నిన్నామొన్నటి వరకు కూరగాయలు ధరలు ఆకాశాన్నంటగా సతమతమైన ప్రజలను ఇప్పుడు పప్పుల ధరలు పరేషాన్ చేస్తున్నాయి. కూరగాయల ధరలు కొంత మేరకు అందుబాటులోకి వచ్చాయని ఊపిరి పీల్చుకుంటుండగానే పప్పుల ధరలు అమాంతం పెరగడం వారి ఆందోళనకు కారణమవుతోంది.
ప్రతీ ఇల్లు, హోటళ్లలో ప్రధానంగా వినియోగించే కంది పప్పు ధర దాదాపు రెట్టింపైంది. అంతేకాకుండా ఇతర పప్పుల ధరలు కూడా కిలోకు రూ.30 నుంచి రూ.40 మేర పెరిగాయి. జిల్లాలో పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు సాగు చేసినా వాతావరణం అనుకూలించక దిగుబడి పడిపోయింది. డిమాండ్‌కు తగిన విధంగా సరఫరా లేకపోవటంతోనే పప్పుల ధరలు పెరగడానికి కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కందిపప్పు రూ.170కి పైగానే...
కందిపప్పు ధర ఊహించని విధంగా పెరిగింది. పంట సీజన్ ఫిబ్రవరిలో రకం ఆధారంగా కేజీకి రూ.95 నుంచి రూ.105 వరకు ధర పలికింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో గరిష్టంగా రూ.110, జూన్‌లో రూ.135 వరకు లభించిన కంది పప్పు ధర ఇప్పుడు ఏకంగా రూ.175 నుంచి రూ.185 పలుకుతోంది. మారుమూల ప్రాంతాల్లోనైతే ఏకంగా రూ.200 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కంది పంట సాగు చేస్తారు. కంది పప్పులో అకోల, నాగపూర్ రకాలకు డిమాండ్ ఎక్కువ. దీంతో ఈ రకాల ధర ఎక్కువగా ఉండగా.. ఇప్పుడు మరింత పెరిగింది. ఇక తాండూరు, దేశీయ రకం కంది పప్పుకు డిమాండ్ ఉండడంతో ధర నానాటికీ పెరుగుతోంది.
ఇతర పప్పులదీ అదే బాట
కంది పప్పుతో పాటు పెసర, మినప, బొబ్బెర వంటి పప్పుల ధరలు కూడా పెరిగాయి. కిలోకు రకం ఆధారంగా రూ.30 నుంచి రూ.40 వరకు పెరి గాయి. పెసర పప్పు ధర సీజన్‌లో గరిష్టంగా రూ.100 పలకగా, ఇప్పుడు రూ.120కి పైగానే విక్రయిస్తున్నారు. ఇక రూ.80 నుంచి రూ.90 పలికిన మినప పప్పు ధర రూ.120కి పైగానే పలుకుతోంది. అంతేకాక శనగ పప్పు ధర సీజన్‌లో రూ.65 నుంచి రూ.70 ఉండగా.. ఇప్పుడు వందకు చేరువైంది.
సాగు తగ్గి.. కాలం కలిసిరాక..
అపరాల పంటల సాగు విస్తీర్ణం క్రమంగా తగ్గడమే పప్పుల ధరలు పెరగడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. పూర్వం అపరాల పంటలకు ప్రాధాన్యత ఉండేది. కానీ నీటి వనరులు పెరగటం, వాణిజ్య పంటలతో అధిక ఆదాయం ఉండటంతో రైతులు ఇటే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో మూడేళ్ల క్రితం వరకు వానాకాలం పెసర సాగు విస్తీర్ణం 25 వేల ఎకరాలకు పైగానే ఉండేది.
కందులు కూడా 5వేల నుంచి 6 వేల ఎకరాల వరకు, అంతర పంటగా మరో ఐదు వేల ఎకరాల్లో సాగు చేసేవారు. కానీ ఈ ఏడాది పెసర సాగు 13,746 ఎకరాలకు పరిమితం కాగా కంది కేవలం 494 ఎకరాల్లో మాత్రమే వేశారు. కంది సాగు కాలం ఆరు నెలలు ఉండడంతో రైతులు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అంతేకాక దిగుబడి కూడా ఆశాజనకంగా లేకపోవటంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది.
వినియోగానికి తగిన విధంగా పంట సాగు లేకపోవటంతో పొరుగు రాష్ట్రాల నుంచి పప్పులను వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అయితే, ఇతర రాష్ట్రాల్లోనే సాగు విస్తీర్ణం తగగా... పప్పుల ధరలు బాగా పెరుగుతున్నాయి. 2015 సంవత్సరంలో అనుకూలించని వాతావరణంతో పప్పుల ధరలు భారీగా పెరగగా... ప్రభుత్వం రైతుబజార్లు, రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేసింది. మళ్లీ ఇప్పుడు ధరలు పెరుగుతున్న నేపథ్యాన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుటుందనేది వేచిచూడాలి.
డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకే...
ఏటా అపరాల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోంది. రైతులు ఎక్కువమంది వాణిజ్య పంటల వైపునకు మళ్లారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గటంతో పాటు వాతావరణం అనుకూలించకపోవటంతో దిగుబడి పడిపోయింది. డిమాండ్‌కు తగిన విధంగా పంట లేకపోవడంతో ధర పెరుగుతోంది. కంది పప్పుడు ధర కొద్ది నెలలుగా పెరుగుతున్నా, ఈనెల మరింత పెరిగింది.
– తేరాల ప్రవీణ్‌కుమార్,
వ్యాపారుల అసోసియేషన్ ప్రతినిధి, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment