సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఉల్లి ధరలు ఘాటెక్కి వినియోగదారుల కంట తడి పెట్టిస్తున్నాయి. రాష్ర్టంలో బాగా వర్షాలు కురిశాయని ఆనందించాలో, ఆ వర్షాలే ఉల్లి పంటను నాశనం చేశాయని బాధ పడాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌లో సోమవారం కిలో ఉల్లి ధర రూ.45 పలికింది. గత వారం రూ.30 ఉన్న ధర అమాంతం యాభై శాతం పెరిగింది. రంజాన్‌తో పాటు ఇతర పండుగలు సమీపిస్తున్నందున ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
మహారాష్ట్ర నుంచి సరఫరా తగ్గిపోవడం కూడా ధర పెరుగుదలకు కారణమని వారు విశ్లేషించారు. రాష్ట్రంలో స్థానికంగా చిత్రదుర్గ, చిక్కమగళూరు, దావణగెరె జిల్లాలపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే భారీ వర్షాల వల్ల ఈ జిల్లాల్లో ఉల్లి పంట భారీగా దెబ్బతింది. ప్రస్తుతం ఈ జిల్లాల నుంచి రోజుకు 300 బస్తాల ఉల్లి మాత్రమే వస్తోంది. సాధారణ పరిస్థితుల్లో నగరానికి రోజుకు 25 వేల బస్తాలు వచ్చేవి. ప్రస్తుతం 15 వేల బస్తాలకు మించి రావడం లేదు. ఇక తమిళనాడు నుంచి వస్తే తప్ప ఆకాశం బాట పట్టిన ధరలు దిగి వచ్చేలా లేవు.
అయితే ఈ నెలాఖరుకు కానీ అక్కడ పంట చేతికి రాదు. అప్పటి వరకు ధరలు తగ్గే సూచనలు లేవని వ్యాపారులు తెలిపారు. దైనందిన జీవితంలో ఉల్లికి ఉండే గిరాకీ అందరికీ తెలిసిందే. రోజు వారీ వీటి వినియోగం నగరంలో కొన్ని వేల కిలోలు ఉంటుంది. యశ్వంతపుర మార్కెట్ యార్డులో ఉల్లిని టోకుగా విక్రయిస్తారు. అక్కడే కిలో రూ.40 వరకు పలుకుతోందని టోకు వ్యాపారులు తెలిపారు.
ఉల్లి ధరలు ఘాటెక్కి
Published Tue, Aug 6 2013 3:23 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement