దిగొస్తున్న ఉల్లి!!
Published Mon, Dec 2 2013 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM
న్యూఢిల్లీ: తన ఘాటుతోకాకుండా పెరిగిన ధరతో ఇల్లాలిని కంటతడి పెట్టించిన ఉల్లి దిగొస్తోంది. గత పదిహేను రోజుల్లో సగానికిపైగా ధర తగ్గి, ప్రస్తుతం చిల్లర మార్కెట్‌లో కిలో నలబై రూపాయలు పలుకుతోంది. ఇదే ఉల్లి రెండువారాల క్రితం కిలో రూ. 70-80 చొప్పున విక్రయించారు. కొత్త పంట చేతికి రావడంతోనే నగరానికి ఉల్లి సరఫరా పెరిగిందని, దీంతోనే ధరలు తగ్గాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఉల్లి బాటలోనే మిగతా కూరగాయాల ధరలు కూడా తగ్గుతున్నాయి. ఆలుగడ్డలు కూడా సగానికిపైగా ధర తగ్గి, ప్రస్తుతం కిలో రూ. 19-20 చొప్పున విక్రయిస్తున్నారు. పక్షం రోజుల క్రితం కిలో ఆలు రూ. 40-44 చొప్పున విక్రయించారు. అయితే టమాటాలు మాత్రం ఇంకా దిగిరానంటున్నాయి. ఇప్పటికీ కిలో టమాట ధర 58-60 రూపాయలు పలుకుతోంది. రెండువారాల క్రితం కూడా టమాట ధర ఇంతే ఉంది. ఈ విషయమై నేషనల్ హార్టికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్(ఎన్‌హెచ్‌ఆర్‌డీఎఫ్) డెరైక్టర్ ఆర్‌పీ గుప్తా మాట్లాడుతూ... ‘రాజస్థాన్, మహా రాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కొత్త పంట చేతికొచ్చింది. ఆ సరుకంతా నగరానికి చెందిన మార్కెట్‌లకు వస్తుండడంతో ఉల్లి ధరలు సగానికిపైగా తగ్గాయి. సరుకు రావడం ఇప్పుడిప్పుడే మొదలైంది. రానున్న రోజుల్లో సరఫరా మరింతగా పెరిగే అవకాశముండడంతో ధరలు కూడా తగ్గే అవకాశముంద’న్నారు.
Advertisement