
స్మగ్లింగ్ జరగొచ్చు.. సరిహద్దుల్లో జాగ్రత్త
భద్రతాదళాలకు బంగ్లా ఆదేశం
ఢాకా: ఉల్లి ధరలు భారత్‌లో ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉల్లి స్మగ్లింగ్ జరగొచ్చని, సరిహద్దుల్లో జాగరూకతతో ఉండాలని బోర్డర్ గార్డు (బంగ్లా సరిహద్దు భద్రతాదళం)ను హెచ్చరించింది. భారత్‌లో భారీ ధరలను సొమ్ము చేసుకొనేందుకు వ్యాపారులు దొడ్డిదారుల్లో ఉల్లిని ఆ దేశానికి స్మగ్లింగ్ చేసే అవకాశముందని బంగ్లాదేశ్ అనుమానిస్తోంది. అందుకే సరిహద్దుల్లో కదలికలపై నిఘా వేసి ఉంచాలని సూచించింది.
స్వయంగా వాణిజ్య శాఖ కార్యదర్శి హిదయతుల్లా అల్ మమూన్ రంగంలోకి దిగి ఉల్లి హోల్‌సేల్ వ్యాపారులతో సమావేశమయ్యారు. సరఫరాలో తేడా వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. బంగ్లాదేశ్‌లో ఉల్లి వార్షిక డిమాండ్ 22 లక్షల టన్నులు కాగా... ఈ ఏడాది 19.3 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది.
పాత నిల్వలను కూడా కలుపుకొంటే దేశీయ అవసరాలకు సరిపడా సరుకు ఉంది. అయితే భారత్‌లో ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో... ఉల్లి పొరుగుదేశానికి తరలితే బంగ్లా దేశీయులు ఇబ్బందిపడాల్సి వస్తుందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.