దొంగ హామీలతో, వక్రమార్గంలో అయిదు నెలలక్రితం అధికారాన్ని చేజిక్కించుకున్న నాటినుంచీ అనామతు పద్దులతో తప్పించుకు తిరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్డీయే కూటమి సర్కారు ‘తప్పనిసరి తద్దినం’లా సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఘనమైన అంకెలు చూసి జనం నవ్విపోరా అన్న వెరపు లేకుండా రూ. 2,94,427 కోట్లతో ఈ బడ్జెట్ తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2.35 లక్షల కోట్లు, మూలధన వ్యయం రూ. 32,712 కోట్లు, ద్రవ్యలోటు రూ. 68,742 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 34,743 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
మొన్నటి ఎన్నికల్లో భూమ్యా కాశాలను ఏకం చేస్తూ మోత మోగించిన సూపర్ సిక్స్ హామీల జాడ లేకుండా... అంచనా వేస్తున్న పన్ను రాబడి రూ. 24,000 కోట్లూ వచ్చే మార్గమేమిటో చెప్పకుండా ఆద్యంతం లొసుగులు, లోపాలతో బడ్జెట్ తీసుకురావడం బాబు సర్కారుకే చెల్లింది. ఈమాత్రం బడ్జెట్ కోసం అయిదు నెలలు ఎందుకు ఆగాల్సివచ్చిందో కూటమి నేతలే చెప్పాలి.
53.58 లక్షలమంది రైతులకు రూ. 20,000 చొప్పున రూ. 10,716.74 కోట్లు కేటాయించాల్సిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి కేవలం వెయ్యి కోట్లు మాత్రమే విదిల్చి రైతు సంక్షేమమే లక్ష్యమంటూ బీరాలు పోవటం... 84 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ. 12,600 కోట్లు కావాల్సి వుండగా కేవలం రూ. 5,387.03 కోట్లు కేటాయించి ఊరుకోవటం దుస్సాహసానికి పరాకాష్ఠ.
రైతులకు జగన్‌మోహన్ రెడ్డి హయాంలో విజయవంతంగా అమలైన ఉచిత పంటల బీమా పథకానికి ఈ ఖరీఫ్ సీజన్ తర్వాత మంగళం పాడుతున్నట్టు ప్రభుత్వమే చెప్పింది. ఇక రూ. 3 లక్షల వరకూ సున్నావడ్డీ రాయితీ, డ్రిప్ పరికరాలపై 90 శాతం సబ్సిడీ వగైరాల గురించి ప్రస్తావన లేదు. అలాగే ధరల స్థిరీకరణ నిధికీ, ప్రకృతి వైపరీత్యాల నిధికీ ఇచ్చిందేమీ లేదు! అయినా రైతు సంక్షే మానికి కట్టుబడివున్నారట!
పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ. 1,500 చొప్పున ఏడాదికి రూ. 18,000 ఇస్తామని చెప్పిన ‘ఆడబిడ్డ’ నిధికి రూ. 32,400 కోట్లు కేటాయించాల్సి వుండగా ఇచ్చింది సున్నా. ఏడాదిలో ఇంటింటికీ మూడు సిలెండర్లు ఉచితమని ఊదరగొట్టిన పథకం కింద కోటీ 54 లక్షల కుటుంబాల కోసం రూ. 4,000 కోట్లు అవసరం కాగా దానికోసం కేటా యించింది కేవలం రూ. 895 కోట్లు! ఈ అరకొర మొత్తంతో ఇంటికో సిలెండరైనా ఇవ్వగలుగు తారా? లబ్ధిదారుల జాబితాకు అడ్డగోలుగా కోత పెడితే తప్ప ఇది అసాధ్యం.
నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 చొప్పున ఏడాదిలో కోటిమందికి మొత్తం రూ. 36,000 కోట్లు కావాల్సి వుండగా దాని ఊసే లేదు! జాబ్ క్యాలెండర్, డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు వగైరాల గురించిన ప్రస్తావన లేదు. అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో రూ. 10 లక్షల వరకూ సబ్సిడీ ఇస్తామని చెప్పిన వాగ్దానానికి సైతం చోటులేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగానికి తగినన్ని నిధులు కేటాయిస్తే, చెప్పిన రీతిలో సబ్సిడీ సొమ్ము అందిస్తే ఉద్యోగ కల్పన సాధ్యమవుతుంది. కానీ వీటి గురించి మాట్లాడింది లేదు.
ఆ రంగానికి బాబు హయాంలో పెట్టిపోయిన బకాయిలు కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో సైతం చెల్లించి ఆ పరిశ్రమలకు ఊపిరులూదిన జగన్ సర్కారుకూ, ఈ మాయదారి కూటమి ప్రభుత్వానికీ పోలికెక్కడ! యువతకు ఏటా లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మాట దేవుడెరుగు – మూడు లక్షలమంది వలంటీర్లకు మంగళం పాడినట్టు బడ్జెట్ అధికారికంగా తేల్చి చెప్పింది. కాపు వర్గానికి సైతం మొండిచెయ్యి చూపారు.
‘బడ్జెట్ అంటే అంకెల సముదాయం మాత్రమే కాదు... అది మనం పాటిస్తున్న విలువలు, ఆకాంక్షల వ్యక్తీకరణ’ అని ఒకనాటి అమెరికా ఆర్థిక మంత్రి జాకబ్ ల్యూ ఉవాచ. పీఠంపై పేరాశతో మొన్నటి ఎన్నికల్లో ఎడాపెడా వాగ్దానాలిచ్చినవారి నుంచి విలువలేమి ఆశించగలం? వారికి జనం ఆకాంక్షలెలా అర్థమవుతాయి? అందుకే– వంచనాత్మక విన్యాసాలు ఆగలేదు. బడ్జెట్‌లో అంకెల గారడీ సరే, బయట పారిశ్రామికవేత్తలతో సైతం బాబు అదే మాదిరి స్వోత్కర్షలకు పోయారు.
రానున్న రోజుల్లో ఏకంగా 15 శాతం వృద్ధి రేటు సాధిస్తారట! అవకాశాల కల్పనతో సంపద సృష్టించి, పేదల జీవన ప్రమాణాలు పెంచుతారట!! కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచీ పన్ను రాబడి మైనస్‌లోకి పోయిందని సాక్షాత్తూ కాగ్ చెప్పింది. జగన్ సర్కారు హయాంలో మొన్న ఏప్రిల్‌లో పన్ను రాబడిలో దాదాపు 11 శాతం వృద్ధి నమోదు కాగా, ఆ తర్వాత తగ్గటం సంగతలా వుంచి మైనస్‌లోకి పోయింది.
మే నెలలో –2.8 శాతం, ఆ తర్వాత వరసగా –8.9, –5.3, –1.9, –4.5 శాతాలకు పడిపోయిందని కాగ్ నివేదిక బయటపెట్టింది. వాస్తవం ఇలావుంటే పన్ను రాబడి కింద అదనంగా రూ. 24,000 కోట్లు వస్తాయని బడ్జెట్ నమ్మబలుకుతోంది. అంటే రానున్న కాలంలో అదనపు పన్నుల మోత మోగుతుందన్నమాట!
జగన్ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి గడచిన అయిదేళ్ళూ సాగించిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. కూటమి నేతలు, వారి వందిమాగధ మీడియా నోటికొచ్చినట్టు రూ. 12 లక్షల కోట్లు, రూ. 14 లక్షల కోట్లు అంటూ తప్పుడు ప్రచారాలు చేశారు. తీరా మొన్న మార్చి 31 నాటికి ఆ అప్పు రూ. 6.46 లక్షల కోట్లని తాజా బడ్జెట్ వెల్లడించింది.
ఇందులో గ్యారెంటీల కింద తెచ్చిన అప్పు రూ. 1,54,797 కోట్లనూ తీసేస్తే నికరంగా ఉన్నది రూ. 4.91 లక్షల కోట్లు మాత్రమే! నిజానికి ఈ బడ్జెట్ చదివిన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఈ విషయంలో గతంలో తప్పుడు ప్రచారం చేశామని క్షమాపణలు చెప్పాలి. కానీ ఆపాటి నిజాయితీ ఆశించటం అత్యాశే. మొత్తానికి నయవంచనకూ, నేల విడిచిన సాముకూ ఈ బడ్జెట్ అసలు సిసలు ఉదాహరణ.
నయవంచనకు నకలు పత్రం!
Published Wed, Nov 13 2024 12:27 AM | Last Updated on Wed, Nov 13 2024 12:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment