కిలో రూ.158కి పడిపోయిన రేటు
శ్రావణమాసంలో తగ్గిన వినియోగం
నల్లగొండ టౌన్ : రెండు నెలలుగా కొండెక్కిని చికెన్ ధర కాస్తా తగ్గుముఖం పట్టింది. గత నెలలో కిలో చికెన్ రూ.280 వరకు పలికింది. సామాన్యులు చికెన్ రేటు చూసి తినలేక దూరంగా ఉన్నారు. శుభకార్యాలు, ఇతర పంక్షన్లు, అత్యవసరం అయితే తప్ప చికెన్ తీసుకోలేదు. ఇలా 45 రోజులపాటు చికెన్ రేటు చుక్కలు చూపించింది. కానీ, ఈ నెల మొదటి వారం నుంచి చికెన్ ధరలు రోజురోజుకు తగ్గుతున్నాయి.
ఈ నెల 5న కిలో రూ.180 ఉన్న చికెన్ ధర, 11వ తేదీ ఆదివారం నాటికి రూ.150కి పడిపోయింది. 17వ తేదీ శనివారం రూ.158గా ఉంది. ప్రస్తుతం శ్రావణమాసం కావడం ముఖ్యంగా ఈ మాసంలో పూజలు, వ్రతాలు ఇతర కార్యక్రమాలకు ఎక్కువగా ఉంటాయి. మహిళలు మాంసాహారాన్ని ఇంట్లోకి తేనివ్వరు. దీంతో చికెన్ వినియోగం తగ్గి ధరలు కూడా తగ్గాయి. మరోవైపు రేటు తగ్గడంతో కొందరు మాంసం ప్రియులు సంతోషంగా చికెన్ తీసుకుంటున్నారు.
రేటు మళ్లీ పెరుగుతుంది
ప్రస్తుతం శ్రావణమాసం కావడం, ఇతర పూజలు ఉన్నందున చికెన్ ధర రూ.150కి తగ్గింది. గత నెలలో రూ.280 వరకు ఉంది. ఈ నెలలో వివాహాలు, శుభాకార్యాలు ఉన్నందున చికెన్ ధర పెరిగే అవకాశం ఉంది.
– శ్రీశైలం, చికెన్ సెంటర్ యజమాని
Comments
Please login to add a commentAdd a comment