‌ వాహెబ్‌ బంజారాహిల్స్‌ పరిధిలో రోడ్డు పక్కన ఆగిఉన్న క్యాబ్‌ను వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఫలితంగా క్యాబ్‌లో నిద్రిస్తున్న డ్రైవర్‌ వినోద్‌ తీవ్రంగా గాయపడ్డాడు.  
‘దిశ’ కేసులో నాలుగో నిందితుడు చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య బైక్‌పై వెళ్తుండగా జెక్లెర్‌ గ్రామ సమీపంలో ఇన్నోవా కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని పోలీసులు చికిత్స నిమిత్తం నగరంలోని ఆస్పత్రికి తరలించారు.  
గురువారం చోటు చేసుకున్న కారు ప్రమాదాలకు మచ్చుతునకలివీ. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఈ వాహనాలు ఠారెత్తించేస్తున్నాయి. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడం వెనుక అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ఏటా నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో తేలికపాటి వాహనాలుగా పిలిచే కార్ల వాటా పది శాతానికి పైగా ఉంటోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో 33.9 శాతం కార్లు తదితర తేలికపాటి వాహనాల కారణంగా జరిగినవేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

మద్యం నుంచి.. నిర్లక్ష్యం వరకు...
ఈ తరహా వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో అత్యంత సంచలనాత్మక ఘటనలూ ఉన్నాయి. బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలోని పంజగుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన చిన్నారి రమ్య ఉదంతం, నారాయణగూడ ఫ్లైఓవర్‌ పై పట్టపగలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న వైనం ఇందుకు నిదర్శనాలు. ఇలాంటి ప్రమాదాలు జరగడానికి అనేక కారణాలు ఉంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వాహనం నడపడం కూడా ఓ కారణంగా మారుతోందని అధికారులు పేర్కొన్నారు. వీటికితోడు నగర రహదారుల్లోని ఇంజినీరింగ్‌ లోపాలు, డ్రైవర్ల నిద్రమత్తు సైతం ప్రమాద హేతువులుగా మారుతున్నాయి. సిటీలో వంపులు లేకుండా ఉన్న రహదారుల్ని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. అందులోనూ అనేక బాటిల్‌నెక్స్‌ ఉంటాయి. ఇవన్నీ ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. 

డ్రైవింగ్‌ అంటే ‘ఆ మూడే’ అని...
ఇటీవల కాలంలో నగరంలో కార్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజల జీవన ప్రమాణాలతో పాటు సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ పెరగడం, ఫైనాన్సింగ్‌ విధానాలు తదితర కారణాల నేపథ్యంలో కార్లు ఖరీదు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. వీరంతా ప్రాథమికంగా డ్రైవింగ్‌ స్కూళ్లలోనో, పరిచయస్తుల వద్దో డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నారు. ఆ సమయంలో వీరి దృష్టి ప్రధానంగా స్టీరింగ్, క్లచ్, బ్రేక్‌ల పైనే ఉంటోంది. ఈ మూడింటినీ నిర్వహించగలిగితే ఎక్కడైనా వాహనం నడపవచ్చనని భావిస్తుంటారు. అయితే హఠాత్పరిణామాలు, మార్జిన్స్, ఓవర్‌ టేకింగ్‌ తదితర సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీరికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండటం లేదు. దీంతో ‘ఆ మూడు’ నేర్చుకుని రోడ్ల పైకి వస్తున్న వాహనచోదకులు అనేక సందర్భాల్లో ప్రమాదాలకు లోనుకావడంతో పాటు కారకులుగానూ మారుతున్నారు. 

లైసెన్స్‌ జారీ విధానాల్లోనూ లోపాలెన్నో...
 దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ వ్యవహారం లోపభూయిష్టంగా ఉంది. ఎల్‌ఎల్‌ఆర్‌ జారీ చేసేందుకు ముందు నిర్వహించే కంప్యూటర్‌ పరీక్ష తూతూ మంత్రంగా సాగుతోంది. దీని తర్వాత ట్రాక్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. అయితే ఇప్పటికీ ఏ కేంద్రంలోనూ పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో ట్రాక్‌ టెస్ట్‌ చేసే సామర్థ్యం లేదు.  మాన్యువల్‌గా కేవలం కొన్ని అంశాలను మాత్రమే తనిఖీ చేస్తున్నారు. దీంతో డ్రైవింగ్‌పై పూర్తి పట్టులేని వారికీ లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. వీరిలో కొందరు క్యాబ్‌ డ్రైవర్లు కూడా ఉంటున్నారు. ఇలాంటి డ్రైవర్ల కారణంగా తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్ని పూర్తిగా మార్చి, లోపాలను సరి చేయడంతో పాటు నిబంధనలను కఠినతరం చేస్తేనే ప్రమాదాలను నిరోధించే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.  

ఈ ఏడాది గణాంకాలిలా
మొత్తం ప్రమాదాలు:     2377
కార్ల కారణంగా:     806 (33.9 శాతం)
మొత్తం క్షతగాత్రులు:     2526
కారు ప్రమాదాల్లో:     935 (37.01 శాతం)
మొత్తం మృతులు:     261
కారు ప్రమాదాల్లో:     49 (18.77 శాతం) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement