
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ నెల మొదటి వారంలో మూడు (3–5 తేదీల మధ్య) రోజులు నిర్వహించిన ద్రవ్య, పరపతి సమీక్షా సమావేశ మినిట్స్ వివరాలు గురువారం వెల్లడయ్యాయి. భారీగా పెరిగిన ఉల్లి ధరలపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగినట్లు మినిట్స్ వెల్లడించాయి. సెప్టెంబర్ నుంచీ ఉల్లి ధరలు తీవ్రంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో కేజీ ధర రూ.125 నుంచి రూ.150 వరకూ పలుకుతోంది. 2018 నవంబర్ ధరలతో పోల్చిచూస్తే, 2019 నవంబర్‌లో ఉల్లిపాయల ధర కేజీకి 175 శాతం పెరిగిందని స్వయంగా టోకు ధరల గణాంకాలు తెలిపాయి. టోకు ధర పెరుగుదల తీవ్రతే ఇంత ఉంటే, ఇక రిటైల్‌లో ఈ నిత్యావసర వస్తువు ధర పరిస్థితి ఊహించుకోవచ్చు.
ఫిబ్రవరి నుంచీ వరుసగా ఐదు ద్వైమాసిక సమీక్షా సమావేశాల సందర్భంగా ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో రేటును 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ఆర్థిక వృద్ధే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయాలకు ధరలు కట్టడిలో ఉండడం ఊతం ఇచ్చింది. అయితే ఈ నెల మొదట్లో జరిగిన ద్వైమాసిక సమీక్షా సమావేశంలో మాత్రం రెపో రేటును యథాతథంగా ఉంచాలని ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ధరల తీవ్రతే దీనికి ప్రధాన కారణం. ‘‘సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిత్యావసరాల ధరల భారీగా పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాల వల్ల ఖరీఫ్ పంట దెబ్బతినడం దీనికి కారణం’’ అని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ పరపతి విధాన సమీక్షా సమావేశంలో పేర్కొన్నారు. గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్య విధాన పరపతి సమీక్షా కమిటీలోని ఆరుగురు సభ్యులూ రెపో రేటు యథాతథ పరిస్థితికి ఓటు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment