న్యూఢిల్లీ : దేశంలో మళ్లీ పప్పు ధరలు కొండెక్కనున్నాయా..? గృహవినియోగదారుల బడ్జెట్ లో మళ్లీ వీటి మోత మోగనుందా..? అంటే అవుననే అనిపిస్తోంది. సగటు కన్నా తక్కువగా పప్పుధాన్యాల ఉత్పత్తి అవడంతో ఈ ధరలు భగ్గుమననున్నాయట. ధరలు తగ్గడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నా డిమాండ్-సప్లై కి మధ్య లోటు ఏర్పడటంతో వచ్చే నాలుగు, ఐదు నెలలో ఈ ధరలు పెరగనున్నాయట. సాధారణ రుతుపవనాల కాలం ఏర్పడి వచ్చే పంట కాలంలో తగినంత ఉత్పత్తి మార్కెట్లోకి వస్తేనే ఈ ధరలకు బ్రేక్ పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వరుసగా 17నెలల పాటు క్షీణత దశలో ఉన్న టోకు ధరల ద్రవ్యోల్బణం, ఏప్రిల్ లో మొదటిసారి పెరిగింది. ఆహార, తయారీ ఉత్పత్తుల ధరలు పెరగడంతోనే ఈ ద్రవ్యోల్బణం కొంతమేర పెరిగినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ లో పప్పు ధాన్యాల రిటైల్ ధరలు 37శాతం పెరిగాయి. ఇన్ని నెలలూ టోకు ధరల ద్రవ్యోల్బణంలో ఆహార ఉత్పత్తులు పడిపోయి డీప్లేషన్ కొనసాగినా.... దశాబ్దకాలంగా పప్పుధరలు పెరుగుతూనే ఉన్నాయని గణాంకాలు తెలిపాయి. కరువు నేపథ్యంలో ఆహారధాన్యాల ఉత్పత్తి కొంతమేర తగ్గినా.. మొత్తంగా చూస్తే వీటి ఉత్పత్తి బాగానే ఉందని గణాంకాలు చూపించాయి. గతేడాది 252.02 మిలియన్ టన్నులుగా ఉన్న ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఈ ఏడాది(2015-16)లో 252.53 మిలయన్ టన్నులుగా నమోదయ్యాయి. గోధుమ ఉత్పత్తి మాత్రమే 86.53 మిలియన్ టన్నుల నుంచి 94.04మిలియన్ టన్నులకు పెరిగింది.
అయితే వరి, ముతక ధాన్యాలు, పప్పుధాన్యాల ఉత్పత్తి మాత్రం పడిపోయ్యాయి. పప్పు ధాన్యాల ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోవడంతో, మార్కెట్లో ఉన్న డిమాండ్ ను ఇవి అందుకోలేకపోతున్నాయి. గతేడాది 17.15 టన్నులుగా ఉన్న వీటి ఉత్పత్తి, ఈ ఏడాది 17.06 మిలియన్ టన్నులకు పతనమైందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పప్పుధాన్యాల లోటు నుంచి బయటపడి, వీటి ధరలను అదుపుచేయడానికి ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధరను పెంచాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనీస మద్దతు ధర పెంచడంతోనే వీటి ఉత్పత్తిని పెంచి డిమాండ్ ను పూరించవచ్చని అంటున్నారు.