సాక్షి, విజయవాడ: రైతులు, వ్యవసాయం గురించి మాడ్లాడే నైతికత ప్రతిపక్ష నేత చంద్రబాబుకి లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం పట్ల టీడీపీకి చిత్తశుద్ది ఉంటే 23 సీట్లు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. దివంగత వైఎస్సార్ ఉచిత విద్యుత్ అంటే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని విమర్శించిన బాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని దుయ్యబట్టారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేయడం చంద్రబాబుకి అలవాటన్నారు. తమది రైతుల సంక్షేమ ప్రభుత్వమని, పార్టీ పేరులోనే రైతు ఉందని గుర్తుచేశారు.
‘నివర్’ తుపాన్‌తో నష్టపోయిన రైతాంగాన్ని ప్రతిపక్షనేతగా పరామర్శించని బాబు అసెంబ్లీలో రైతుల గురించి ఏం మాడ్లాడతారని సూటిగా ప్రశ్నించారు. రూ. 86 వేల కోట్లను మాఫీ చేస్తానని గత ఎన్నికలలో హామీ ఇచ్చి ఎంత మాఫీ చేశారో చెప్పగలరా అని నిలదీశారు. రాష్ట్రంలో 50 లక్షలమంది రైతులకి రైతు భరోసా పధకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం తమదని నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులందరినీ అసదుకుంటామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారని తెలిపారు. రైతులకి వేలకోట్ల రూపాయిలని బకాయిలు పెట్టిన చంద్రబాబు రైతుల గురించి ఏముఖం పెట్టుకుని మాడ్లాడతారని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు.
అదే విధంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. రైతు పేరు ఎత్తే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. రైతు ద్రోహి, రైతులను అరెస్ట్ చేయించిన ఘనత చంద్రబాబుదని మండిపడ్డారు. తుఫాన్ వల్ల నష్ట పోయిన రైతులను ఏనాడు చంద్రబాబు ఆదుకోలేదన్నారు. రైతు పక్షపాతి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తుఫాన్ పరిహారం ప్రకటించిన తర్వాత చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ప్రారంభమయ్యాయి. మొదటి అంశంగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment