Dal prices
-
పండగ సీజన్లో శనగపప్పు ధరలకు రెక్కలు
పండగ సీజన్‌కు ముందే పప్పుల ధరలు పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా వినియోగించే శనగపప్పుకు డిమాండ్ పెరుగుతోంది. అందుకు తగిన సరఫరా లేకపోవడంతో గత నెల నుంచి వీటి ధరలు 10 శాతం పెరిగాయి. దాంతో సమీప భవిష్యత్తులో ఇంకెంత పెరుగుతుందోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.స్వీట్లు, లడ్డూలు, ఇతర వంటకాల తయారీలో శనగపప్పు అవసరం అవుతుంది. అయితే అంతకుముందు నెల వీటి ధరలు దాదాపు 5% పడిపోయాయి. దాంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించినట్లయింది. కానీ తాజా నివేదికల ప్రకారం ఇటీవల కాలంలో వీటి ధర 10 శాత పెరగడం మళ్లీ ఆందోళన కలిగిస్తుంది.ఇండియన్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్(ఐపీజీఏ) ప్రకారం..శనగపప్పుకు స్థిరమైన డిమాండ్ ఉంది. దేశీయంగా సరఫరా తగ్గింది. ప్రభుత్వం వద్ద పరిమిత స్టాక్ ఉంది. కానీ, రానున్న రోజుల్లో దిగుమతులు పెరుగుతాయి. దాంతో డిమాండ్‌ను అదుపుచేయవచ్చు. దానివల్ల ధరలు పెరగకుండా నియంత్రించవచ్చు. ప్రభుత్వం శనగపప్పు ధరలు పెరుగుతాయని ముందే ఊహించి పసుపు బఠానీలను భారీగా దిగుమతి చేసుకుంది. కానీ ఆశించిన విధంగా శనగపప్పు డిమాండ్‌ను భర్తీ చేయలేదని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ఇదీ చదవండి: భారత్‌లో అత్యుత్తమ ర్యాంకు పొందిన సంస్థఇదిలాఉండగా, సెప్టెంబరు నాటికి ఆఫ్రికా, ఆస్ట్రేలియాల నుంచి శనగపప్పు దిగుమతులు పెరగడం వల్ల ధరలు మరింత పెరగకుండా నిరోధించవచ్చని కొందరు వ్యాపారులు తెలిపారు. పసుపు బఠానీలను ఎలాంటి సుంకం లేకుండా దిగుమతి చేసుకునేలా అనుమతులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో ధరలు అదుపులో ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వాతావరణ సమస్యలు, ఆఫ్రికా సరఫరాలో జాప్యం, పండగ సీజన్, రాష్ట్ర ప్రభుత్వ కొనుగోళ్లకు అనుమతులు ఇవ్వడం వంటి కారణాలతో రానున్న రోజుల్లో కంది పప్పు ధరలు కూడా పెరుగుతాయిని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
పప్పులతో పరేషాన్.. పెరిగిన కందిపప్పు ధరలు
నిన్నామొన్నటి వరకు కూరగాయలు ధరలు ఆకాశాన్నంటగా సతమతమైన ప్రజలను ఇప్పుడు పప్పుల ధరలు పరేషాన్ చేస్తున్నాయి. కూరగాయల ధరలు కొంత మేరకు అందుబాటులోకి వచ్చాయని ఊపిరి పీల్చుకుంటుండగానే పప్పుల ధరలు అమాంతం పెరగడం వారి ఆందోళనకు కారణమవుతోంది. ప్రతీ ఇల్లు, హోటళ్లలో ప్రధానంగా వినియోగించే కంది పప్పు ధర దాదాపు రెట్టింపైంది. అంతేకాకుండా ఇతర పప్పుల ధరలు కూడా కిలోకు రూ.30 నుంచి రూ.40 మేర పెరిగాయి. జిల్లాలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు సాగు చేసినా వాతావరణం అనుకూలించక దిగుబడి పడిపోయింది. డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేకపోవటంతోనే పప్పుల ధరలు పెరగడానికి కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కందిపప్పు రూ.170కి పైగానే... కందిపప్పు ధర ఊహించని విధంగా పెరిగింది. పంట సీజన్ ఫిబ్రవరిలో రకం ఆధారంగా కేజీకి రూ.95 నుంచి రూ.105 వరకు ధర పలికింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో గరిష్టంగా రూ.110, జూన్‌లో రూ.135 వరకు లభించిన కంది పప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ.175 నుంచి రూ.185 పలుకుతోంది. మారుమూల ప్రాంతాల్లోనైతే ఏకంగా రూ.200 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కంది పంట సాగు చేస్తారు. కంది పప్పులో అకోల, నాగపూర్ రకాలకు డిమాండ్ ఎక్కువ. దీంతో ఈ రకాల ధర ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగింది. ఇక తాండూరు, దేశీయ రకం కంది పప్పుకు డిమాండ్ ఉండడంతో ధర నానాటికీ పెరుగుతోంది. ఇతర పప్పులదీ అదే బాట కంది పప్పుతో పాటు పెసర, మినప, బొబ్బెర వంటి పప్పుల ధరలు కూడా పెరిగాయి. కిలోకు రకం ఆధారంగా రూ.30 నుంచి రూ.40 వరకు పెరి గాయి. పెసర పప్పు ధర సీజన్లో గరిష్టంగా రూ.100 పలకగా, ఇప్పుడు రూ.120కి పైగానే విక్రయిస్తున్నారు. ఇక రూ.80 నుంచి రూ.90 పలికిన మినప పప్పు ధర రూ.120కి పైగానే పలుకుతోంది. అంతేకాక శనగ పప్పు ధర సీజన్లో రూ.65 నుంచి రూ.70 ఉండగా.. ఇప్పుడు వందకు చేరువైంది. సాగు తగ్గి.. కాలం కలిసిరాక.. అపరాల పంటల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గడమే పప్పుల ధరలు పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. పూర్వం అపరాల పంటలకు ప్రాధాన్యత ఉండేది. కానీ నీటి వనరులు పెరగటం, వాణిజ్య పంటలతో అధిక ఆదాయం ఉండటంతో రైతులు ఇటే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో మూడేళ్ల క్రితం వరకు వానాకాలం పెసర సాగు విస్తీర్ణం 25 వేల ఎకరాలకు పైగానే ఉండేది. కందులు కూడా 5వేల నుంచి 6 వేల ఎకరాల వరకు, అంతర పంటగా మరో ఐదు వేల ఎకరాల్లో సాగు చేసేవారు. కానీ ఈ ఏడాది పెసర సాగు 13,746 ఎకరాలకు పరిమితం కాగా కంది కేవలం 494 ఎకరాల్లో మాత్రమే వేశారు. కంది సాగు కాలం ఆరు నెలలు ఉండడంతో రైతులు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అంతేకాక దిగుబడి కూడా ఆశాజనకంగా లేకపోవటంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. వినియోగానికి తగిన విధంగా పంట సాగు లేకపోవటంతో పొరుగు రాష్ట్రాల నుంచి పప్పులను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల్లోనే సాగు విస్తీర్ణం తగగా... పప్పుల ధరలు బాగా పెరుగుతున్నాయి. 2015 సంవత్సరంలో అనుకూలించని వాతావరణంతో పప్పుల ధరలు భారీగా పెరగగా... ప్రభుత్వం రైతుబజార్లు, రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేసింది. మళ్లీ ఇప్పుడు ధరలు పెరుగుతున్న నేపథ్యాన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుటుందనేది వేచిచూడాలి. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకే... ఏటా అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. రైతులు ఎక్కువమంది వాణిజ్య పంటల వైపునకు మళ్లారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గటంతో పాటు వాతావరణం అనుకూలించకపోవటంతో దిగుబడి పడిపోయింది. డిమాండ్‌కు తగిన విధంగా పంట లేకపోవడంతో ధర పెరుగుతోంది. కంది పప్పుడు ధర కొద్ది నెలలుగా పెరుగుతున్నా, ఈనెల మరింత పెరిగింది. – తేరాల ప్రవీణ్‌కుమార్, వ్యాపారుల అసోసియేషన్ ప్రతినిధి, ఖమ్మం -
దిగొచ్చిన పప్పు ధాన్యాల ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లలో పప్పు ధాన్యాల ధరలు దిగొచ్చాయి. పలు ప్రధాన నగరాల్లో ప్రస్తుతం పప్పు ధాన్యాల ధరలు కిలోకు రూ.115-170 మధ్య ఉన్నాయి. అయినా నిల్వలపై పరిమితిని ఎత్తివేసేందుకు ప్రభుత్వం విముఖత చూపింది. ధరలు ఇలాగే తగ్గుతాయో లేదో మరికొంత కాలం పరిశీలిస్తామని ఆహార శాఖ రాంవిలాస్ మంత్రి పాశ్వాన్ చెప్పారు. పప్పు ధాన్యాల ధరలు దేశీయంగా కనీస మద్దతు ధర కన్నా తగ్గితే, ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యాలను నేరుగా కొంటుందని ఆయన వెల్లడించారు. -
మండనున్న పప్పు ధరలు
న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ పప్పు ధరలు కొండెక్కనున్నాయా..? గృహవినియోగదారుల బడ్జెట్ లో మళ్లీ వీటి మోత మోగనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. సగటు కన్నా తక్కువగా పప్పుధాన్యాల ఉత్పత్తి అవడంతో ఈ ధరలు భగ్గుమననున్నాయట. ధరలు తగ్గడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నా డిమాండ్-సప్లై కి మధ్య లోటు ఏర్పడటంతో వచ్చే నాలుగు, ఐదు నెలలో ఈ ధరలు పెరగనున్నాయట. సాధారణ రుతుపవనాల కాలం ఏర్పడి వచ్చే పంట కాలంలో తగినంత ఉత్పత్తి మార్కెట్లోకి వస్తేనే ఈ ధరలకు బ్రేక్ పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుసగా 17నెలల పాటు క్షీణత దశలో ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం, ఏప్రిల్ లో మొదటిసారి పెరిగింది. ఆహార, తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడంతోనే ఈ ద్రవ్యోల్బణం కొంతమేర పెరిగినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ లో పప్పు ధాన్యాల రిటైల్ ధరలు 37శాతం పెరిగాయి. ఇన్ని నెలలూ టోకు ధరల ద్రవ్యోల్బణంలో ఆహార ఉత్పత్తులు పడిపోయి డీప్లేషన్ కొనసాగినా.... దశాబ్దకాలంగా పప్పుధరలు పెరుగుతూనే ఉన్నాయని గణాంకాలు తెలిపాయి. కరువు నేపథ్యంలో ఆహారధాన్యాల ఉత్పత్తి కొంతమేర తగ్గినా.. మొత్తంగా చూస్తే వీటి ఉత్పత్తి బాగానే ఉందని గణాంకాలు చూపించాయి. గతేడాది 252.02 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఈ ఏడాది(2015-16)లో 252.53 మిలయన్ టన్నులుగా నమోదయ్యాయి. గోధుమ ఉత్పత్తి మాత్రమే 86.53 మిలియన్ టన్నుల నుంచి 94.04మిలియన్ టన్నులకు పెరిగింది. అయితే వరి, ముతక ధాన్యాలు, పప్పుధాన్యాల ఉత్పత్తి మాత్రం పడిపోయ్యాయి. పప్పు ధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోవడంతో, మార్కెట్లో ఉన్న డిమాండ్ ను ఇవి అందుకోలేకపోతున్నాయి. గతేడాది 17.15 టన్నులుగా ఉన్న వీటి ఉత్పత్తి, ఈ ఏడాది 17.06 మిలియన్ టన్నులకు పతనమైందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పప్పుధాన్యాల లోటు నుంచి బయటపడి, వీటి ధరలను అదుపుచేయడానికి ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరను పెంచాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీస మద్దతు ధర పెంచడంతోనే వీటి ఉత్పత్తిని పెంచి డిమాండ్ ను పూరించవచ్చని అంటున్నారు. -
దసరా సంభారం
సాక్షి, బెంగళూరు: సామాన్యుడికి ధరల శరాలు గుచ్చుకుంటున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న పప్పుల ధరలు పండగ సంబరాలను కాస్తా దూరం చేస్తున్నాయి. కందిపప్పు ధర డబుల్ సెంచరీకి చేరుకోవడంతో ఇక సామాన్యుడికి పండుగ సంతోషం దక్కే అవకాశం లేదని నగర వాసులు ఉసూరుమంటున్నారు. నిన్న మొన్నటి దాకా మధ్యతరగతి జీవికి ఉల్లిపాయ చుక్కలు చూపిస్తే ఇప్పుడు ఆ స్థానంలో పప్పు దినుసులు చేరిపోయాయి. కేజీ చికెన్ ధర కంటే కేజీ కందిపప్పు ధరే ఎక్కువైపోయింది. దీంతో ఇప్పుడు సామాన్యుడికి చేరువగా ఉన్న పప్పు కాస్తా ధనవంతుల ‘మెను’లో చేరిపోయింది. ఈ ధరల శరాలు నేరుగా సామాన్యుడి జేబును తాకుతుండడంతో మధ్యతరగతి జీవి జేబుకు చిల్లులు పడుతున్నాయి. డబుల్ సెంచరీకి చేరిన కందిపప్పు..... ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్లో కేజీ కందిపప్పు ధర రూ.200గా పలుకుతోంది. అంతేకాదు కందిపప్పుతో పాటు ఉద్దిపప్పు, శనగపప్పు, వేరుశనగ గింజలు ఇలా పప్పుధాన్యాలన్నీ కందిపప్పు రేటుతో పోటీపడుతూ పెరిగిపోతున్నాయి. నెల రోజుల క్రితం రూ.100గా ఉన్న కేజీ కందిపప్పు ధర అమాంతం రూ.200కు చేరిపోవడంతో బడ్జెట్‌ను సరిచూసుకోవాల్సిన పరిస్థితుల్లో సామాన్యుడు పడిపోయాడు. ఇక పప్పుధాన్యాల ధరలు ఈ విధంగా పెరిగిపోవడానికి వర్షాభావ పరిస్థితుల కారణంగా పప్పుధాన్యాల దిగుబడి తగ్గిపోవడం ప్రధాన కారణం కాగా, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని వ్యాపారులు మరింతగా మార్కెట్లో కొరతను ృసష్టిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఇక పప్పుధాన్యాల రేటు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో దసరా పండుగ సంతోషం సామాన్యుడిలో కనిపించడం లేదు. దసరా పండుగ సందర్భంలో దుర్గామాతకు ఏ నైవేద్యం వండాలన్నా మండుతున్న పప్పుధాన్యాల ధరల వైపు దీనంగా చూడాల్సిన పరిస్థితి ప్రస్తుతం సగటు మధ్యతరగతి జీవికి ఏర్పడుతోంది. హోటళ్లలోనూ పెరిగిన రేట్లు.... ఇక కందిపప్పు, ఉద్దిపప్పు ధరలు ఆకాశాన్నంటే దిశగా పరుగెడుతున్న నేపథ్యంలో నగరంలోని హోటళ్లలో సైతం అల్పాహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే నగరంలోని హోటళ్ల యజమానుల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇడ్లీ, వడ, దోసె ఇలా అన్ని అల్పాహారాల ధరలను రూ.5చొప్పున పెంచాలని హోటళ్ల యజమానుల సంఘం తీర్మానించినట్లు తెలుస్తోంది. ఈ ధరలు మరికొద్ది రోజుల్లోనే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.