సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతి ఏడాదీ రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో పాదచారులది రెండో స్థానం. గడిచిన నాలుగేళ్ళ గణాంకాలు పరిశీలిస్తే ఏటా వందకు పైగా పెడస్ట్రియన్స్ రోడ్డుకు బలవుతున్నారు. నగర పరిధిలో జరిగిన మొత్తం ప్రమాదాల్లో మృతులుగా మారిన పాదచారులు 38 శాతానికి పైగా ఉన్నారు. ఈ పరిస్థితి తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రాథమిక అంశాలైన ఫుట్‌పాత్‌లు మాయం కావడం, అవసరమైన అన్ని ప్రాంతాల్లోనూ పెలికాన్ సిగ్నల్స్‌తో పాటు జీబ్రా క్రాసింగ్స్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు లేకపోవడం. ఈ సమస్యలు తీర్చడానికి జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేయడంతో వచ్చే ఏడాది పరిస్థితులు మారవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే నగర ట్రాఫిక్ పోలీసుల కృషి ఫలితంగా ఏటా ప్రమాదాలు, మృతులతో పాటు యాక్సిడెంట్స్‌లో అశువులుబాస్తున్న పాదచారుల సంఖ్యా తగ్గుతూ వస్తోంది. కానీ కనిష్టంగా 100 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరంగా మారుతోంది.
రెండో స్థానంలో పాదచారులు...
నగర ట్రాఫిక్ పోలీసులు ఏటా ప్రమాదాలపై విశ్లేషణ నిర్వహిస్తారు. ప్రమాదాలకు కారణమవుతున్న వాహనాలు, బాధితులుగా/మృతులుగా మారుతున్న వారు ఎవరెవరు అనేది గణాంకాల ప్రకారం జాబితాలు రూపొందిస్తుంటారు. 2016–2019 (డిసెంబర్ 16) మధ్య హైదరాబాద్ పోలీసులు రూపొందించిన రికార్డుల ప్రకారం ప్రతి ఏడాది సిటీలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు రెండు వేలకు పైనే ఉంటున్నాయి. వీటిలో వందల మంది మృత్యువాతపడుతున్నారు. ఇలా రోడ్డు ప్రమాదాల్లో బాధితులుగా మారుతున్న వారిలో ద్విచక్ర వాహనచోదకులు తొలిస్థానంలో ఉండగా... రెండో స్థానం పాదచారులదే. ఇప్పుడే కాదు... గత కొన్నేళ్లుగా నమోదైన గణాంకాల ప్రకారం రోడ్డు ప్రమాద బాధితుల్లో పాదచారులే ఎక్కువగా ఉన్నారు. సిటీలో నాలుగేళ్ళల్లో మొత్తం 9435 ప్రమాదాలు చోటు చేసుకోగా... 1232 మంది మరణించారు. వీటిలో మృత్యువాతపడిన పాదచారుల సంఖ్య 519గా ఉంది. మొత్తమ్మీద రోడ్డు ప్రమాద బాధితుల్లో 36.6 శాతం, మృతుల్లో 42.12 శాతం పాదచారులే ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది గణాంకాలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 261 మంది చనిపోగా... వీరిలో పాదచారులు 101 మంది (38.69 శాతం) ఉన్నారు.
ఎఫ్‌ఓబీలు, భూగర్భ మార్గాలు కనుమరుగు...
నగరంలోని రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్న చోట్ల గతంలో భూగర్భ క్రాసింగ్ మార్గాలు (సబ్–వే) నిర్మించారు. ఆపై దిల్‌సుక్‌నగర్, సికింద్రాబాద్, బేగంపేట, మెహదీపట్నం సహా అనేక ప్రాంతాల్లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు అందుబాటులోకి తీసుకువచ్చారు. సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కోఠిల్లో ఏర్పాటు చేసిన భూగర్భ క్రాసింగ్ మార్గాలు ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒకటి పూర్తిగా కనుమరుగు కాగా... మరోటి స్వరూపం మార్చుకుని పాదచారులకు పనికిరాకుండా పోయింది. ఇక ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు కట్టిన జీహెచ్‌ఎంసీ అధికారులు వాటికి ఎలివేటర్ వంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో నగరవాసులకు ఉపయోగపడలేదు. ఇవి పూర్తిగా ఓ స్వరూపాన్ని సంతరించుకోకముందే ‘మెట్రో’ గండం ముంచుకువచ్చింది. మెట్రోరైల్ నిర్మాణాల కోసం సిటీలోని ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌ల్ని తొలగించారు.
ఈ ఏడాది పరిస్థితులు మారేనా?
పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్న నగర ట్రాఫిక్ పోలీసులు పలు ప్రతిపాదనలు రూపొందించి జీహెచ్‌ఎంసీకి పంపారు. వీటికి అనుగుణంగా ఇప్పటికే అనేక చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు (ఎఫ్‌ఓబీ) రూపుదిద్దుకుంటున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేయించిన జీహెచ్‌ఎంసీ సకల సౌకర్యాలతో నిర్మిస్తోంది. మరోపక్క జంక్షన్లు కాని, ఎఫ్‌ఓబీలు లేని చోట్ల పాదచారులు రోడ్డు దాటడానికి అనువుగా మూడు కమిషనరేట్లలో కలిపి 106 పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమై ప్రభుత్వానికి చేరాయి. ఇవి కూడా మంజూరై అందుబాటులోకి వస్తే వచ్చే ఏడాది పాదచారుల ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు చెప్తున్నారు. అయితే పాదచారులు సైతం ఈ మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment