
ఘాటెక్కిన ఉల్లి
కిలో రూ. 30- 40 మధ్యన అమ్మకాలు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: ఉల్లిగడ్డల ధరలు కొండెక్కాయి. దేశ రాజధానిలో ఉల్లి కిలో 35 నుంచి 40 రూపాయల మధ్య పలుకుతోంది. హైదరాబాద్‌లో ఆయా ప్రాంతాలను బట్టి రూ. 30 నుంచి 40 మధ్య విక్రయిస్తున్నారు. సాధారణంగానే జూలై నెలలో ఉల్లి ధర పెరుగుతుంది. ఎందుకంటే వర్షాల కారణంగా సరఫరా తగ్గుతుంది. అలాగే నాణ్యత దెబ్బతింటుంది. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరొందిన మహారాష్ట్రలోని లాసల్‌గావ్ హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లి ధర నెలరోజుల్లోనే ఏకంగా కిలోకు 15 రూపాయలు పెరిగింది.
గత రెండు దశాబ్దాల్లోనే జూలై మాసంలో ఇది అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం లాసల్‌గావ్‌లో కేజీ 25 రూపాయల పైచిలుకు పలుకుతోంది. హైదరాబాద్‌లో గురువారం హోల్‌సేల్ మార్కెట్లోనే కిలో రూ. 31కి చేరింది. మహారాష్ట్ర, కర్నూల్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి నగరానికి ఉల్లిగడ్డ సరఫరా చేస్తున్నారు. గత రబీసీజన్‌లో (మార్చిలో) అకాలవర్షాల వల్ల ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. దానికి తోడు గోదాముల్లో నిల్వచేసిన ఉల్లి కూడా బాగా పాడైపోయింది. దాంతో సరఫరా తగినంత లేక ధర పెరిగిపోతోంది.
ఎగుమతుల కారణంగా దేశీయ మార్కెట్లో ఉల్లికి కొరత ఏర్పడకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం టన్ను ఉల్లికి కనీస ఎగుమతి ధరను 27,625 రూపాయలకు పెంచింది. దిగుమతుల ద్వారా ధరలను అదుపు చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. సెప్టెంబర్ మధ్యలో కొత్త పంట చేతికి వచ్చేదాకా ఇదే పరిస్థితి ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.