ఉల్లి చేసిన మేలు తల్లి చేయదనేది నానుడు. ఉల్లి గొప్పతనాన్ని కవులు ఎంతగానో పొగడారు. దీనివెనుక ఉల్లి ఆవశ్యకత అంత. ఉల్లి లేనిది వంటకాలు రుచి తగలడం కష్టమే. దాదాపు అన్ని రకాల కూరలు, ఇతర వంటల్లో ఉల్లి వినియోగించాల్సిందే. కాబట్టే ఉల్లికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పంట సరిపడినంత ఉన్నంత కాలం ఇబ్బంది ఉండదు. సరుకు దొరకడంతో పాటు ధరలు స్వల్పంగా మాత్రమే పెరుగుదల, తగ్గుదల ఉంటాయి. అయితే సరుకు కొరత ఏమాత్రం తక్కువగా ఉన్న ధరలు అమాంతంగా పెరిగిపోవడం ఖాయం. ప్రస్తుతం అదే జరిగింది. విజయనగరం గంటస్తంభం: ఏటా ఏదో ఒక సమయంలో ఉల్లి ధరలు లొల్లి సృష్టించడం ఆనవాయితీగా మారిపోయింది. ఈ ఏడాది ప్రస్తుత మార్కెట్‌లో ఉల్లి ధరలు మళ్లీ అమాంతం పెరిగి కొనుగోలుదారులను కంటనీరు పెట్టిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో సగానికి పైగా ధర పెరిగింది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు కృత్రిమ డిమాండ్ సృష్టించి మరింత ధర పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా ఉల్లి ధరలు దసరా, అమ్మవారి పండగ నాటికి ఎంతకు చేరుతాయోనని కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు.
పెరిగిన ఉల్లి ధర..
ఉల్లి ధర నెల రోజుల్లో వంతుకు వంతు పెరిగింది. సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి తెలుపు(పెద్ద) ఉల్లి బహిరంగ మార్కెట్‌లో కేజీ రూ.20 ఉండగా ప్రస్తుతం రూ.40కు పెరిగింది. కనీసం నాలుగైదు రూపాయిలు తేడా ఉండే రైతు బజారులో కూడా బుధవారం రూ.35 ఉంది. ఇక జిల్లాలో అంతగా వినియోగించని కర్నూలు ఉల్లి ధర కూడా ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కేజీ రూ.35 ఉంటే రైతుబజారులో రూ.32 ఉంది. దీని ధర కూడా 20రోజుల్లో వంతుకు వంతు పెరగడం విశేషం.
సరుకు కొరత కారణం..
ఉల్లి ధరలు భారీగా పెరగడానికి సరుకు కొరత కారణం. జిల్లాకు మహారాష్ట్ర నుంచి సరుకు వస్తుంది. కర్నూలు నుంచి కొంత సరుకు వస్తుంది. అక్కడ ప్రస్తుతం సరుకు తక్కువగా ఉంది. వర్షాలు పడుతుండడంతో పంట తీసే పరిస్థితి లేక కొరత ఏర్పడింది. ఫలితంగా ఇక్కడ వ్యాపారులు ధరలు పెంచేస్తున్నారు. మళ్లీ అక్కడ సరుకు ఎక్కువగా దొరికే వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు.
ధరలు పెరుగుతాయని ప్రచారం..
ఇదిలా ఉండగా వ్యాపారులు ధరలు మరింత పెరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. సాధారణంగా ఉల్లి ధర కాస్తా పెరిగినపుడు వ్యాపారులు మరింత డిమాండ్ సృష్టించడం జిల్లాలో పరిపాటి. సరుకు రావడం లేదని, తక్కువ సరుకు ఉందని చెప్పి రోజురోజుకు ధర పెంచుతూ వెళ్తారు. వాస్తవానికి ఉల్లి కుళ్లిపోయే సరుకు కావున కొనుగోలు ఆపేస్తే ధర తగ్గుతుంది. కానీ రోజువారీ అవసరాలకు ఉల్లి తప్పనిసరి కావడంతో జనాలు కొనుగోలు చేయకతప్పని పరిస్థితి. దీంతో చిల్లర వర్తకులు వద్ద హోల్‌సేల్ వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతుంటారు. ఈ భారం చివరికి వినియోగదారులపైనే పడుతుంది. ప్రస్తుతం ఉన్న సరుకు కొరత, డిమాండ్‌ను అడ్డం పెట్టుకునే ధరలు పెరుగుతాయని ముందే ప్రచారం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు మానసికంగా సిద్ధమై పెంచినా కొంటారని వ్యాపారులు ఆలోచన. ఇదిలా ఉండగా ధరలు పెరుగుతాయని వ్యాపారులు చెప్పడంతో వినియోగదారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఉన్న ధరతో సర్దుకుంటున్నామని, మరింత పెరిగితే ఇబ్బందేనని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కృత్రిమ డిమాండ్ రాకుండా అధికారులు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది.
సరుకు లేకే...
ఉల్లి ధర రోజుకు రూపాయి, రెండు పెరుగుతోంది. మహరాష్ట్రలో జనవరి, ఫిబ్రవరిలో పండే సరుకు చివరి దశకు చేరడంతో దొరకడం లేదు. ఈ సీజన్‌లో కర్నూలు నుంచి ఉల్లి వస్తుంది. కానీ వర్షాలు వల్ల రాకపోవడంతో కొరత ఉంది. దీంతో ధర పెరుగుతుంది.
– ఎస్.వి.వి.లక్ష్మీనారాయణ, వ్యాపారి
దృష్టి పెడతాం...
ఉల్లి ధరలు పెరుగుతున్నాయి. సరుకు తక్కువగా రావడం వల్ల అక్కడే పెరగడం వల్ల ఇక్కడ మార్కెట్‌లో పెరగక తప్పదు. ఇప్పటివరకు కృత్రిమ కొరత, డిమాండ్ వ్యాపారులు సృష్టిస్తున్నట్లు సమాచారం లేదు. కానీ మున్ముందు ధర పెరిగే అవకాశం ఉన్నందున సరుకు లభ్యతపై దృష్టి పెడతాం.
– శ్యామ్‌కుమార్, ఏడీ మార్కెట్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment