సాక్షి, అమరావతి: దేశమంతా ఉల్లి అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నా.. మన రాష్ట్రంలో కేజీకి రూ. 25లకే అందిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఆయన సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ప్రజలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. ప్రభుత్వం రూ.150 నుంచి రూ. 200 వరకు ఉల్లిపాయలను కొనుగోలు చేసి ప్రజలకు కేవలం రూ. 25లకు అందిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కార్యాలయం నుంచి ప్రతిరోజు మార్కెటింగ్ శాఖ, ఎస్టేట్ అధికారులతో సమీక్షలు చేస్తున్నారని తెలిపారు. అధిక వర్షాభావం వలన ఉల్లిపాయల ఇబ్బందులు వచ్చాయని ధర్మశ్రీ వ్యాఖ్యానించారు.
ఉల్లిని కావాలని స్టాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారని ఆయన గుర్తుచేశారు. హెరిటేజ్‌లో ఉల్లిపాయల ధర రూ.200 ఉందని.. ప్రజలపై ప్రేమ ఉంటే హెరిటేజ్‌లో తక్కువ ధరకు ఉల్లిపాయలు ఎందుకు విక్రయించట్లేదని ప్రశ్నించారు. హెరిటేజ్‌లో నిత్యావసర వస్తువులు అన్నీ అధిక ధరలే.. మందు రేట్లు పెరిగితే మాత్రం చంద్రబాబు, లోకేష్‌కి భాదేస్తోందని ఎమ్మెల్యే ధర్మశ్రీ మండిపడ్డారు. అదే విధంగా హెరిటేజ్‌లో ఉల్లి అమ్మకాల ధరలకు సంబంధించిన ప్లకార్డులను కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మీడియాకు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. హోదా కన్నా ప్యాకేజీనే ముద్దు అన్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాలుక ఎటుపడితే అటు మళ్లిస్తారని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసుతో భయపడి పారిపోయింది చంద్రబాబు కాదా అని విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం తీరు చట్టవిరుద్ధంగా ఉందని ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment