జవాబుదారీ తప్పనిసరి | Accountability is necessary | Sakshi
Sakshi News home page

జవాబుదారీ తప్పనిసరి

Published Tue, Jul 1 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM

జవాబుదారీ తప్పనిసరి

జవాబుదారీ తప్పనిసరి

  • డెల్టా ఆధునికీకరణ వేగవంతం చేయాలి
  •  ఖరీఫ్‌లో సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలి
  •  ఉల్లి ధరలు తగ్గించటానికి చర్యలు తీసుకోండి
  •  రెండో వారంలో జిల్లాలో సీఎం పర్యటన, సమీక్ష
  •  జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి దేవినేని
  •  హాజరైన రాష్ట్ర మంత్రులు కామినేని, కొల్లు
  • జిల్లా మంత్రులు ముగ్గురూ అధికారులతో సోమవారం సమీక్షించారు. అన్ని శాఖలఅధికారులతో వివిధ అంశాలపై చర్చించారు. రానున్న రోజుల్లో జిల్లా అంతటా తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పాలనా పరమైన అంశాల్లో పలు ఆదేశాలు, సూచనలు చేశారు.
     
    సాక్షి, విజయవాడ :  జిల్లాలో 46 లక్షల మంది ప్రజల బాధ్యత మాదే.. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా అధికారులు పనిచేయాలి.. ఎక్కడ సమస్యలు ఉత్పన్నం కాకుండా వ్యవస్థను గాడిలో పెట్టి సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. తమది రైతు ప్రభుత్వమని, అధికారులందరూ రైతుల వైపు ఉండి వారివైపు ఆలోచించి సమస్యలను తమదృష్టికి తీసుకురావాలని వాటిని సంబంధిత మంత్రులు, ఆయా శాఖల కమిషనర్లతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. సోమవారం విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
     
    సమస్యల పరిష్కారమే ఎజెండా...
     
    మంత్రి దేవినేని మాట్లాడుతూ జిల్లాలో సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముగ్గురు మంత్రులం కలసి పనిచేస్తామని చెప్పారు. జూలై రెండో వారంలో ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు పర్యటన జిల్లాలో ఉందని అధికారులతో జిల్లా సమస్యలపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. ప్రధానంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సకాలంలో నీరు, విత్తనాలు, ఎరువులు అందేలా వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.

    జిల్లాలోని అన్ని ప్రధాన శాఖల్లో తాము తనిఖీలు చేస్తామన్నారు. ఆగస్టు కల్లా సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పూర్తి కావాలని, ముఖ్యమంత్రి దానిని ప్రారంభిస్తారని చెప్పారు. జిల్లాలో అనధికారికంగా ఉన్న చేపల చెరువుల విషయంలో అధికారులు సీరియస్‌గా స్పందించాలన్నారు. డెల్టా ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. బుడమేరు ముంపు కారణంగా నగరంలోని 10 డివిజన్లు ముంపునకు గురికాకుండా ఉండేందుకు నీటిపారుదల శాఖ, ఉడా, నగరపాలకసంస్థ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.

    ఏలూరు, బందరు రైవస్ కాలువల్లో కలిసే మురుగునీటి కాల్వలను తక్షణమే  మూసివేయాలని అధికారులను ఆదేశించారు. గూడూరులోని అగ్ని ప్రమాద బాధితులకు వెంటనే న్యాయం జరగాలని, ఇళ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు కిలో రూ.30కి చేరాయని, పౌరసరఫరాల శాఖ అధికారులు స్థానికంగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు.
     
    సబ్‌స్టేషన్లకు స్థలాలు మంజూరు చేయాలి...
     
    మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న ఆరునెలల్లో కృష్ణపట్నం పవర్‌ప్లాంటు నుంచి అదనపు విద్యుత్ పొందటానికి చర్యలు తీసుకోవాలని, కొత్తగా ప్రతిపాదించిన విద్యుత్ సబ్‌స్టేషన్లకు స్థలాలు మంజూరు చేయాలని కలెక్టర్‌కు ఆదేశించారు. పాత చెరువుల మరమ్మతులకు ఉన్న నిబంధనలను కొంత సడలించాలని సూచించారు. చెరువుల్లో  పూడిక మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలించటానికి ఉన్న అభ్యంతరాలను సడలించాలని కలెక్టర్‌ను కోరారు.

    విద్యుత్ బకాయిలు ఉన్నాయనే కారణంతో ఎత్తిపోతల పథకాలకు, గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయటం సరికాదన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ  సుపరిపాలన అందిచటమే తమ ప్రభుత్వ ధ్యేయం అని, ఆ దిశగా అధికారులు కూడా పనిచేయాలని సూచించారు. సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, జేసీ మురళీ, ఉడా వీసీ ఉషాకుమారి, సబ్ కలెక్టర్లు  పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement