సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉల్లి ఘాటెక్కుతోంది. ఉత్తర భారతంలోని ఢిల్లీ సహా ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో నవరాత్రులు ముగిసిన అనంతరం నుంచి ధరలు పెరుగుతున్నాయి. పది రోజుల కిందటి వరకు ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.30–40 వరకు ఉండగా ఇప్పుడు రూ.60–70కి చేరుకుంది. ఈ ధర నవంబర్ తొలివారం ముగిసేనాటికి ఏకంగా రూ.100 మార్కును చేరే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఉల్లి సరఫరాలో కీలకంగా ఉన్న మహారాష్ట్రలోని నాసిక్ మార్కెట్లకు సరఫరా తగ్గిందని, ఈ కారణంగా ధరలు పెరుగుతున్నాయని వారు వాదిస్తున్నారు. ధరల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బఫర్ స్టాక్ నుంచి 1.70 లక్షల టన్నుల ఉల్లి నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. మరింత స్టాక్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. శనివారం ఢిల్లీలోని 400 సఫల్ రిటైల్ స్టోర్లలో కేజీ ఉల్లి రూ.67కు విక్రయించారు.
బుధవారం ఇవే స్టోర్లలో రూ.54–56 పలికిన కిలో ఉల్లి ఇప్పుడు హఠాత్తుగా పైకి ఎగిసింది. నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్(ఎన్‌సీసీఎఫ్), జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య(నాఫెడ్) సొంత ఔట్‌లెట్లు, వాహనాల్లో మాత్రం సబ్సిడీ రేటుకే కేజీ ఉల్లిని రూ.25కే విక్రయిస్తుండం విశేషం. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం శనివారం దేశవ్యాప్తంగా కేజీ ఉల్లి సగటు ధర రూ.45 మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment