సాక్షి, అమరావతి : మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలోనే ఉల్లి ధరలు తక్కువగా ఉన్నాయని మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సమస్య నెలకొన్న తరుణంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వమే ప్రశంసించిందని వెల్లడించారు. ఉల్లి, ఇతర నిత్యావసర సరుకుల ధరలపై గురువారం శాసనమండలిలో స్వల్పకాలిక చర్చపై మంత్రి మోపిదేవి సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉల్లి కొరత, పెరిగిన ధరల కారణంగా వినియోగదారులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి మంత్రి సభకు వివరించారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉల్లి సమస్య ఉన్నట్టు విపక్ష టీడీపీ విమర్శలకు దిగటాన్ని తప్పుబట్టారు.
2,100 టన్నులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం...
ఉల్లి సాగు తగ్గడం, అధిక వర్షాల కారణంగా దిగుబడులు పడిపోవడంతో సెప్టెంబరు నుంచే దేశమంతా ధరలు పెరిగాయని మంత్రి మోపిదేవి పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిని ప్రభుత్వం రూ.120 చొప్పున కొనుగోలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా రూ.25కే అందజేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని వివరించారు. ఇప్పటివరకు 35 రోజుల పాటు 42,096 క్వింటాళ్ల ఉల్లిని మార్కెటింగ్ శాఖ రూ.25 చొప్పున పంపిణీ చేసినట్లు చెప్పారు. ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం రెండు లక్షల క్వింటాళ్లను ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంటోందని, ఈనెల 14 లేదా 15వ తేదీల్లో మన దేశానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. తద్వారా కొంత మేర ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుందన్నారు. బయట నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉల్లి కోసం మన రాష్ట్రమే అత్యధికంగా 2,100 మెట్రిక్ టన్నులు కావాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌యార్డులలో శుక్రవారం నుంచి రూ.25కే ఉల్లి విక్రయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఉల్లిపై స్వల్పకాలిక చర్చకు మంత్రి మోపిదేవి జవాబిస్తుండగానే టీడీపీ ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా సభ నుంచి నిష్క్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment