‘ఉల్లి’కి కళ్లెం
- రంగంలోకి మార్కెటింగ్ శాఖ
- రేపటి నుంచి రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు
- ఒక్కొక్కరికి 2 కేజీల చొప్పున విక్రయం
సాక్షి, సిటీబ్యూరో: ఉల్లి ధరలు అమాంతం పెరగడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వీటి ధరలకు కళ్లెం వేసేందుకు ఎట్టకేలకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగింది. రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వినియోగదారులకు సరసమైన ధరకు విక్రయించాలని మార్కెటింగ్ శాఖ ఇన్‌చార్జి కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని రైతుబజార్లలో ఉల్లి స్టాక్‌ను అందుబాటులో ఉంచడం ద్వారా కొరత రాకుండా చూడడంతోపాటు ధరలు పెరగకుండా నియంత్రించవచ్చని సూచించారు.
నగరంలోని అన్ని రైతుబజార్లలో సోమవారం నుంచి ప్రత్యేకంగా కౌంటర్లను ప్రారంభించనున్నారు. మలక్‌పేటలోని మహబూబ్ మాన్షన్ హోల్‌సేల్ మార్కెట్లో పెద్దమొత్తంలో ఉల్లిని సేకరించి నో లాస్... నో ప్రాఫిట్ ప్రాతిపదికన రైతుబజార్లలో విక్రయించేందుకు మార్కెటింగ్ శాఖ అదనపు డెరైక్టర్ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ప్రత్యేక కౌంటర్లలో ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున విక్రయిస్తారు. హోల్‌సేల్ మార్కెట్లో ఉన్న ధరకే ఇక్కడ వినియోగదారులకు అందజేయనున్నారు. రైతుబజార్లు అందుబాటులో లేని ప్రాంతాలకు సంచార రైతుబ జార్ల ద్వారా ఉల్లి సరఫరా చేయాలని అధికారులు భావిస్తున్నారు.
ఉల్లి సేకరణపై దృష్టి..
ఇప్పటికే ఉల్లి ధర అనూహ్యంగా పెరిగినందున సామాన్య మధ్యతరగతి వర్గాలవారు విలవిల్లాడిపోతున్నారు. డిమాండ్-సరఫరాకు మధ్య అంతరం పెరుగుతుండటంతో ధరలు ఇంకా పెరిగే పరిస్థితి కన్పిస్తోంది. అదే జరిగితే ఉల్లి ధరలు చేయిదాటిపోయే ప్రమాదం ఉన్నందున మొదట ఉల్లి కొరత ఏర్పడకుండా చూడాలని అధికారులు యోచిస్తున్నారు.
హోల్‌సేల్ మార్కెట్‌లోని ట్రేడర్స్‌తో మాట్లాడి పెద్దమొత్తంలో సరుకు సేకరించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉల్లి ధర లు అదుపులోకి వచ్చే వరకు రైతుబజార్లలో సరసమైన ధరలకు ఉల్లిని విక్రయిస్తామని మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరైక్టర్ జి.రాజశేఖర్ తెలిపారు. చిల్లర వ్యాపారులను కట్టడి చేసేందుకు ఒక్కో వినియోగదారుడికి రెండేసి కిలోల చొప్పున ఉల్లిని విక్రయిస్తామన్నారు. నగరంలో ఉల్లికి కొరత రాకుండా చూస్తే ధరలు దిగివస్తాయని ఆయన తెలిపారు.