తగరపువలస: విశాఖ మహా నగరంతో పోటీపడుతున్న తగరపువలసలో వివిధ అవసరాలకు వినియోగించే తాళ్లు, చేపల వేట, పంటల రక్షణకు వినియోగించే వలలు అందుబాటులో ఉంటున్నాయి. విక్రయాలు ఎక్కువగా ఉండటంతో వీటి సంతకు ప్రత్యేక స్థలం లేకపోయినప్పటికీ ప్రతి ఆదివారం ప్రధానరహదారి, డివైడర్లపై వీటి వ్యాపారం మూడు వలలు.. ఆరు తాళ్లుగా సాగుతోంది. వాస్తవానికి భీమిలిలో వ్యవసాయం తక్కువగా ఉన్నప్పటికీ ఆరు మండలాలకు తగరపువలస కేంద్రీకృతం కావడంతో ఈ వ్యాపారం జోరుగా సాగుతుంది.
గతంలో కేవలం వ్యవసాయదారులను దృష్టిలో పెట్టుకుని కొబ్బరిపీచుతో తయారు చేసే తాళ్లు మాత్రమే ఇక్కడి మార్కెట్‌లో అందుబాటులో ఉండేవి. కొబ్బరిపీచు పరిశ్రమలు మూతపడటం, వాటికి ప్రత్యామ్నాయంగా మన్నికైన ప్లాస్టిక్, ఫైబర్ ప్రవేశంతో అన్నిరకాలైన అవసరాలకు అనుగుణంగా తాళ్లు అందుబాటులోకి వచ్చాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన తాళ్ల వ్యాపారులు ఆదివారం సంతలో వసతులేవీ లేకుండానే కనీసం రూ.లక్ష వ్యాపారం జరుపుతున్నారు.
దిగుమతి చేసుకున్నవే..
విశాఖ, కాకినాడ, తాళ్లరేవు, రాజమండ్రి, కోల్‌కతా, ముంబై ప్రాంతాల నుంచి వ్యాపారులు రూ.లక్షలు పెట్టుబడి పెట్టి తాళ్లను తెచ్చి వారంలో నాలుగు రోజులు ముఖ్యమైన సంతల్లో వీటిని విక్రయిస్తుంటారు. ఎండ, వానలలో విక్రయించుకేనే తమకు అనువైన స్థలం ఉంటే వ్యాపారం మరింత మెరుగ్గా సాగుతుందని అంటున్నారు.
రూ.100 నుంచి మొదలు..
వ్యవసాయంలో నీళ్లు తోడే ఏతం, మోట బావి, చెట్లు కొట్టడంతో ప్రధానపాత్ర వహించే తాళ్లు ఇప్పుడు అనేక విధాలుగా సహాయపడుతున్నాయి. చేపల వేట, పంటల రక్షణకు వినియోగించే వలలు, వ్యవసాయ భూముల్లో మేకలు, గొర్రెల మందలను నిలిపి ఉంచడానికి, పశువులను కట్టివేయడానికి కన్నెలు, పొలాలను పాడుచేయకుండా మూతి బుట్టలు, వాటి అందానికి, దిష్టికి తలవెంట్రుకలతో తయారుచేసిన తాళ్లు, చిన్నారుల నుంచి పెద్దలను ఊపే ఊయలలు, ఇంట్లో వేలాడదీసే ఉట్టెలు ఒకటేమిటి అన్ని అవసరాలకు ఉపయోగపడే తాళ్లు బారల లెక్కన విక్రయిస్తున్నారు. గాలి తగిలేలా కూరగాయలను నిల్వ చేసుకోవడానికి వలలు కూడా అందుబాటులో ఉన్నాయి. రూ.100 మొదలుకుని అవసరం, నాణ్యతను బట్టి తాళ్లు అందుబాటులో ఉన్నాయి.
వినియోగం పెరిగింది
పూర్వం వ్యవసాయరంగంలోనే తాళ్లను ఎక్కువగా వినియోగించేవారు. ఇప్పుడు అన్నిరకాల అవసరాలలో తాళ్ల వినియోగం పెరిగింది. విలాసాలకు అవసరమైన ఊయలలు, పెరట్లో మొక్కల రక్షణకు వలలు కొంటున్నారు. గతంలో సంతకు ఒక్కరు మాత్రమే వ్యాపారులు వచ్చేవారు ఇప్పుడు పదుల సంఖ్యలో వస్తున్నారు. అయినప్పటికీ అందరి వ్యాపారం సాఫీగా సాగుతోంది.
– మైలపల్లి నరసింహులు, వ్యాపారి, రణస్థలం
Comments
Please login to add a commentAdd a comment