దసరా సంభారం
సాక్షి, బెంగళూరు: సామాన్యుడికి ధరల శరాలు గుచ్చుకుంటున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న పప్పుల ధరలు పండగ సంబరాలను కాస్తా దూరం చేస్తున్నాయి. కందిపప్పు ధర డబుల్ సెంచరీకి చేరుకోవడంతో ఇక సామాన్యుడికి పండుగ సంతోషం దక్కే అవకాశం లేదని నగర వాసులు ఉసూరుమంటున్నారు. నిన్న మొన్నటి దాకా మధ్యతరగతి జీవికి ఉల్లిపాయ చుక్కలు చూపిస్తే ఇప్పుడు ఆ స్థానంలో పప్పు దినుసులు చేరిపోయాయి. కేజీ చికెన్ ధర కంటే కేజీ కందిపప్పు ధరే ఎక్కువైపోయింది. దీంతో ఇప్పుడు సామాన్యుడికి చేరువగా ఉన్న పప్పు కాస్తా ధనవంతుల ‘మెను’లో చేరిపోయింది. ఈ ధరల శరాలు నేరుగా సామాన్యుడి జేబును తాకుతుండడంతో మధ్యతరగతి జీవి జేబుకు చిల్లులు పడుతున్నాయి.
డబుల్ సెంచరీకి చేరిన కందిపప్పు.....
ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్‌లో కేజీ కందిపప్పు ధర రూ.200గా పలుకుతోంది. అంతేకాదు కందిపప్పుతో పాటు ఉద్దిపప్పు, శనగపప్పు, వేరుశనగ గింజలు ఇలా పప్పుధాన్యాలన్నీ కందిపప్పు రేటుతో పోటీపడుతూ పెరిగిపోతున్నాయి. నెల రోజుల క్రితం రూ.100గా ఉన్న కేజీ కందిపప్పు ధర అమాంతం రూ.200కు చేరిపోవడంతో బడ్జెట్‌ను సరిచూసుకోవాల్సిన పరిస్థితుల్లో సామాన్యుడు పడిపోయాడు. ఇక పప్పుధాన్యాల ధరలు ఈ విధంగా పెరిగిపోవడానికి వర్షాభావ పరిస్థితుల కారణంగా పప్పుధాన్యాల దిగుబడి తగ్గిపోవడం ప్రధాన కారణం కాగా, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని వ్యాపారులు మరింతగా మార్కెట్‌లో కొరతను ృసష్టిస్తున్నారనేది జగమెరిగిన సత్యం.
ఇక పప్పుధాన్యాల రేటు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో దసరా పండుగ సంతోషం సామాన్యుడిలో కనిపించడం లేదు. దసరా పండుగ సందర్భంలో దుర్గామాతకు ఏ నైవేద్యం వండాలన్నా మండుతున్న పప్పుధాన్యాల ధరల వైపు దీనంగా చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం సగటు మధ్యతరగతి జీవికి ఏర్పడుతోంది.
హోటళ్లలోనూ పెరిగిన రేట్లు....
ఇక కందిపప్పు, ఉద్దిపప్పు ధరలు ఆకాశాన్నంటే దిశగా పరుగెడుతున్న నేపథ్యంలో నగరంలోని హోటళ్లలో సైతం అల్పాహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే నగరంలోని హోటళ్ల యజమానుల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇడ్లీ, వడ, దోసె ఇలా అన్ని అల్పాహారాల ధరలను రూ.5చొప్పున పెంచాలని హోటళ్ల యజమానుల సంఘం తీర్మానించినట్లు తెలుస్తోంది. ఈ ధరలు మరికొద్ది రోజుల్లోనే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.