ఉల్లిపాయల ధరలు క్రమేపీ దిగి వస్తున్నాయి. మహారాష్ట్రలో వరదలు రావడం, అయ్యప్ప మరోవైపు దసరా, దీపావళి పండుగలు... ఇవన్నీ ఉల్లి పాయలకు డిమాండు పెంచేవే! ఈ డిమాండును సొమ్ము చేసుకోవడానికి కొంతమంది వ్యాపారులు సృష్టించిన కృత్రిమ కొరతను రాష్ట్ర ప్రభుత్వం ఛేదించింది. విజిలెన్స్, మార్కెటింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా చేపట్టిన చర్యలు ఫలించాయి. విశాఖ నగరంలోని 13 రైతు బజార్లలో వినియోగదారులకు కావాల్సినన్ని ఉల్లిపాయలు రూ.25కే లభ్యమవుతున్నాయి. ఇలా తక్కువ ధరకే ఉల్లి అందించేందుకు మార్కెట్ జోక్య పథకం కింద కేంద్ర మార్కెట్ ఫండ్ (సీఎంఎఫ్) నుంచి మరో రూ.3 కోట్లను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. ఈ చర్యలతో వినియోగదారులకు ఊరట లభిస్తోంది.
సాక్షి–విశాఖపట్నం : దసరా పండుగకు కొద్ది రోజుల ముందు మహారాష్ట్రలో వరదల కారణంగా రాష్ట్రానికి ఉల్లి సరఫరా తగ్గిపోయింది. ఇదే అదనుగా బ్లాక్ మార్కెట్ వ్యాపారులు ఉల్లిపాయలు అక్రమంగా నిల్వ చేయడంతో ధరలు భారీగా పెరిగాయి. కిలో రూ.50 నుంచి రూ.60 వరకూ చేరడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్రమంగా నిల్వ చేసిన వ్యాపారులపై విశాఖ నగరంలో విజిలెన్స్, మార్కెటింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అక్రమ నిల్వలు సీజ్ చేశారు. దీంతో బ్లాక్ చేసిన సరుకు మార్కెట్‌కు వచ్చింది. మరోవైపు బయట ప్రాంతాల్లో ఉల్లి కొనుగోలు చేసి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. మహారాష్ట్రలోని నాసిక్‌తో పాటు కర్నూలు మార్కెట్ యార్డు నుంచి ఉల్లిపాయలను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు కొనుగోలు చేశారు. ఇలా ఇప్పటివరకూ నగరానికి తీసుకొచ్చిన 111.229 మెట్రిక్ టన్నుల (1,11,229 కిలోలు) ఉల్లిపాయలు 13 రైతుబజార్లలో విక్రయించారు.
దిగుమతిపైనే ఆధారం
జిల్లాలో ఉల్లి సాగు ఏటా తగ్గుతూ వస్తోంది. సాధారణంగా ఖరీఫ్‌లో 53 హెక్టార్లలో సాగు చేస్తే దాదాపు 1,577 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుంది అంచనా. కానీ 2017 సంవత్సరంలో 52 హెక్టార్లు, 2018 సంవత్సరంలో 38 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. ఈ ఖరీఫ్‌లో కేవలం 24 హెక్టార్లలో మాత్రమే ఉల్లి వేశారు. అయితే జిల్లాలో ఉత్పత్తి అయ్యే ఉల్లి మైదాన, నగరవాసుల అవసరాలను అత్యవసర సమయంలోనైనా తీర్చేందుకు సరిపోవాలి. కానీ అన్నిరోజులూ దాదాపు మహారాష్ట్ర, కర్నూలు మార్కెట్ల నుంచి దిగుమతిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకే మహారాష్ట్రలో వరదలు వస్తే ఇక్కడ ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
రూ.25 వద్ద ధర నిలకడ...
విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, గోపాలపట్నం, నరసింహనగర్, పెదవాల్తేరు, పెందుర్తి, మర్రిపాలెం, మధురవాడ, గాజువాక, స్టీల్‌ప్లాంట్, ములగాడ, పెదగంట్యాడ రైతు బజార్లలో కిలో రూ.25 చొప్పున ఉల్లిపాయలు విక్రయిస్తున్నారు. ఇప్పటివరకూ 1,11,229 కిలోలు రాయితీ ధరపై వినియోగదారులకు అందించేలా మార్కెటింగ్ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. రైతుబజార్లలో ఉల్లిపాయలు విక్రయించే డ్వాక్రా సభ్యుల దుకాణాలకు 1,587 బస్తాలు (74,365 కిలోలు), దివ్యాంగుల దుకాణాలకు 783 బస్తాలు (36,864 కిలోలు) అందజేశారు. ఇలా ఉల్లి విక్రయాల ద్వారా డ్వాక్రా సభ్యులకు రూ.1,11,548లు, దివ్యాంగులకు రూ.55,296లు కమిషన్ లభించింది. ఉల్లి ధరలు పూర్తిగా దిగొచ్చేవరకూ కిలో రూ.25 చొప్పున విక్రయించేందుకు వీలుగా ప్రభుత్వం మరోసారి నిధులు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర అవసరాలకు అవసరమైన ఉల్లిపాయలను మార్కెట్ జోక్య పథకం కింద కొనుగోలు చేసేందుకు కేంద్ర మార్కెట్ ఫండ్ (సీఎంఎఫ్) నుంచి రూ.3 కోట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ చర్యలతో ఇక ఉల్లి కోసం వినియోగదారులకు బెంగ అక్కర్లేదని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కె.శ్రీనివాసరావు తెలిపారు. ఉల్లి ధరలు దిగొచ్చేవరకూ రైతుబజార్లలో రాయితీపై విక్రయాలు కొనసాగిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment