నేతలకు కన్నీళ్లు తప్పవా?
Published Sat, Oct 26 2013 11:05 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి, న్యూఢిల్లీ:రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న ఉల్లిధరలు అధికార కాంగ్రెస్‌కి చుక్కలు చూపుతున్నాయి. పదిహేనేళ్ల క్రితం కాంగ్రెస్‌ను అధికారపీఠంపై కూర్చోబెట్టిన ఉల్లి ధరలే మరలా చరిత్ర తిరగరాయనున్నాయి. వీటితోపాటు ఎన్నికల్లో ప్రధాన అంశాల్లో మంచినీటి సమస్య రెండో స్థానంలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న విధానసభ ఎన్నికల్లో ఉల్లి ధరలు, విద్యుత్ చార్జీలతోపాటు మంచినీటి అంశాన్నే ప్రతిపక్షాలు ప్రధానాస్త్రంగా మార్చుకుంటున్నాయి. అడ్డగోలు నీటి, విద్యుత్ బిల్లులపై ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే నిరాహార దీక్ష చేశారు. బీజేపీ వరుస ఆందోళనలు చేసింది. ఎన్నికల గడువు సమీపించిన నేపథ్యంలో ఇతర పార్టీలకు నీటి అంశం ఇబ్బందులు కలిగించనుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తాగునీటికి కటకట:
చాలా ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఉంటోంది. వేసవిలో కొన్ని ప్రాంతాలు పూర్తిగా ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి. పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనలో ఢిల్లీవాసుల్లో 40 శాతం మందికి జల్‌బోర్డు నీరు అందడమే లేదు. పశ్చిమ ఢిల్లీలోని 14 నియోజకవర్గాల్లో నీటి సమస్య తీవ్రత చాలా ఎక్కువ. ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చే నాయకులు నీటి సమస్యను పరిష్కరిస్తామంటూ హామీలు గుప్పించడం, గెలిచాక మొహం చాటేయడం పరిపాటిగా మారింది. ఈమారు నాయకులను నిలదీయడంతోపాటు స్పష్టమైన హామీ ఇవ్వలేని పార్టీ నాయకులను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్‌పురి గ్రామస్తులు పేర్కొన్నారు.
పాలం నియోజకవర్గంలో పాలం గ్రామం, మధువిహార్, రాజ్‌పురి, భారత్‌విహార్ ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటి సమస్య ఉంటోంది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యేకానీ, కాంగ్రెస్ ఎంపీకానీ తమ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజ్వాస్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు ఉప్పునీరే గతి. మటియాలా నియోజకవర్గ పరిధిలోని అనధికారిక కాలనీవాసులకు ట్యాంకర్లనీరే ఆధారం. ఢిల్లీలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ పరిస్థితి దయనీయంగా ఉంది. ఎన్నోఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై నిలదీసేందుకు ప్రజలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ప్రచారానికి వెళ్లే నాయకులు నీళ్లు నమలక తప్పని పరిస్థితి.
Advertisement
Advertisement