మందగమనం.. రికార్డుల మోత | Stockmarkets 2019 year rewind | Sakshi
Sakshi News home page

అటు మందగమనం ఇటు రికార్డుల మోత

Published Thu, Dec 26 2019 3:33 PM | Last Updated on Sat, Dec 28 2019 1:49 PM

Stockmarkets 2019 year rewind - Sakshi

ప్రజల ఆదాయాలు పడిపోయాయి. ఉపాధి అవకాశాలు అందనంత దూరం..ఎగుమతులు పతనం. క్షీణించిన దిగుమతులు, పెట్టుబడులు ఆశించినంత లేవు. పన్ను వసూళ్లు తగ్గిపోయాయి. గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర మందగమనంలో ఆర్థిక వ్యవస్థ. అయినా సరికొత్త తీరాలకు స్టాక్‌మార్కెట్లు. ఆర్థిక శాఖ మాజీ ముఖ్య సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నట్టు అదే 2019 ఏడాదిలో పెద్ద పజిల్‌. 

2019 ఏడాదిలో దలాల్‌ స్ట్రీట్ సరికొత్త మెరుపులతో మురిపించింది. కీలక బీఎస్ఇ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ రెండూ సరికొత్త గరిష్టాలను నమోదు చేశాయి. జాతీయ అంతర్జాతీయ పరిణామాలతో ఏడాది ఆరంభంలో  స్తబ్దుగా ఉన్న సూచీలు మధ్యలో కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, ఆఖరి త్రైమాసికంలో బాగా పుంజుకున్నాయి. చైనా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాల వివాదం ఈ ఏడాది బాగా దెబ్బ కొట్టినప్పటికీ  దేశీయంగా సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ కీలక మద్దతు స్థాయిలను అధిగమించడం విశేషం.  నవంబరులో సెన్సెక్స్‌ 41 వేల వద్ద  సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. డిసెంబరు 20 నాటికి 15 శాతం వృద్ధితో  సెన్సెక్స్‌  ఈ  గరిష్టాన్ని కూడా దాటేసి 41800 ని తాకిగింది. నిఫ్టీ కూడా ఇదే బాటలో ముందు 10 వేలు, 11 వేలు చివరికి 12 వేల స్థాయిని కూడా  సునాయాసంగా అధిగమించింది. డిసెంబరు 20 నాటికి  నిఫ్టీ12300 గరిష్ట స్థాయికి చేరుకోవడం విశేషం.  ఇలా మొత్తంగా  స్టాక్‌మార్కెట్‌ లో కీలక సూచీలు రెండూ సరికొత్త తీరాలకు చేరుకున్నాయి. అయితే  ఆశ్చర్యకరంగా ఆటో, రియల్టీ, బ్యాంకింగ్‌, మెటల్‌, టెలికాం, ఫైనాన్స్  రంగాలు భారీ ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, ఐటీ, రియల్టీ రంగాలు ఏడాది చివరలో పుంజుకున్నా, టెలికాం రంగం మాత్రం భారీ నష్టాలనే మూటగట్టుకుంది. ఈ సంవత్సరంలో సంపదను ఆర్జించిన వారికంటే, సంపదను పోగొట్టుకున్నవారే ఎక్కువగా ఉండడానికి ఇదే ప్రధాన కారణం.

ఆటోరంగం : ఆర్థికరంగంలో కీలకమైన ఆటో పరిశ్రమ ఈ ఏడాది తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. వాహనాల డిమాండ్‌ బాగా క్షీణించడంతో తీవ్ర నష్టాలను చవిచూసింది. వరుసగా తొమ్మిది త్రైమాసికాల్లో వాహనాలు అమ్మకాలు  పడిపోయాయి.  వరుసగా డిస్కౌంట్లు, ఆఫర్లు  ప్రకటించినా పరిస్థితి మెరుగపడలేదు.  దీంతో మారుతి, ఆశోక్‌ లేలాండ్‌  తమ ప్లాంట్లలో  ఉత్పత్తిని నిలిపివేయడం, తాత్కాలిక ఉద్యోగాల  కోత లాంటి పరిణామాలకు దారి తీసింది. దీంతో మారుతి సుజుకి, టాటామోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌ షేర్లలో అమ్మకాలు దాదాపు ఏడాదంతా కొనసాగాయి. మరోవైపు  పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో  కేంద్రం తీసుకొచ్చిన భారత్‌ స్టేజ్‌-6  ఉద్గార నిబంధనలు 2020 ఏప్రిల్‌ నుంచి  అమలు కానున్నాయి. 

రియల్టీ :  రియల్‌ ఎస్టేట్‌ రంగంలో జోష్‌ నింపేందుకు పలు కీలక నిర్ణయాలను  ఈ ఏడాది నవంబరులో మాసంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.  మధ్య, చిన్న ఆదాయ రియల్టీ ప్రాజెక్టులకు, సగంలో నిలిచిపోయి పూర్తి కాని ప్రాజెక్టులకు కేంద్రం నిధులను సమకూరుస్తుంది.  ఇందుకోసం రూ .25 వేల కోట్ల విలువైన ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిని (ఎఐఎఫ్) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించడం ఆయా రంగాలకు సానుకూలంగా మారింది. 

బ్యాంకింగ్‌ : ఇక బ్యాంకింగ్‌ రంగంలో గత ఏడాదిలాగానే 2019లో కూడా కుంభకోణాలు, అక్రమాలు  చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఐసీఐసీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు స్కాంలకు తోడు పీఎంసీ బ్యాంకులో చోటు చేసుకున్న వేలకోట్ల కుంభకోణం మరో అదిపెద్ద స్కాంగా నిలిచింది. ఈ బ్యాంకులో వివిధ అవసరా నిమిత్తం డబ్బును దాచుకున్న మధ్య తరగతి వినియోగదారుల గుండెలు గుభేలుమన్నాయి.  దీనికి తోడు జాతీయ బ్యాంకుల  మెగా బ్యాంకుల విలీనం మరో కీలక పరిణామం. బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుడుతూ మొత్తం 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసి 4 అతిపెద్ద బ్యాంకులు ఏర్పాటుకానున్నాయి. తద్వారా 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా  అడుగులు వేస్తున్నామని  ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆ సందర్భంగా  ప్రకటించారు.

టెలికాం రంగం:  టెలికాం రంగంలో శరవేగంగా దూసుకొచ్చిన రిలయన్స్‌కు చెందిన  జియో ఈ ఏడాది కూడా తన హవాను కొనసాగించింది. అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించిన మెగా మెర్జర్‌ సంస్థ వొడాఫోన్‌​ ఐడియా మాత్రం మరింత కుదేలైంది. మరో ప్రధాన సంస్థ భారతి ఎయిర్టెల్ వృద్ధి కూడా అంతంత మాత్రమే. దీనికి తోడు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) విషయంలో టెలికాం కంపెనీలకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది.  వడ్డీ, జరిమానాతో సహా టెలికాం సంస్థలు ప్రభుత్వానికి దాదాపు 90,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పాయి. ఈ వ్యవహారంలో బాగా ప్రభావితమైన సంస్థ వొడాఫోన్‌ ఐడియా. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎంతో కొంత ఉపశమనం అందించపోతే మూత పడడం ఖాయమన్న ఆందోళన వెలిబుచ్చింది.  ఈ పరిణామాలతో ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా షేర్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి.  

కాఫీడే సిద్ధార్థ ఆత్మహత్య
కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ  ఆత్మహత్య ఇటు మార్కెట్‌ వర్గాలను, అటు కార్పొరేట్‌ శక్తులను విస్మయ పర్చింది. సిద్ధార్థ అనూహ్య మరణంతో కాఫీ డే షర్లు భారీగా పతనమయ్యాయి.  ఎందరి జీవితాల్లోనో కమ్మని కాఫీ కబుర్ల మధుర స్మృతులను మిగిల్చిన ఆయన జీవితం విషాదాంతం కావడం తీరని విషాదం.  మరోవైపు ప్రైవేటు రంగబ్యాంకుగా తనకంటూ ప్రత్యేకస్థానాన్నిసంపాదించుకున్న యస్‌ బ్యాంకునకు ఈ ఏడాదిలో కోలుకోలేని దెబ్బ తగిలింది. యాజమాన్యంలో వచ్చిన విభేదాలతో ఫౌండర్‌ రాణా కపూర్‌ బ్యాంకునుంచి తప్పుకోవడం, ఇతర వివాదాలతో యస్‌ బ్యాంకు షేరు అత్యంత కనిష్టానికి పతనమైంది. 

కాగా దేశ ఆర్థిక వ్యవస్థ మునిగిపోతున్న సమయంలో స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాలతో దూసుకుపోవడం ఒక పజిల్ అనిమాజీ ముఖ్యఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఇటీవల వ్యాఖ్యానించారు. దిగుమతులు క్షీణించాయి. ఎగుమతులు పడిపోయాయి. కన్సూమర్‌ గూడ్స్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ ఇలా అన్నిటి వృద్ది మూలనపడింది. పన్ను ఆదాయాలు తగ్గిపోయాయి.  పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. దీంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ  మూడు దశాబ్దాలు వెనక్కి వెళ్లిపోయిందని  మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆందోళన వ్యక్తం చేశారు.చాలా కంపెనీలు వారి ఆదాయాలకంటే ఎక్కవ వడ్డీని బ్యాంకులకు చెల్లిస్తున్నాయి. భారత ఆర్థికవ్యవస్థ ఐసీయూలో ఉందని  పేర్కొన్నారు. మరోవైపు ఇటీవల ప్రభుత్వం  తీసుకుంటున్న దిద్దుబాటు చర్యల నేపథ్యంలో బడ్జెట్‌లో మరిన్ని  సంస్కరణలను  ప్రకటించే అవకాశం ఉందని,  రాబోయే సంవత్సరంలో  మార్పు వుంటుందని నిపుణులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement