సంక్షేమం, అభివృద్ధి మేళవింపు.. 'ప్రగతికి ప్రణామం' | Governor Justice Abdul Nazir In AP Assembly Budget Session 2024 | Sakshi
Sakshi News home page

సంక్షేమం, అభివృద్ధి మేళవింపు.. 'ప్రగతికి ప్రణామం'

Published Tue, Feb 6 2024 4:24 AM | Last Updated on Tue, Feb 6 2024 8:41 AM

Governor Justice Abdul Nazir In AP Assembly Budget Session 2024 - Sakshi

సంయుక్త సమావేశంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

సాక్షి, అమరావతి: సంక్షేమాన్ని–అభివృద్ధిని మేళ­వించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చిత్త­శుద్ధితో కృషి చేస్తోందని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, రాష్ట్ర ప్రగతికి మానవ వనరులనే చు­క్కానిగా చేసుకుని కార్యాచరణను వేగవంతం చేసిందన్నారు. నవ­రత్నాల పథకాలు సత్ఫలితాలనిస్తు­న్నా­­య­న్నారు. నీతిఆయోగ్‌ తాజా నివేదిక ప్రకారం ఏపీలో పేదరిక గణన నిష్పత్తి 2015–16లో 11.77% ఉండగా 2022–23 నాటికి 4.19 శాతా­నికి తగ్గడమే అందుకు నిదర్శ­నమ­న్నారు. గత నాలుగేళ్లలో డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాల ద్వారా ఇప్పటివరకు రూ.4.23 లక్షల కోట్ల మేర ప్రజలకు లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు.

విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం వినూత్న విధానాలకు అంకురార్పణ చేసిందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేయడంతోపాటు సహజ వనరులను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికాభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ 206 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిబద్ధతను గవర్నర్‌ అభినందించారు. ఇది రాష్ట్ర చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా తొలి రోజు సోమవారం శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్‌ నజీర్‌ ప్రసంగించారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద గవర్నర్‌కు ముఖ్యమంత్రి జగన్‌ సాదర స్వాగతం పలికారు. తన ప్రసంగంలో గవర్నర్‌ ఏమన్నారంటే..

విద్యా సంస్కరణలు..
రాష్ట్ర విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా విద్యా రంగంలో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టింది. విద్యా రంగ సంస్కరణల కోసం ఇప్పటివరకు రూ.73,417 కోట్లు ఖర్చు చేసింది. ‘జగనన్న అమ్మ ఒడి’ ద్వారా రూ.26,067 కోట్లు వెచ్చించింది. ఏటా 43.61 లక్షల మంది తల్లులు, 83 లక్షల మంది పిల్లలు పథకంతో లబ్ధి పొందుతున్నారు. 56,703 ప్రభుత్వ విద్యా సంస్థలను మూడు దశల్లో ఆధునీకరించేంందుకు ‘మన బడి – నాడు నేడు’ చేపట్టింది. ఇప్పటివరకు రూ.7,163 కోట్లు వెచ్చించింది. 44,800 పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో 46,661 మంది ఆయాలను నియమించింది.

విద్యార్థుల్లో పోషకాహార సమస్యను నివారించేందుకు 16 రకాల ఆహార పదార్థాలతో రుచికరంగా ‘జగనన్న గోరుముద్ద’ చేపట్టింది. 43.27 లక్షల మంది విద్యార్థుల కోసం ఏటా రూ.1,910 కోట్లు చొప్పున రూ.4,417 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు అధికం. ‘జగనన్న విద్యా కానుక’ ద్వారా ఏటా 47 లక్షలమంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తోంది. నాలుగేళ్లలో ఈ పథకం కోసం రూ.3,367 కోట్లు ఖర్చు చేసింది. బైజూస్‌ కంటెంట్‌తో 8వ తరగతి విద్యార్థులకు 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది.

ఆరో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు 62 వేల ఇంటరాక్టివ్‌ స్క్రీన్లు, ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్‌ టీవీలను ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో టోఫెల్‌ ప్రవేశపెట్టింది. ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) సిలబస్‌ను 2026 నుంచి ప్రవేశపెడుతోంది. జగనన్న విద్యా దీవెన కింద పూర్తి పీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తూ 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ.11,901 కోట్లను చెల్లించింది. జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఏటా రూ.20 వేలు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తోంది.

ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తూ ప్రభుత్వం రూ.4,276 కోట్లను పంపిణీ చేసింది.పేద విద్యార్థుల కలను నిజం చేస్తూ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తోంది. అత్యున్నత 50 విదేశీ విద్యా సంస్థల్లో 21 ఫ్యాకల్టీలలో విద్య అభ్యసించే అవకాశాన్ని కల్పిస్తూ రూ.1.25 కోట్ల వరకు ఫీజులు చెల్లిస్తోంది. పథకం కింద ఇప్పటివరకు రూ.107.08 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. వర్సిటీల్లో 3,295 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చర్యలతో డ్రాపౌట్లు గణనీయంగా తగ్గిపోయాయి.

వైద్య విప్లవం
వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు, వైద్య విద్య విధానాన్ని ప్రభుత్వం సంస్కరించింది. 11 వైద్య కళాశాలలను బలోపేతం చేయడంతోపాటు 17 కొత్త వైద్య కళాశాలలు, గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని చేపట్టింది. కడపలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, క్యాన్సర్‌ ఆసుపత్రి, మానసిక ఆరోగ్య సంస్థ, పలాసలో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్లను ఇటీవలే ప్రారంభించాం. వైద్య, ఆరోగ్య రంగంలో 53,126 మంది వైద్య సిబ్బందిని నియమించాం. ప్రివెంటివ్‌ కేర్‌లో కొత్త అధ్యాయానికి తెరతీస్తూ ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. 3.03 కోట్ల ఓపీ సేవలను అందించాం.

104, 108 అంబులెన్స్‌ సేవల కోసం రూ.1,208 కోట్లు వెచ్చించి 1,704 వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ఇటీవలే రూ.25 లక్షలకు పెంచాం. 2,315 నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో బైలేటరల్‌ కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్స లాంటి ఖరీదైన ప్రొసీజర్లు, క్యాన్సర్‌ చికిత్సతో సహా 3,257 ప్రొసీజర్లకు ఎలాంటి పరిమితి లేకుండా వైద్య సేవలు అందిస్తున్నాం. 2019 నుంచి ఇప్పటివరకు 36 లక్షల మంది రోగులు లబ్ధి పొందారు. అందుకోసం ప్రభుత్వం రూ.12,150 కోట్లు వెచ్చించింది. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే సమయంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా ద్వారా నెలకు రూ.5 వేలు గరిష్ట పరిమితితో రోజుకు రూ.225 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నాం. 

సాగు.. బాగు 
సొంత భూములు సాగు చేసుకునే రైతులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్, ఎండోన్మెంట్‌ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏడాదికి  రూ.13,500 సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పటివరకు రూ.53.53 లక్షల మంది రైతులకు రూ.33,300 కోట్లు పంపిణీ చేసింది. వన్‌స్టాప్‌ సెంటర్లుగా 10,778 ఆర్బీకేలను నెలకొల్పింది. దేశంలో ఉచిత పంటల బీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. 54.75 లక్షల మంది రైతుల క్లైమ్‌లను పరిష్కరించి రూ.7,802.05 కోట్లను పంపిణీ చేసింది.

వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1,835 కోట్ల వడ్డీ రాయితీని అందించింది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన 22.85 లక్షల మంది వ్యవసాయ, ఉద్యాన రైతలకు రూ.1,977 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని జమ చేసింది. దళారుల ప్రమేయం లేకుండా ఆర్బీకేల వద్దే ధాన్యాన్ని సేకరిస్తూ గోనె సంచుల వినియోగ చార్జీలు, రవాణా ఖర్చులను కూడా రైతులకు చెల్లిస్తోంది. రూ.63,827 కోట్ల విలువైన 3.34 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఎంఎస్‌పీ పరిధిలోకి రాని పంటలకు కూడా గిట్టుబాటు ధర అందించేందుకు ఇప్పటివరకు రూ.7,751 కోట్లు వెచ్చించింది.

మిచాంగ్‌ తుపాను సమయంలో బాధిత రైతులను ఆదుకునేందుకు, మౌలిక సదుపాయాలను పునరుద్ధరించేందుకు రూ.347.55 కోట్లను వెచ్చించింది. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తూ నాలుగేళ్లలో 5,83,240 ఎకరాలను ఉద్యాన పంటల సాగులోకి తెచ్చింది. అరటి, పసుపు, ఉల్లి, మిర్చి లాంటి పంటలకు కేంద్ర ప్రభుత్వం కంటే అధికంగా కనీస మద్దతు ధర అందిస్తోంది. సూక్ష్మ సేద్యం కింద 12.74 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ 35.85 లక్షల ఎకరాల విస్తీర్ణానికి వర్తింపజేసింది. 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోకి ఆక్వా కల్చర్‌ను తెచ్చి ఆంధ్రప్రదేశ్‌ను ఆక్వా హబ్‌గా తీర్చిదిద్దింది.

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద 2,43,394 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుస్తూ రూ.540 కోట్లు పంపిణీ చేసింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. 20,034 ఫిషింగ్‌ బోట్లకు డీజిల్‌ సబ్సిడీ కింద రూ.128.27 కోట్లు ఖర్చు చేసింది. సబ్సిడీని లీటరుకు రూ.6.03 నుంచి రూ.9కి పెంచింది. ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ కింద రూ.3,186.36 కోట్లను వెచ్చించి 61,682 మందికి ప్రయోజనం కలిగించింది. రూ.50.30 కోట్లతో 35 ఆక్వా ల్యాబ్‌లను నెలకొల్పింది.

మహిళా సాధికారికతకు పెద్దపీట 
రాష్ట్రంలోని 55,607 అంగన్‌వాడీల ద్వారా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ కార్యక్రమాలను అమలు చేస్తూ 64 లక్షల మంది గర్భిణులు, బాలింతలతోపాటు 28.62 లక్షల మంది పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు రూ.6,688 కోట్లు  వెచ్చించడంతో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పౌష్టికాహార లోపాన్ని ముందుగానే గుర్తించి నివారించేందుకు రూ.21.82 కోట్లు వెచ్చించి గ్రోత్‌ మానిటరింగ్‌ పరికరాలను కొనుగోలు చేసింది. రూ.71 కోట్లు వెచ్చించి 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలను సమకూర్చడంతో 3,27,289 మంది ప్రయోజనం పొందారు.

మహిళల ఆర్థిక స్వయం సమృద్ధి కోసం వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. 2019 ఏప్రిల్‌ 11 నాటికి స్వయం సహాయక సంఘాలు బకాయి పడిన రూ.25,571 కోట్లను నాలుగు వాయిదాల్లో తిరిగి చెల్లించింది. దాంతో 7,98,395 స్వయం సహాయక సంఘాల్లోని 78.84 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద ఇప్పటివరకు 9,76,119 స్వయం సహాయక సంఘాలకు నాలుగు విడతల్లో రూ.4,969.05 పంపిణీ చేసింది. వైఎస్సార్‌ చేయూత ద్వారా ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందచేస్తోంది.

పథకం ద్వారా 26.39 లక్షల మంది మహిళలకు రూ.14,129 కోట్లు పంపిణీ చేసింది. నాలుగో విడత ఈ నెలలోనే పంపిణీ చేయనున్నారు. వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 3,57,844 మంది మహిళలకు రూ.2,029 కోట్లు నేరుగా ఖాతాల్లో జమ చేసింది. వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద 4,39,068 మంది మహిళలకు రూ.1,257.04 కోట్లు అందించింది. మహిళల భద్రతకు భరోసా కల్పిస్తూ దిశ యాప్‌ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు 1.46 కోట్ల మంది యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోగా 3,040 కేసులను నమోదు చేశారు. 

‘సామాజిక’ నవశకం
పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రంలో 17,005 లే అవుట్లలో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను మహిళలకు పంపిణీ చేశారు. 22 లక్షల గృహ నిర్మాణాలను చేపట్టగా ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కింద 66.34 లక్షల మందికి ప్రతి నెలా టంచన్‌గా పింఛన్లు అందిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి పింఛన్‌ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచడంతో నెలవారీ పింఛన్‌ బడ్జెట్‌ రూ.1,961 కోట్లకు పెరిగింది. వార్షిక బడ్జెట్‌ దాదాపు రూ.23,476 కోట్లకు చేరుకుంది. ఇప్పటివరకు రూ.86,692 కోట్లను పంపిణీ చేసింది.

వైఎస్సార్‌ వాహనమిత్ర కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున 2,78,961 మందికి రూ.1,305 కోట్లను పంపిణీ చేసింది. వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా చేనేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు చొప్పున 81,783 మంది లబ్ధిదారులకు రూ.983 కోట్లు అందచేసింది. వైఎస్సార్‌ లా నేస్తం కింద కింద జూనియర్‌ న్యాయవాదులకు ఆర్నెళ్లకు రూ.30 వేలు చొప్పున మూడేళ్ల కాలానికి స్టైఫండ్‌ అందిస్తోంది. ఇప్పటివరకు 2,564 మందికి రూ.11.83 కోట్లు అందించింది. జగనన్న చేదోడు ద్వారా రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు ఏడాదికి రూ.10 వేలు చొప్పున 3.40 లక్షల మందికి రూ.1,268 కోట్లు పంపిణీ చేసింది.

19.52 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు రూ.521.73 కోట్లు వెచ్చించింది. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు ఏడాదికి రూ.10వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తోంది.  ఇప్పటివరకు 15.87 లక్షల మందికి రూ.88.33 కోట్ల వడ్డీ మొత్తాన్ని రీయింబర్స్‌ చేసింది. వైఎస్సార్‌ బీమా పథకం కింద రూ.1,582 కోట్లు అందచేసింది.

వైఎస్సార్‌ కల్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద ఇప్పటివరకు 46,329మందికి రూ.350.89 కోట్లు అందించింది. ఉపాథి హామీ అమలులో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలోఉంది. సగటున 25 కోట్ల పనిదినాలు సృష్టించడంలో దేశంలో టాప్‌ 3 స్థానాల్లో నిలిచింది. 123 పట్టణ స్థానిక సంస్థల్లో 2 వేల ఎంఎల్‌డీ తాగునీటిని సరఫరా చేస్తోంది. మచిలీపట్నం, మార్కాపురం, ప్రొద్దుటూరు, కమలాపురం, నరసాపురం, అమలాపురంలో ఈ ఏడాది రూ.327.38 కోట్లతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది.  జగనన్న టౌన్‌ షిప్‌ల కింద 12,042 ప్లాట్లతో 30 ప్రాజెక్టులను చేపట్టింది.

రహదారులు.. కొత్త బస్సులు
రాష్ట్రంలో ఇప్పటివరకు 53,481 కి.మీ. మేర రహదారుల పనులను చేపట్టింది. 2023–24లో 268 కి.మీ. మేర 58 బీటీ రోడ్లు వేసింది. ప్రధానమంత్రి గ్రామ్‌సడక్‌ యోజన కింద రూ.261 కోట్లు ఖర్చు చేసింది. గుంతలులేని రహదారులే లక్ష్యంగా రూ.490.80 కోట్లతో 1,221 కి.మీ. మేర పనులు మంజూరు చేసింది. రూ.1,121.85 కోట్ల తో 4,635 కి.మీ. మేర 1,877 బీటీ రోడ్లను పునరుద్ధరించే చర్యలు చేపట్టింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత పాత బస్సుల స్థానంలో 880 కొత్త బస్సులను ప్రవేశపెట్టింది. 

సాగునీటికి ప్రాధాన్యం
జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులకు వేగవంతం చేసింది. సంగం ప్రాజెక్ట్, బ్యారేజీలను పూర్తి చేసి పెన్నార్‌ డెల్టా వ్యవస్థ, కావలి కాలువ, కనుపూరు కాలువ ఆయకట్టును స్థిరీకరిస్తున్నారు. బ్రహ్మం సాగర్‌ లీకేజీ సమస్యను ప్లాస్టిక్‌ డయాఫ్రమ్‌ వాల్‌ టెక్నాలజీ ద్వారా ప్రభుత్వం పరిష్కరించింది. చిత్రావతి భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులను రూ.280 కోట్లతో పూర్తి చేసి 10 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నింపింది. గండికోట నిర్వాసితుల పునరావాసం కోసం రూ.925 కోట్లు ఖర్చు చేసి 27 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో నింపింది.

అవుకు రెండో టన్నెల్‌ పూర్తి చేయడం ద్వారా ఎస్‌ఆర్‌బీసీ సామర్థ్యాన్ని 20 వేల క్యూసెక్కులకు పెంచింది. 3వ టన్నెల్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.253 కోట్లతో పనులను పూర్తి చేయడం ద్వారా హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ పంప్‌ ప్రాజెక్ట్‌ నుంచి 10వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చిన్నతరహా సాగునీటి చెరువులను నీటితో నింపింది. వెలిగొండ మొదటి టన్నెల్‌ పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. రెండో టన్నెల్‌ కూడా కొద్ది రోజుల క్రితమే పూర్తయ్యిందని త్వరలోనే ప్రజలకు అంకితం చేస్తామని చెప్పేందుకు సంతోషిస్తున్నా. 2024 సెప్టెంబర్‌ నాటికి ఖరీఫ్‌ వర్షాలతో నల్లమల సాగర్‌ నీటిని నిల్వ చేసేందుకు వీలవుతుంది.

కుప్పం నియోజకవర్గానికి నీటిని అందించేందుకు కుప్పం బ్రాంచి కెనాల్‌ను ప్రభుత్వం పూర్తి చేసింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ సమస్యను పరిష్కరించడం ద్వారా పులిచింతలలో పూర్తి సామర్థ్యం మేరకు 45 టీఎంసీల నీటి నిల్వ చేసింది. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద రూ.15,61.30 కోట్లతో 60.55 లక్షల కుటుంబాలకు ఎఫ్‌టీసీలతో తాగునీటిని అందించింది. శ్రీకాకుళం, వైఎస్సార్, కర్నూలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో రూ.10, 137 కోట్లతో 9 తాగునీటి ప్రాజెక్ట్‌లను మంజూరు చేసింది. దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో 800 మెగావాట్లు, నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించడంతో విద్యుదుత్పత్తి గణనీయంగా పెరిగింది. 

పారిశ్రామిక పురోభివృద్ధి
విశాఖ జీఐఎస్‌ సదస్సులో కుదుర్చుకున్న 386 ఒప్పందాల ద్వారా 6,07,388 మందికి ఉపాధి కల్పించే రూ.13.11 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను రాష్ట్రం సాధించింది. గత 56 నెలల్లో 1.30 లక్షలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ 311కుపైగా భారీ, మెగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. సులభతర వాణిజ్యంలో వరుసగా మూడేళ్లుగా రాష్ట్రం అగ్రస్థానంలో కొనసాగుతోంది. కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌ను అభివృద్ధి చేసింది. హబ్‌ ద్వారా 75 వేల మందికి ఉపాధి కల్పించేలా రూ.25 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలున్నాయి.

విశాఖపట్నం– చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో మౌలిక వసతులను పెంపొందిస్తోంది. వీసీఐసీ కారిడార్‌లో రూ.లక్ష కోట్లు అదనపు పెట్టుబడులను ఆకర్షిస్తోంది. రూ.3,800 కోట్లతో 10 ఫిషింగ్‌ హార్బర్ల అభివృద్ధి ద్వారా లక్ష మందికిపైగా మత్స్యకారులకు జీవనోపాధి కల్పించనుంది. రూ.16 వేల కోట్లతో రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కార్గో హ్యాండ్లింగ్‌ సామర్థ్యాన్ని 110 మిలియన్‌ టన్నులకు పెంచి 75 వేలమందికి ఉపాధి కల్పించేలా చర్యలు చేపట్టింది. వరల్డ్‌ లాజిస్టిక్స్‌ – సప్లయ్‌ చైన్‌ కాంగ్రెస్‌.. ఏపీ మారిటైమ్‌ బోర్డ్‌ను ‘మారిటైమ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ద ఇయర్‌’గా గుర్తించింది.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరో 30 నెలల్లో అందుబాటులోకి రానుంది. గన్నవరం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, కడపలో విమానాశ్రయాలను విస్తరిస్తోంది. విశాఖప మధురవాడలో రూ.14,634 కోట్లతో 200 ఎండబ్లూ డేటా సెంటర్, కాపులుప్పాడలో రూ.7,210 కోట్లతో 100 ఎండబ్లూ డేటా సెంటర్ల ఏర్పాటు పనులు మొదలయ్యాయి.

7,290 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో రూ.3,685 కోట్ల పెట్టుబడితో 17 పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. కోవిడ్‌ ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోంది. 2023–24లో ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్ర వృద్ధి రేటు 10.2 శాతంగా ఉండవచ్చని నివేదికలు సూచించాయి. రాష్ట్ర తలసరి ఆదాయం 2022–23లో రూ.2,19,518 ఉండగా 2023–24లో రూ.2,42,479కు పెరిగి 1043 శాతం వృద్ధి రేటు సాధించింది. 

గడప వద్దకే సుపరిపాలన
పరిపాలన వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తూ 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పి 1.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. 2.6 లక్షల మంది వలంటీర్ల నియామకం ద్వారా గడప వద్దకే పరిపాలను తెచ్చాం. 540 రకాల సేవలకు సంబంధించి 9.84 కోట్ల అర్జీలను సకాలంలో పరిష్కరించాం. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలకు తగ్గకుండా పనులు మంజూరు చేశాం. 

భూవివాదాల పరిష్కారం
భూవివాదాల పరిష్కారానికి వందేళ్ల తరువాత వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమం ద్వారా రెండు దశల్లో 4 వేల గ్రామాల్లో 42.6 లక్షల ఎకరాల రీసర్వేను పూర్తి చేశాం. 17.53 లక్షల మంది రైతులకు శాశ్వత పట్టాలు, 4.8 లక్షల మార్పిడి సమస్యలకు పరిష్కారం, 10.21 లక్షల కొత్త సబ్‌ డివిజన్లకు అవకాశం కల్పించాం. 20,24,709 మంది భూమిలేని పేదలకు 35,44,866 ఎకరాలను పంపిణీ చేశాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement