
మార్కెట్‌లో పెట్టుబడి సాధనాలు ఎన్నిఉన్నా దేశీ మగువలు, మదుపుదారుల మనసంతా పసిడివైపే పరుగులు పెడుతుంది. ఆర్థిక మాంద్యాన్ని అధిగమించేందుకు, పెట్టుబడిపై నమ్మకమైన రాబడిని ఆర్జించేది మేలిమి బంగారమేనన్నది అటు ఇంతులు ఇటు ఇన్వెస్టర్ల మాట. స్టాక్ మార్కెట్ల అనిశ్చితి, అంతర్జాతీయ ఆటుపోట్లు, అమెరికా - చైనా ట్రేడ్ వార్ ఇలా సమస్యలు..సంక్షోభాలు 2019లో పసిడిని పరుగులు పెట్టించాయి. భవిష్యత్‌లో పసిడి బాటలు పరుచుకునేందుకు అందరూ బంగారం వెంటపడటంతో యల్లో మెటల్ గడిచిన ఏడాది హాట్ మెటల్‌గా మెరిసిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడంతో కూడా కనకం కాంతులీనింది. 2019లో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులతోనే సాగడం, రియల్ ఎస్టేట్‌లో స్ధబ్ధతతో బంగారం మాత్రం మదుపరుల పసిడి కలలను పండించిందనే చెప్పాలి. ఈ ఏడాది బంగారం ఏకంగా దాదాపు 15 శాతంపైగానే రిటన్స్‌ను అందించి సత్తా చాటింది. అతివలకు అలంకారంగానే కాదు ఆపద సమయంలో ఆసరాగానూ తన మెరుపులకు ఢోకా లేదని స్పష్టం చేసింది. ఏడాది ఆరంభంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గరిష్టంగా పదిగ్రాములకు రూ 33,650 పలుకగా ఏడాది చివరిలో ఏకంగా రూ 38,600కు ఎగబాకింది.
బంగారం మెరిసిందిలా...
గడిచిన ఏడాది ఎదురేలేకుండా పసిడి ప్రస్ధానం తళుకులీనింది. ఏడాది ఆరంభంలో పదిగ్రాములు రూ 33,650 పలికిన మేలిమి బంగారం అటుపై ఫిబ్రవరిలో రూ 34,060కి చేరి తన పరుగు పైపైకేనని చాటింది. మార్చిలో పరిమితంగానే పెరిగిన పసిడి ఏప్రిల్‌లో ఏకంగా రూ 2000 దిగివచ్చి రూ 32,310కి పడిపోయింది. మేలో కొద్దిగా కోలుకున్న బంగారం జూన్‌లో అమాంతం రూ 34,660కి ఎగబాకింది. ఇక అక్కడి నుంచి చుక్కలు చూసిన బంగారం ద్వితీయార్ధంలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ట్రేడ్‌వార్, ఉత్తర కొరియా అణుపరీక్షలు, అంతర్జాతీయ అలజడులతో పసిడి పట్టపగ్గాల్లేకుండా పరుగులు పెట్టింది. జులైలో రూ 35,400కు చేరిన బంగారం ధరలు ఆగస్ట్‌లో ఏకంగా రూ 38,950 పలికాయి.
ఆల్‌టైం హై
బంగారం ధరల పయనంలో సెప్టెంబర్ కీలక మైలురాయిగా మారింది. ఈ నెలలో పదిగ్రాముల పసిడి రూ 40,145 పలికి ఆల్‌టైం హైని తాకింది. అక అక్టోబర్‌లో ధరలు కొద్దిగా తగ్గి రూ. 38,880 పలికాయి. నవంబర్‌లో స్వల్పంగా పెరిగిన పసిడి రూ. 38,990కి చేరువైంది.
రూ 50వేలకు చేరువయ్యే ఛాన్స్
ఇక కొత్త ఏడాదిలోనూ స్వర్ణ సోయగాలు కొనసాగవచ్చని భావిస్తున్నారు. భారత్, చైనాల్లో పసిడి వినియోగం పెరుగుతుండటంతో పాటు రూపాయి బలహీనంగా ఉండటం బంగారం మెరుపులకు కలిసివస్తుందనే అంచనా నెలకొంది. ట్రేడ్‌వార్ ముగిసిన సంకేతాలు వెల్లడవుతున్నా ఒప్పందంలో జాప్యం, అంతర్జాతీయ పరిణామాల్లో అనిశ్చితితో బంగారం సరికొత్త శిఖరాలకు చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు.