ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికిప్పుడు అమలు చేయలేం
ఉభయసభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం
వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది.. నిధుల లేమితో సంక్లిష్టంగా అభివృద్ధి ప్రణాళిక
రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది
ఉదారంగా సాయం అందించాలని కేంద్రాన్ని కోరాం
రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలు సహకరించాలి
అర్థవంతమైన చర్చల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆకాంక్షలతో ఎన్డీఏ కూటమికి బలమైన తీర్పునిచ్చారు. కానీ ఇప్పటికిప్పుడు వారి ఆకాంక్షలు (హామీలు) నెరవేర్చే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. ఉద్యోగులు, పింఛన్‌దారులకు బకాయిల చెల్లింపులతో పాటు రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం అందించాలి. లేకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వనరుల సమీకరణ, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం చాలా కష్టం, సంక్లిష్టం. సంక్షోభాన్ని అధిగమించే మార్గాలను అన్వేషించాల్సి ఉంది.
మేధావులు, విద్యావేత్తలతో విస్తృతమైన చర్చలు జరపాలి. అందుకే అర్ధవంతమైన చర్చల తర్వాతే పూర్తి స్థాయి బడ్జెట్‌కు వెళ్లాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకొని రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలి’’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఓటాన్ అక్కౌంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం అసెంబ్లీ హాలులో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.
నాడు 13.5 శాతం సమ్మిళిత వృద్ధి సాధించాం
సవాళ్లను అధిగమించి సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ దిశగా 2014–19లో గట్టి పునాది వేశాం. పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో రాష్ట్రం నెం.1గా అవతరించింది. కాకినాడ సెజ్ పోర్ట్, భావనపాడు, రామాయపట్నం ఓడరేవుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. వృద్ధాప్య పింఛన్ల పెంపుదల, రైతు రుణమాఫీ లాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుతో 2014–19 మధ్య 13.5 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు సాధించాం. 2019 జూన్‌లో బాధ్యతలు స్వీకరించిన ప్రభుత్వం ప్రజావేదికను కూల్చడంతో బ్రాండ్ ఏపీకి భారీ నష్టం జరిగింది. 2014–19తో పోలిస్తే 2019–24 మధ్య మూలధన వ్యయం 60 శాతం తగ్గిపోయింది.
మూడు రాజధానుల ఆలోచనతో ప్రజలను గందరగోళానికి గురిచేసింది. అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా నాశనమైంది. రూ.2 లక్షల కోట్ల సంపద నష్టానికి దారి తీసింది. ఇంధన రంగం రూ.1,29,503 కోట్ల భారీ నష్టానికి గురైంది. సహజ వనరులు దురి్వనియోగమయ్యాయి. రీ–సర్వే, ఏపీ భూ హక్కు చట్టం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఇసుకను కొల్లగొట్టడంతో రూ.19,000 కోట్ల నష్టం వాటిల్లింది. ఖనిజ రాబడిలో రూ.9,750 కోట్ల నష్టం వాటిల్లింది. ఎర్రచందనం విక్రయాల వల్ల 2014–2019 మధ్య రూ.1,623 కోట్ల ఆదాయం వస్తే 2019–2024 మ«ద్య కేవలం రూ.441 కోట్లకు ఆదాయం పడిపోయింది.
చిన్నారులపై నేరాలు, అత్యాచారాలు పెరిగాయి
గత ఐదేళ్లలో మహిళలు, చిన్నారులపై నేరాలు.. ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాలపై అఘాయిత్యాలు పెరిగాయి. ఎక్సైజ్ ఆదాయ మార్గాలను గత ప్రభుత్వం అపహాస్యం పాలు చేసింది. ఎక్సైజ్‌పై వ్యాట్‌ను తగ్గించి ప్రత్యేక మార్జిన్‌గా రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్‌కు మళ్లించారు. జీతాలు, పింఛన్ల భారీ బకాయిలతో పాటు సుమారు రూ.10 లక్షల కోట్ల రుణ భారం తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై పడింది.
ఇప్పటికిప్పుడు హామీలన్నీ అమలు చేయలేం
ప్రజలు ప్రభుత్వ మార్పును బలంగా కోరుకోవడం వల్లే 93 శాతం స్ట్రయిక్ రేట్‌తో ఎన్డీఏకు చారిత్రక తీర్పునిచ్చారు. గాడి తప్పిన పాలనను తిరిగి గాడిలో పెట్టడం సవాలుతో కూడుకున్న పని. ఎన్నికల హామీలను నెరవేర్చడం ప్రారంభించాం. “సూపర్ సిక్స్ఙ్ వాగ్దానాల అమలుకు కట్టుబడి ఉన్నాం. ఇప్పటికే 16,347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించడం, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం, సామాజిక భద్రత పింఛన్లను రూ.4 వేలకు పెంచడం, నైపుణ్య గణన, ఉచితంగా ఇసుక సరఫరా లాంటివి చేపట్టాం. అన్న క్యాంటీన్లను కూడా ప్రారంభిస్తున్నాం.
మిగిలిన హామీల అమలుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికిప్పుడు వారి ఆకాంక్షలను నెరవేర్చడం సాధ్యం కాదని తెలియజేస్తున్నా. వనరుల సమీకరణ చాలా కష్టంగా ఉంది. నిధుల లేమి కారణంగా అభివృద్ధి ప్రణాళిక చాలా సంక్లిష్టంగా ఉంది. ఇప్పటికే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆరి్ధక పరిస్థితిని వివరించాం. రాష్ట్రానికి ఉదారంగా సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశాం. ప్రస్తుతమున్న ఆందోళనకరమైన ఆరి్ధక పరిస్థితిని అర్ధం చేసుకుని రాష్ట్ర పునరి్నర్మాణంలో ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.
Comments
Please login to add a commentAdd a comment