సాక్షి, న్యూఢిల్లీ : ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతుండగా ఆదివారం కొన్ని ప్రాంతాల్లో కిలో ఉల్లి రూ 200 దాటడం సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. మధురై, బెంగళూర్ వంటి నగరాల్లో ఉల్లిపాయలు కిలో రూ 200పైగా పలకడంతో వినియోగదారుల జేబులు గుల్లవుతున్నాయి. మరోవైపు పలు నగరాలు, పట్టణాల్లో ఉల్లి ధర రూ 150కి ఎగబాకడంతో వంటింట్లో ఉల్లి ఘాటు మాయమైంది. ఉల్లిని అధికంగా పండించే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో పంట దెబ్బతినడం, ఖరీఫ్‌లో పంట దిగుబడి తగ్గడం వంటి కారణాలతో ఉల్లి రిటైల్ ధరలు గత కొద్దివారాలుగా భగ్గుమంటున్నాయి. నిన్నమొన్నటి వరకూ బెంగళూర్‌లో సగటున కిలో రూ 140 పలికిన ఉల్లి మార్కెట్‌లో సరఫరాలు పడిపోవడంతో అమాంతం రూ 200కి ఎగబాకింది. కోయంబత్తూర్‌లోని ఉల్లి ధర రూ 200కు చేరడంతో ఉల్లి ధర వింటేనే సగటు వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఉల్లి ధర క్వింటాల్‌కు రూ 6000 నుంచి రూ 14,000కు చేరడంతో రిటైల్ ధరలు కిలోకు రూ 200కు ఎగబాకాయని కర్ణాటక వ్యవసాయ మార్కెటింగ్ అధికారి సిద్ధగంగయ్య తెలిపారు.
ఏపీలో ఊరట
ఉల్లి ధరలు మార్కెట్‌లో కన్నీళ్లు తెప్పిస్తుంటే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉల్లి ధర భారాలు మహిళలపై పడకుండా రైతు బజార్లలో కిలో ఉల్లిని రూ 25కే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు రూ 150 పలుకుతుంటే రైతుబజార్లలో కేవలం రూ 25కే అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం పట్ల మహిళలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment