అరుదైన కాంబినేషన్స్‌.. అదుర్స్‌ | Round up 2019: Crazy Combinations in Tollywood | Sakshi
Sakshi News home page

అలరించిన అరుదైన కాంబినేషన్స్‌

Published Thu, Dec 26 2019 6:14 PM | Last Updated on Thu, Dec 26 2019 8:24 PM

Round up 2019: Crazy Combinations in Tollywood - Sakshi

తెలుగు చిత్రసీమలో అరుదైన కాంబినేషన్ల​కు 2019 వేదికగా నిలిచింది. ఆసక్తికర కాంబినేషన్లలో తెరకెక్కిన సినిమాలు చాలా వరకు అభిమానులకు ఆకట్టుకుని నిర్మాతలకు ఆనందం కలిగించాయి. విభిన్న కాంబినేషన్లలో వచ్చిన భారీ చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. అరుదైన కలయికలో 2019లో తెరకెక్కిన సినిమాలేంటో చూద్దాం రండి.


సాహో: పాన్‌ ఇండియా మూవీగా ప్రచారం పొందిన ఈ సినిమాను యువ దర్శకుడు సుజిత్‌ తెరకెక్కించాడు. రెండో సినిమాకే టాప్‌ హీరో ప్రభాస్‌ను డైరెక్ట్‌ చేసి ఔరా అనిపించాడు సుజిత్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌ సినిమా తెరకెక్కడం అత్యంత ఆసక్తి కలిగించింది. ప్రపంచస్థాయి సాంకేతిక  నిపుణులు, జాతీయ స్థాయి నటులతో ఈ సినిమాకు యమ క్రేజ్‌ వచ్చింది.

సైరా: మెగాస్టార్‌ చిరం‍జీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ను దర్శకుడు సురేందర్‌రెడ్డికి అప్పగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకు అప్పటించిన బాధ్యతను సురేందర్‌రెడ్డి చక్కగా నిర్వర్తించి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను అంచనాలకు తగినట్టుగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు చిరంజీవి తనయుడు రాంచరణ్‌ నిర్మాతగా వ్యవహరించడంతో ఈ ముగ్గురి కాంబినేషన్‌ ప్రత్యేకంగా నిలిచింది.


మహర్షి: టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేశ్‌బాబు 25వ సినిమా కావడంతో ‘మహర్షి’ఫై అభిమానులు పెట్టుకున్న అంచనాలను దర్శకుడు వంశీ పైడిపల్లి చేరుకోగలిగాడు. మహేశ్‌కు మొమరబుల్‌ మూవీగా మలిచాడు. తొలిసారిగా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘మహర్షి’ ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది.


వినయ విధేయ రామ: మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అభిమానులతో పాటు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. అంచనాలను అందుకోవడంలో ఈ కాంబినేషన్‌ విఫలమైంది.

ఇస్మార్ట్ శంకర్: వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న దర్శకుడు పూరి జగన్నాథ్‌, తొలిసారిగా రామ్‌తో జతకట్టి ‘ఇస్మార్ట్’ హిట్‌ కొట్టాడు. డైరెక్టర్‌ పూరి తన శైలిలో రామ్‌ను మాస్‌ పాత్రలో చూపించి బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాడు. ఈ విజయంతో పూర్వ వైభవాన్ని దక్కించుకున్నాడు.


ఎఫ్‌2: విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కాంబినేషన్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్‌2’ మూవీ సంక్రాంతి విజేతగా నిలిచింది. వెంకీ, అనిల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకుని విజయం సాధించింది. ఆద్యంతరం ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిన ఈ సినిమా ప్రేక్షకాదరణతో పాటు మంచి వసూళ్లు రాబట్టింది.


గ్యాంగ్‌లీడర్‌: విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు అందరిలోనూ ఆసక్తి రేపింది. హిట్‌ సినిమా టైటిల్‌ పెట్టడం..విలక్షణ దర్శకుడు విక్రం కె కుమార్‌, నాచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌ కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు. అంచనాలకు తగ్గట్టు లేకపోవడంతో యావరేజ్‌ సినిమాగానే మిగిలిపోయింది.

కల్కి: సీనియర్‌ హీరో డాక్టర్‌ రాజశేఖర్‌, యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ కలయికలో వచ్చిన ‘కల్కి’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడింది. రెండో సినిమాకే సీనియర్ హీరోను డైరెక్ట్‌ చేసిన ప్రశాంత్ వర్మ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు.

గద్దల కొండ గణేష్ : వరుణ్‌తేజ్‌ను వైవిధ్యమైన పాత్రలో చూపించిన సినిమా ‘గద్దల కొండ గణేష్’.. దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. పవన్‌ కళ్యాణ్‌కు ‘గబ్బర్‌ సింగ్‌’ లాంటి హిట్‌ ఇచ్చిన హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌ అనగానే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల అంచనాలకు అందుకుని ఈ సినిమా విజయవంతమైంది.

రణరంగం: ట్రెండ్‌తో సంబంధం లేకుండా విలక్షణ పాత్రలతో చేసుకుంటూ వెళుతున్న హీరో శర్వానంద్‌, యువ దర్శకుడు సుధీర్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. పీరియాడిక్ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

మన్మథుడు 2: చి.ల.సౌ. సినిమాతో ఆకట్టుకున్న నటుడు, దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ తన రెండో సినిమాకు లక్కీ ఛాన్స్‌ కొట్టేశాడు. కింగ్‌ నాగార్జునతో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. మొదటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న రాహుల్‌.. ‘మన్మథుడు 2’ తో నిరాశపరిచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement